మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన మలిచర్ల
సాక్షి, విజయనగరం రూరల్: తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, జీపీడీఏ, ఆడిట్ నిర్వహణ వంటి ఐదు అంశాలలో చూపిన ప్రగతి ఆధారంగా ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసింది. జిల్లా, మండల స్థాయిలో ఎంపికైన పంచాయతీలకు నగదు బహుమతులను ఆయా పంచాయతీల ఖాతాలకు జమచేసింది. 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 34 మండలాల్లో జిల్లా స్థాయిలో గరివిడి మండలం బొండపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచింది.
చీపురుపల్లి మండలం కర్లాం రెండో స్థానం, మెంటాడ మండలం బుచ్చిరాజుపేట పంచాయతీకి మూడో స్థానం దక్కింది. మొదటి బహుమతి కింద రూ.3 లక్షలు, రెండో బహుమతి సాధించిన పంచాయతీకి రూ.2 లక్షలు, మూడో స్థానం సాధించిన పంచాయతీకి రూ.లక్ష బహుమతిగా పంచాయతీల ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పంచాయతీలకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానం సాధించిన పంచాయతీకి రూ.75 వేలు నగదు బహుమతిని పంచాయతీ ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ విధానంలో నిధులు జమ చేశారు.
పోటీతత్వంతోనే అభివృద్ధి
ఏటా పంచాయతీల్లో జరిగే ఐదు అంశాల ప్రగతి ఆధారంగా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికచేస్తారు. పంచాయతీల మధ్య పోటీతత్త్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉంది.
– బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment