Bondapalli
-
వలంటీర్లకు వందనం!
బొండపల్లి (గజపతినగరం): పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని స్వయంగా వలంటీర్లే డోలీలో 7 కి.మీ. మోసుకుంటూ 108 వాహనం వరకు తీసుకువచ్చిన ఘటన ఇది. నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన వలంటీర్ల పనితనానికి నిదర్శనమిది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గొల్లుపాలెం పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన ఏర్రోడ్ల పాలేనికి చెందిన గిరిజన మహిళ పంగి జానకమ్మకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె భర్త కామేశ్ 108కి ఫోన్ చేయగా వాహనం వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోయింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి గంధవరపు కృష్ణ వెంటనే స్పందించి తన ద్విచక్ర వాహనాన్ని గ్రామానికి పంపించగా గర్భిణి దానిపై కూర్చోలేకపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు శ్రీహర్ష, బాలాజీ డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లుపాలెం గ్రామానికి నడకదారిన మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేవరకూ ఏఎన్ఎం మమతావల్లి, ఆశ కార్యకర్త గర్భిణికి వెన్నంటే ఉండి సేవలు అందించారు. వారందరి సేవా భావానికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పంచాయతీలకు ‘ఉత్తమ’ గుర్తింపు
సాక్షి, విజయనగరం రూరల్: తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, జీపీడీఏ, ఆడిట్ నిర్వహణ వంటి ఐదు అంశాలలో చూపిన ప్రగతి ఆధారంగా ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసింది. జిల్లా, మండల స్థాయిలో ఎంపికైన పంచాయతీలకు నగదు బహుమతులను ఆయా పంచాయతీల ఖాతాలకు జమచేసింది. 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 34 మండలాల్లో జిల్లా స్థాయిలో గరివిడి మండలం బొండపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచింది. చీపురుపల్లి మండలం కర్లాం రెండో స్థానం, మెంటాడ మండలం బుచ్చిరాజుపేట పంచాయతీకి మూడో స్థానం దక్కింది. మొదటి బహుమతి కింద రూ.3 లక్షలు, రెండో బహుమతి సాధించిన పంచాయతీకి రూ.2 లక్షలు, మూడో స్థానం సాధించిన పంచాయతీకి రూ.లక్ష బహుమతిగా పంచాయతీల ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పంచాయతీలకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానం సాధించిన పంచాయతీకి రూ.75 వేలు నగదు బహుమతిని పంచాయతీ ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ విధానంలో నిధులు జమ చేశారు. పోటీతత్వంతోనే అభివృద్ధి ఏటా పంచాయతీల్లో జరిగే ఐదు అంశాల ప్రగతి ఆధారంగా ఉత్తమ పంచాయతీలుగా ఎంపికచేస్తారు. పంచాయతీల మధ్య పోటీతత్త్వం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉంది. – బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి -
బార్లా... బెల్ట్‌షాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పై చిత్రాన్ని చూశారా!. గ్రామ మేలు కోసం పెద్దలంతా కలిసి చర్చిస్తున్నట్టుగా ఉంది కదూ. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మద్యం బెల్ట్‌షాపు వేలం వేసేందుకు నిర్వహించిన సమావేశమిది. ఇటీవల బొండపల్లి మండలం ఒంపిల్లి గ్రామంలో బహిరంగంగా బెల్ట్‌షాపు కోసం వేలం వేస్తున్న దృశ్యమది. ఆ గ్రామంలో బెల్ట్‌షాపు ఏర్పాటు చేసేందుకు ఓ అసామి రూ.2లక్షలకు పాడుకున్నారు. టీడీపీ నేత, సర్పంచ్ ఇల్లాపు కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేలం పాట జరిగింది. గతంలో మద్యం బెల్ట్‌షాపులు ఎవరికి వారు నిర్వహించేవారు. ఇప్పుడు టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి వేలం పాట కూడా వేయిస్తున్నారు. ఎవరొచ్చినా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. మాకింత- మీకింత అన్న దోరణితో వ్యవహారాన్ని నడుపుతున్నారు. అధికార వర్గాలు సైతం వంతపాడుతున్నాయి. లెసైన్సు షాపు దారుడికి గిట్టుబాటు కావాలంటే బెల్ట్షాపులుండాలనే దోరణితో అధికారులు మిన్నకుండిపోతున్నారు. పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 180 లెసైన్సు మద్యం షాపులుండగా, 20 ప్రభుత్వ షాపులున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులు నామమాత్రంగా నడుస్తుండగా, లెసైన్సు షాపుల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటర్పాకెట్ తదితర వంకలతో రేట్లు పెంచి పలు చోట్ల విక్రయిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడేకంగా బెల్ట్‌షాపులు గేట్లు తెరిచారు. టీడీపీ నేతలే సూత్రధారులగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం మండలంలో ఇప్పటికే దాదాపు గ్రామంలో ఏర్పాటయ్యాయి. గజపతినగరం నియోజకవర్గంలోనైతే అడ్డూ అదుపు లేకుండా వెలుస్తున్నాయి. నియోజకవర్గ కీలక నేత అండతోనే యథేచ్ఛగా బెల్ట్‌షాపుల్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య రెండు వేలు దాటినట్టు సమాచారం. ఎక్కువ గ్రామాల్లో వేలం పాట ద్వారానే బెల్ట్‌షాపుల్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బొండపల్లి మండలం ఒంపిల్లినే తీసుకోవచ్చు. వ్యతిరేకించినా.. టీడీపీ నేత, గ్రామ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ, ఆయన అనుయాయులు బాలి సోమునాయుడు, లండ సత్యనారాయణ, గొర్లె రామునాయుడు, బాలి రమణ తదితరుల నేతృత్వంలో ఒంపిల్లి పాత పంచాయతీ కార్యాలయం ఎదురగా, ఏకంగా రామాలయం అరుగుపై వేలం పాట నిర్వహించారు. తొలుత వేలం పాటను కొందరు వ్యతిరేకించారు. కానీ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మానాపురం గౌరీశంకర్ తీవ్ర స్థాయిలో విభేదించారు. సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. కానీ సర్పంచ్ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్వహించి తీరుతామని, ఏం చేయలేవని తిరిగి గౌరీశంకర్‌పై ధ్వజమెత్తారు. చివరికీ ఏం చేయలేక గౌరీశంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేలం పాట కానిచ్చేశారు. వేలం పాల్గొనేందుకు రూ.500ప్రవేశ రుసుం నిర్ణయించారు. ఆ మొత్తాన్ని చెల్లించిన వారే పాటలో పాల్గొన్నారు. తొలుత రూ.500...రూ.5000వేలు...50వేలు...లక్ష...లక్షా 50వేలు...లక్షా 70వేలు...లక్షా 90వేలు...చివరికీ రూ.2లక్షలకు పాడిన వ్యక్తికి పాట ఖరారు చేశారు. అంతేకాకుండా బెల్ట్‌షాపు నిర్వహించేం దుకు పాట ద్వారా అనుమతిచ్చినట్టు కాగితాలు కూడా రాసుకున్నారు. ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే తంతు నడుస్తోంది. -
కేజీబీవీ విద్యార్థిని మృతి
బొండపల్లి: కూరగాయల మీద దోమలు, స్టోర్‌రూం, డైనింగ్ రూంలో చెత్త, గచ్చులపై మురికి, నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు... దేవుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరిస్థితులివి. ఈ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న ఎస్టీ బాలిక బోయిన పైడమ్మ కడుపునొప్పితే శనివారం మృతి చెందింది. విద్యాలయంలో ఉన్న పరిస్థితుల వల్లే బాలిక అనారోగ్యానికి గురైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టోర్ రూమ్‌లో ఎవరు ప్రవేశించినా రూ.5 జరిమానా విధిస్తామని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. అలాగే బాలికలను పట్టించుకునే వారే అక్కడ కరువయ్యారు. పాఠశాల వాతావరణం దుర్గంధ భూయిష్టంగా మారాంది. దుర్భరమైన పరిస్థితుల మధ్య విద్యార్థినులు తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకొనసాగిస్తున్నారు. పాఠశాలలో 200 మందిగాను 156 మంది విద్యార్థులను మాత్రమే ఉన్నారు. అధికారుల పరిశీలనలోనూ ఈ విషయాలే వెల్లడయ్యాయి... రామభద్రపురం మండలం ఆర్.చింతలవలస గ్రామానికి చెందిన 12 ఏళ్ల బోయిన పైడమ్మకు తల్లిదండ్రులు లేరు. ఆమె సంరక్షకుడు, మేనమామ కె.శేఖర్ జూన్ 25, 2014లో దేవుపల్లి కేజీబీవీలో ఆమెను చేర్పించాడు. ఆమెకు ఈ నెల నా లుగో తేదీన కేజీబీవీలో ఉండగా కడుపునొప్పి వచ్చింది. దీంతో విద్యాలయానికి చెందిన ఏఎన్ఎం ప్రథమ చికిత్స అందించి దేవుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం పైడమ్మ ఆరోగ్యం ఇంకా క్షీణించింది. దీంతో బాలిక మేనమామ ఆమెను మార్చి 5న స్వగ్రామం తీసుకెళ్లిపోయారు. అయితే శనివారానికే పైడమ్మ చనిపోయింది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ బండారు బాలాజీ,తహశీల్దార్ నీలకంఠరావు, ఈఓపీఆర్డీ రవికుమార్ విలేకరులతో పాటు కేజీబీవీకి వెళ్లి పరిస్థితులను కళ్లారా చూశారు. వారు వెళ్లిన సమయానికి ప్రత్యేకాధికారి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలపై ముసురుతున్న ఈగలు, అక్కడి అపారిశుద్ధ్యాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు తేలడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా గర్ల్స్ అండ్ ైచె ల్డ్ డెవలప్ మెంట్ అధికారి సత్యవతి వచ్చి పరిశీలించారు. ప్రత్యేకాధికారి జి.సరస్వతిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. అధికారుల ఎదుటే వాంతులు అధికారులు పరిశీలనకు వెళ్లిన సమయంలో ఓ విద్యార్థిని వాంతులు చేసుకుంటూ కనిపించింది. ఏఎన్ఎం అక్కడే ఆమెకు మాత్రలు మింగిస్తున్నారు. కేజీబీవీలో ఆహారం రుచిగా ఉండడం లేదని, నాసిరకం బియ్యం వండి పెడుతున్నారని, కుళ్లిపోయిన కూరగాయాలు పెడుతున్నారని సాక్షాత్తు తహశీల్దార్ నీలకంఠరావు తీవ్ర ఆగ్రహంతో చెప్పారు. కలెక్టర్‌తో చెప్పి సిబ్బందిపై, ప్రత్యేకాధికారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీటీసీ బాలాజీ హెచ్చరించారు. -
హత్యా? ఆత్మహత్యా?
బొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. డాబాలకొత్తవలస మండలం చింతలదిమ్మ గ్రామానికి చెందిన బలగసంతోష్ (30) ఆరేళ్ల క్రితం దేవుపల్లి గ్రామానికి చెందిన చలపాకఅంజి కుమార్తె ఉమాసత్యవతిని వివాహం చేసుకుని అత్తవారింటి పక్కనే ఇల్లుకట్టుకుని భార్య,ఇద్దరు పిల్లలుశేవతరాణి,వంశీకృష్ణతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన సంతోష్ మంచి పేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్నపాటి తగాదాలు జరుగుతుండడంతో అదే గ్రామంలోని బంధువులు సముదాయించి వారి కాపురాన్ని చక్కదిద్దారు. అయితే సంతోష్‌కు గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య ఉమాసత్యవతి,ఆమె మేనమామలు పెద్దమనుషుల వద్ద సోమవారం పంచాయితీ పెట్టించారు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ రాత్రి 10.30 సమయంలో రసాయనాలు తాగాడని. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మర్గమధ్యంలో మృతి చెందినట్లు భార్య, బంధువులు చెప్పారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కుమారుడు సంతోష్‌ను భార్య ఉమాసత్యవతి ఆమె బంధువులు కొట్టి చంపి ఉంటారని ఆత్మహత్య చేసుకున్నట్లు కథ అల్లుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్‌కు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరగడంతో గ్రామానికి చెందిన వారు ఎవరైనా కక్ష తీర్చుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొండపల్లి ఎస్సై తారకేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజపతినగరం సీఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా హత్యా,ఆత్మహత్యా అనేది తెలుసుకుని కేసు నమోదు చేస్తామని మృతుని బంధువులకు సీఐ తెలిపారు. -
వాహనం ఢీ - ఒకరి మృతి
బొండపల్లి, న్యూస్‌లైన్ : పొట్ట కూటి కోసం ఊరూరూ సైకిల్‌పై తిరుగుతూ టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా.. టాటాఏస్ వాహనం పొట్టనబెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. మండలంలోని గొట్లాం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొట్లాం గ్రామానికి చెందిన పసుమర్తి త్రినాథ(50) సమీప గ్రామాలకు సైకిల్‌పై టిఫిన్ తీసుకెళ్లి, అమ్ముతూ జీవనం సాగించేవాడు. రోజూ మాది రిగానే ఆదివారం జియ్యన్నవలస గ్రామంలో టిఫిన్ అమ్ముకుని తిరిగి స్వగ్రామం గొట్లాం వైపు సైకిల్ నడిపించుకుని వస్తుండగా.. జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విజయనగరం వైపు అతివేగంగా వస్తున్న టాటాఏస్ వాహనం బలంగా ఢీకొంది. దీంతో త్రినాథ కొంతదూరం ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. త్రినాథను ఢీకొన్న అనంతరం అదే వాహనం అటుగా చెరువు నుంచి వస్తున్న గొట్లాం గ్రామానికి చెందిన చింతపల్లి నారాయణరావు, ఓల్ల సత్యంను ఢీకొంది. ఈ ఘటన లో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బొండపల్లి పోలీసులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు త్రినాథకు భార్యతోపాటు, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ప్రమాద ఘటనపై ట్రెనీ ఎస్సై అశోక్‌కుమార్, ఏఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.