బాహుబలికి పురస్కారం
జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు స్వీకరించిన రాజమౌళి
63వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: 'బాహుబలి' సినిమా ఘనత మరోసారి జాతీయస్థాయిలో మార్మోగింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ సినిమాకు గాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు అందించారు. జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటిగా ఎంపికైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్‌లు కూడా ప్రణబ్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగిన 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేశారు. వెటరన్ హీరో మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
పీకూ సినిమాలో నటనకుగాను అమితాబ్‌కు, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో అత్యుత నటన ప్రదర్శించిన కంగనాకు ఈ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
జాతీయ అవార్డుల విజేతలు
ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పికు)
ఉత్తమ నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్: రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ)
ఉత్తమ హిందీ చిత్రం: దమ్ లగాకే హైసా
ఉత్తమ తెలుగు చిత్రం: కంచె
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: నీరజ్ ఘేవాన్ (మసాన్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులు: బాహుబలి
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ)
ఉత్తమ సహాయనటుడు: సముద్రకని (విసారనై)
ఉత్తమ సహాయనటి: తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ బాల నటుడు: గౌరవ్ మీనన్ (బెన్)
ఉత్తమ బాలల చలనచిత్రం: దురంతో
జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం: నానక్ షా ఫకీర్
పర్యావరణ పరిరక్షణపై ఉత్తమచిత్రం: వాలియా చారకుల్ల పక్షికల్
ఉత్తమ గాయని: మోనాలి ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే.. దమ్ లాగాకే హైసా)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయీజాన్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విశాల్ భరద్వాజ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జుహు చతుర్వేది (పికు), హిమాన్శు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీలో 'దివానీ మస్తానీ' పాట)
ఉత్తమ చలనచిత్రం (నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారం): నానక్ షా ఫకీర్