సమష్టి కృషితోనే యూనివర్సిటీకి ఉత్తమ గ్రేడ్
వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్
ఏఎన్‌యూ : యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేస్తేనే ఏఎస్యూకు ఉత్తమ నాక్ గ్రేడ్‌ను సాధించగలుగుతామని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ అన్నారు. నాక్ బృందం డిసెంబర్ మొదటి వారంలో ఏఎన్‌యూలో జరిపే పర్యటనలో అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌లో బుధవారం యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు, యూనివర్సిటీ మధ్య సత్సంబంధాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, విద్యార్థులకు అందించే సేవలు, పరస్పర సహకారం తదితర అంశాలపై నాక్ బృందం అనుబంధ కళాశాలతో సమావేశం కానుందన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు పూర్తి సమాచారం, అవగాహనతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. యూనివర్సిటీ మంచి గ్రేడు సాధిస్తే అనుబంధ కళాశాలలకు కూడా మంచి పేరు వస్తుందని, దానిని దృష్టిలో ఉంచుకుని కళాశాలలు సన్నద్ధం కావాలన్నారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు వివిధ అంశాలపై కళాశాలల యాజమాన్యాలకు సూచనలిచ్చారు. కళాశాలల యాజమాన్యాలు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు.