best panchayat
-
ఉత్తమ పంచాయతీలుగా మూడు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: ప్రగతి పథంలో పయనిస్తూ ఆదర్శంగా నిలిచిన మూడు గ్రామాలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా కేంద్ర ప్రభుత్వం ఎం పిక చేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం పంచాయతీలను ‘నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ పురస్కార్’కింద అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గ్రామాల్లో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే డ్రోన్ల సహకారంతో ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ‘స్వమిత్వ’ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. పల్లెసీమలకు పెద్దపీట: ఎర్రబెల్లి గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ సంస్థల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. -
పంచాయతీలకు ‘ఉత్తమ’ గుర్తింపు
సాక్షి, విజయనగరం రూరల్: తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, జీపీడీఏ, ఆడిట్ నిర్వహణ వంటి ఐదు అంశాలలో చూపిన ప్రగతి ఆధారంగా ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసింది. జిల్లా, మండల స్థాయిలో ఎంపికైన పంచాయతీలకు నగదు బహుమతులను ఆయా పంచాయతీల ఖాతాలకు జమచేసింది. 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 34 మండలాల్లో జిల్లా స్థాయిలో గరివిడి మండలం బొండపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచింది. చీపురుపల్లి మండలం కర్లాం రెండో స్థానం, మెంటాడ మండలం బుచ్చిరాజుపేట పంచాయతీకి మూడో స్థానం దక్కింది. మొదటి బహుమతి కింద రూ.3 లక్షలు, రెండో బహుమతి సాధించిన పంచాయతీకి రూ.2 లక్షలు, మూడో స్థానం సాధించిన పంచాయతీకి రూ.లక్ష బహుమతిగా పంచాయతీల ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పంచాయతీలకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానం సాధించిన పంచాయతీకి రూ.75 వేలు నగదు బహుమతిని పంచాయతీ ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ విధానంలో నిధులు జమ చేశారు. పోటీతత్వంతోనే అభివృద్ధి ఏటా పంచాయతీల్లో జరిగే ఐదు అంశాల ప్రగతి ఆధారంగా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికచేస్తారు. పంచాయతీల మధ్య పోటీతత్త్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉంది. – బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి -
కొత్తపేట.. ఉత్తమ పంచాయతీ
పురస్కారం అందుకున్న సర్పంచ్ అనురాధ కొత్తపేట : స్వచ్ఛ భారత్ పథకాల లక్ష్య సాధనలో కొత్తపేట గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో లక్ష్య సాధనతో పాటు, ఘనవ్యర్థాల నిర్వహణ ద్వారా వర్మీ కంపోస్టు తయారీ కేంద్రం నిర్మాణం వంటి కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని కొత్తపేటను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆదివారం విజయవాడలో కృష్ణా పుష్కరాలు– 2016 వేదికపై ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సర్పంచ్ మిద్దే అనురాధ, ఆమె భర్త పంచాయతీ సభ్యుడు మిద్దే ఆదినారాయణ అందుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, కమిషనర్ రామాంజనేయులు వున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ దంపతులను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ఎంపీడీఓ పి వీణాదేవి తదితరులు అభినందించారు.