Best Farmer Award
-
ఏడాదికి 5లక్షల ఆదాయం.. ఈ యువ రైతు గురించి తెలుసా?
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తనకున్న 6.5 ఎకరాల్లో ఏడాది పొడవునా బహుళ పంటలను సాగు చేస్తూ రూ. 5 లక్షల వరకు నికరాదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువ మహిళా రైతు పొంగి వినీత(20). అల్లూరి సీతారామరాజు జిల్లా బలియగూడ మండలం డుంబ్రిగూడ గ్రామంలో ఆమె ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు స్ఫూరినిస్తున్నారు. ఆమెకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఎం.వి.రెడ్డి ఉత్తమ రైతు పురస్కారా’న్ని ఇటీవల ప్రదానం చేసింది. అరకు మండలం కిలోగుడలో సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 15వ దేశీ విత్తనోత్సవంలో కూడా ఉత్తమ రైతుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పద్ధతులను తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలోని ఎర్ర నేలలో సార్వా, దాళ్వా, వేసవి సీజన్లలో వరుసగా భర్త బాలకృష్ణతో కలసి వినీత ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతుండటం విశేషం. కొండ వాగుల్లో నీటిని సేకరించి పంటలకు మళ్లించడం ద్వారా ఖరీఫ్‌తో పాటు రబీ, వేసవి పంటలను కూడా సాగు చేస్తున్నారు. వర్షాధారంగా వరి, గుళి రాగి పద్ధతిలో రాగులు, కూరగాయలు, పండ్లు, పూలు, చింతపండుతో పాటు కొద్ది సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు,మేకలను సైతం పెంచుతూ అనుదినం మంచి ఆదాయం పొందుతున్నారు. వినీత అన్ని పంటలకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే అవలంభిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయలను తయారు చేసి తమ పంటలకు వాడటంతో పాటు గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తున్నారు. పంట మార్పిడి ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఏడాది పొడవునా మూడు సీజన్లలోనూ అంతర పంటలు, బహుళ అంతస్తుల పంటలు సాగు చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదనతో పాటు గడ్డిని ఆచ్ఛాదనగా వాడుతూ నేల తేమను సమర్థవంతంగా సంరక్షించుకుంటున్నారు. చింతపల్లి, అనకాపల్లి ఆర్ఎఆర్ఎస్ల శాస్త్రవేత్తల సూచనల మేరకు జీవ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును పంటలకు వాడుతున్నారు. అంతర పంటల సాగును అనుసరిస్తారు. మొక్కజొన్న+ముల్లంగి, టొమాటో+ ముల్లంగి, పసుపు+అల్లం, బీన్స్+వంకాయ, కొత్తిమీర+టమోటాలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నారు. టమోటా, కొత్తిమీర, ముల్లంగిని దశలవారీగా విత్తటం ద్వారా సంవత్సరం పొడవునా పంట దిగుబడి తీస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయ భద్రత ఒకటికి పది పంటల సాగుతో వ్యవసాయ భూమి నుంచి సురక్షితమైన ఆదాయాన్ని పొందడంలో వినీత విజయం సాధించారు. దేశీ వరి, కూరగాయలతో పాటు పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మొత్తంగా 6.5 ఎకరాల ద్వారా సుమారు రూ. ఐదు లక్షలను ఏడాదికి సగటు నికరాదాయం పొందుతున్నారు. దేశీ వరిని వరుసలుగా విత్తటం, గుళి పద్ధతిలో రాగి నారు మొక్కలను నాటేసి సాగు చేయటం, అంతర పంటలు, మొక్కజొన్న ఇతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం వినీత ప్రత్యేకత. పాత విత్తనాలనే వాడుతున్నాం. విత్తనాలను మునుపటి పంట నుండి సేకరించి తదుపరి సీజన్‌కు వినియోగిస్తాం. ఎక్కువగా దేశీ రకాలనే వాడుతున్నాం. సహజ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఆహారోత్పత్తులను థిమ్సా ఎఫ్.పి.ఓ. ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నందున మంచి ఆదాయం వస్తోంద’ని వినీత తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌లో 4.3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2 ఎకరాల్లో వరి (దిగుబడి 32 క్విం./రూ. 26 వేల నికరాదాయం), అరెకరం మొక్కజొన్న (9 క్విం./రూ.12,500), ఎకరంలో రాగులు (7.5 క్విం./ రూ.11,500), అరెకరంలో టొమాటో (4.8 క్విం./రూ.4,200), 30 సెంట్లలో సామలను వినీత సాగు చేశారు. రబీలో 3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అరెకరంలో వరి (9 క్విం./రూ. 8,550 నికరాదాయం), అరెకరంలో మొక్కజొన్న (6 క్విం./రూ.8,000), ఎకరంలో టొమాటో (12.6 క్విం./ రూ.12,100), అరెకరంలో ముల్లంగి (1.25 క్విం/రూ.2వేలు), 30 సెంట్లలో పచ్చిమిరప, కూరగాయలను సాగు చేశారు. అదేవిధంగా ఎండాకాలంలో ఎకరంన్నరలో పంటలు సాగు చేశారు. 30 సెంట్లలో కొత్తిమీర, 20 సెంట్లలో ముల్లంగి, అరెకరంలో కూరగాయలు, అరెకరంలో టొమాటోలు సాగు చేశారు. ఎకరంన్నరలో బొప్పాయి, అరటి, అల్లం, పసుపు వంటి వార్షిక పంటలను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు కాఫీ, మిరియాలు 40 సెంట్లలో సాగు చేస్తున్నారు. 30 పనస, 6 చింత చెట్లున్నాయి. అన్ని పంటలు, కోళ్లు, గొర్రెలు, మేకల ద్వారా ఏటా సగటున రూ. 5 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు వినీత తెలిపారు. -
కాలక్షేపంలో కాసుల పుట్ట
ఇంటిపనులతో ఎప్పుడూ బిజీగా ఉండే గృహిణులు కాస్త సమయం దొరికితే... నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటారు. షిజే వర్గీస్ అలాగే తనకు నచ్చిన çపుట్టగొడుగుల సాగును చేపట్టి ఖాళీసమయాన్ని కాసుల పంటగా మార్చి, నెలకు లక్షరూపాయలకు పైగా ఆర్జిçస్తున్నారు. మరోపక్క తనలాంటి వారెందరికో పుట్టగొడుగు ల పెంపకం గురించి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది గుర్తించిన కేరళ ప్రభుత్వం ‘బెస్ట్ మష్రుమ్ ఫార్మర్’ అవార్డుతో సత్కరించింది. కేరళలోని అలప్పుఱ జిల్లా ఎరమళ్లూ్లర్కు చెందిన షిజే వర్గీస్ ఇంటిపనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవారు. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండడంతో షిజేకు కాస్త తీరిక దొరికింది. అప్పుడే అనుకోకుండా షిజే ఇంటికి దగ్గర్లో ‘‘పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిçస్తున్నాం. మీరు పాల్గొనండి’’ అని వ్యవసాయ అధికారి షిజేను ఆహ్వానించారు. అక్కడ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుంది. అది నచ్చడంతో ఇంట్లోనే పుట్టగొడుగుల సాగును ప్రారంభించింది. రెండు ప్యాకెట్లు, ఆరు బెడ్లు.. 2007లో రెండు ప్యాకెట్ల విత్తనాలు, ఆరు బెడ్లతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. కానీ పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు. అయితే షిజే భర్త ఆమెను ప్రోత్సహించడంతో ఈ సారి 300 బెడ్లతో పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో కేరళలో పుట్టగొడుగులు సాగుచేస్తోన్న అనేక ప్రాంతాలను సందర్శించి దానిలో మరిన్ని మెలకువలు నేర్చుకుని వాటిని తన సొంత క్షేత్రం లో అమలు చేయడంతో విజయం సాధించింది. కూన్ ఫ్రెష్.. షిజే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన రెండేళ్లల్లో పోషకాలతో కూడిన ‘ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులను’ సాగు చేసి వాటిని ‘కూన్ఫ్రెష్’పేరిట విక్రయించేవారు. మలయాళంలో కూన్ అంటే పుట్టగొడుగులు అని అర్థం. కూన్ఫ్రెష్ మష్రుమ్స్ రుచికరంగా ఉండడంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రెండు వేల బెడ్లు రోజుకు ఎనిమిది నుంచి పది కేజీల వరకు పంటను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి మంచి ధర పలకడం తో నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ విషయం వ్యవసాయ శాఖాధికారులకు తెలియడంతో వారు ఆమె ఇంటికి వచ్చి పుట్టగొడుగుల సాగును పరిశీలించి, మరింత మందికి ఆమెతో క్లాసులు చెప్పించేవారు. దీంతో షిజే వారికి టీచర్‌గా మారి పుట్టగొడుగుల పెంపకం గురించి బోధించడం ఆరంభించారు. సొంతంగా విత్తనాల తయారీ.. తొలినాళ్లల్లో వేరే రైతుల వద్ద విత్తనాలు, క్రిమిసంహారాలు గురించి తెలుసుకుని వాడేవారు. షిజేకు పుట్టగొడుగుల సాగుపై అనుభవం పెరిగేటప్పటికీ స్వయంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కోచ్చిలోని సూపర్ మార్కెట్లలో పుట్టగొడుగులను విక్రయించేవారు. తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షిజే వీక్లీ క్లాసులు నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ కొత్తగా వచ్చేవారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ మొత్తం పనిలో షిజేకి భర్తతోపాటు కొడుకు, కూతురు సాయం చేస్తున్నారు. ఎవరైనా చేయవచ్చు.. ‘‘ప్రారంభంలో నాకు ఇష్టలేకపోయినప్పటికీ మావారి ప్రోత్సాహంతో ఈరోజు ఈస్థాయికి ఎదిగాను. పోషకాలతో కూడిన పుట్టగొడుగులు ఉత్పత్తి చేయడం వల్ల మా కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ వచ్చింది. పుట్టగొడుగుల సాగు ఎవరైనా చేయవచ్చు. నిబ్బద్దత, ఆసక్తి, సహనంతో చేయగలిగితే మంచి లాభాలు ఆర్జించవచ్చు’’ అని షిజే చెప్పారు. -
ఉత్తమ కర్షకులకు రైతురత్న అవార్డులు
సాక్షి, హైదరాబాద్: సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మొదలగు రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నలుగురు రైతులతో పాటు ఒక మహిళా రైతును రాష్ట్ర స్థాయిలో గుర్తించి వారికి గౌరవ సన్మాన పురస్కారాలతో పాటు ‘రైతురత్న’అవార్డు ప్రదానం చేయాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిర్ణయించింది. ఆధునిక పద్ధతుల ద్వారా సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను ఈ నెల 23లోగా అందజేయాలని తెలిపింది. వివరాలకు విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి.రంగారెడ్డి (8886861188), వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బి.కృపాకర్‌రెడ్డి(9391409959)లను సంప్రదించాలని సూచించింది. -
సేంద్రియ మల్బరీతో లాభాల పట్టు!
ఎదుగూ బొదుగూ లేని కాంట్రాక్టు ఉద్యోగం కన్నా.. లోతైన అవగాహనతో సేంద్రియ సేద్యం చేయటమే ఉత్తమమం. అందులోనూ సాధారణ పంటల కన్నా నెల నెలా ఆదాయాన్నిచ్చే సేంద్రియ మల్బరీ సాగే మేలని ఓ యువ రైతు రుజువు చేశారు. అంతేకాదు, ఉత్తమ రైతుగా పురస్కారాన్ని అందుకోవటం విశేషం. ఆదర్శ రైతు స్ఫూర్తిదాయక గాథ ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. మామిడి సైదులు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో సేంద్రియ మల్బరీ సాగు చేసుకుంటూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన సైదులు.. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సెరికల్చర్ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్(కాంట్రాక్టు ఉద్యోగి)గా ఆరేళ్లు పనిచేశాడు. ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో 2006లో ఉద్యోగం మానేసి మల్బరీ రైతుగా మారారు. నల్లగొండ పట్టు పరిశ్రమ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారం, సలహాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో నాలుగు ఎకరాల మల్బరీ తోట సాగు చేస్తున్నారు. ఆకు నాణ్యత కోసం వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు వాడుతున్నారు. సంవత్సరానికి కనీసం 7 పంటలు తీస్తున్నారు. 300 గుడ్లు చాకీ చేసి 45 రోజుల్లో ఒక పంట తీస్తున్నారు. పంటకు అన్ని ఖర్చులూ పోను రూ.75 వేల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా నికరాదాయం పొందుతున్నారు. వీలైనంత వరకు పనులన్నీ భార్య భర్త ఇద్దరే చేసుకుంటారు. పంట చివరి 7 రోజుల్లో మాత్రం నలుగురు కూలీల సహాయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో పలువురు రైతులు పట్టు శాఖ అధికారుల తోడ్పాటుతో సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టు గూళ్ల ఉత్పత్తే లక్ష్యంగా.. గతంలో జిల్లాలో మల్బరీ రైతులు పట్టు పురుగులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పట్టు గుడ్లను ఉత్పత్తి చేసేవారు. దీనివలన రైతుకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. సైదులు పట్టు పురుగుల ఉత్పత్తి కోసం తన ఇంటి ఆవరణలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని టెక్నికల్ సర్వీస్ సెంటర్ సరఫరా చేస్తున్న పట్టు గుడ్లను తీసుకొచ్చి ట్రేలలో గుడ్లను పెట్టి, నల్లటి గుడ్డ కప్పి, గుడ్లు పగిలే దశలో వాటిని బయటకు తీస్తారు. మల్బరీ ఆకును చాకింగ్ మిషన్ ద్వారా కట్ చేసి శైశవ దశలో పురుగులకు మేతగా వేసి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల రైతులకు విక్రయించడం ద్వారా సైదులు అధిక లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన అధికారి కృష్ణవేణి తెలిపారు. మల్బరీ రైతులకు షెడ్ నిర్మాణానికి, డ్రిప్‌కు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల అధికారులను సంప్రదించవచ్చన్నారు. – చవగాని నాగరాజుగౌడ్, సాక్షి, పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా పట్టు పురుగుల విక్రయంతో అధిక లాభాలు గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో లాభసాటిగా మల్బరీ సాగు చేస్తున్నాను. గుడ్లను తీసుకొచ్చి ఇంటి దగ్గరే పట్టు పురుగులు పెంచుతున్నాను. ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాను. – మామిడి సైదులు (99599 33842), మల్బరీ రైతు, లింగాల, సూర్యాపేట జిల్లా -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు
మహేశ్వరం: కంది పంట సాగు చేసి నాణ్యతతో కూడిన విత్తనాలను తయారు చేసినందుకు మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు కొరుపోలు రఘుమారెడ్డికి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు దక్కింది. గురువారం కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా నగరంలోని సంతోష్‌నగర్‌లో ఉన్న కృషి వి/êన కేంద్రంలో రఘుమారెడ్డికి అవార్డు అందజేశారు. తన పొలంలో రఘుమారెడ్డి కంది పంట పిఆర్‌జీ 176 రకం, ఉలవలు సీఆర్‌హెచ్‌జీ 04 రకం పండించి అధిక దిగుబడి సాధిచడంతో పాటు నాణ్యతతో కూడిన విత్తనాలను ప్రదర్శించారు. అచ్చు పద్ధతిలో కంది, ఉలవల పంటలు సాగు చేసి ఎకరానికి 5.5 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పంటలను క్రిడా అధికారులు పరిశీలించారని, అందరి కంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో పాటు అవి నాణ్యతగా ఉండడంతో రఘుమారెడ్డికి అవార్డు అందజేశామని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకురాలు ఉషారాణి చెప్పారు. కొత్త పరిశోధనలతో పంటలను పండించి అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రోత్సహించి అవార్డు అందజేసి సత్కరిస్తామని ఆమె తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పది మంది రైతులను ఎంపిక చేసి అవార్డులు అందజేశామన్నారు. ఈ సందర్బంగా అవార్డు పొందిన రైతు రఘుమారెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరిన్ని కొత్త పద్ధతులతో పంటలను సాగు చేస్తానని, తాను పాటించిన పద్ధతులను ఇతర రైతులకు తెలియజేస్తానని అన్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ రుద్రమూర్తి, మండల వ్యవసాయాధికారి కోటేశ్వరరెడ్డి, ఏఈఓ రాజు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీలో సీఎంకు ఉత్తమ రైతు అవార్డు
సీఎం తరఫున అవార్డు స్వీకరించనున్న మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్–2017 ఉత్తమ రైతు అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఢిల్లీలో అందుకోనున్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. భారత ఆహార వ్యవసాయ మండలి (ఐసీఎఫ్ఏ) సీఎం కేసీఆర్‌ను గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు ఐసీఎఫ్ఏ తెలిపింది. 2008 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నామని పేర్కొంది.