డోలీలో గిరిజన మహిళను ఆస్పత్రికి తీసుకొస్తున్న గ్రామ వలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు
బొండపల్లి (గజపతినగరం): పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని స్వయంగా వలంటీర్లే డోలీలో 7 కి.మీ. మోసుకుంటూ 108 వాహనం వరకు తీసుకువచ్చిన ఘటన ఇది. నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన వలంటీర్ల పనితనానికి నిదర్శనమిది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. గొల్లుపాలెం పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన ఏర్రోడ్ల పాలేనికి చెందిన గిరిజన మహిళ పంగి జానకమ్మకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె భర్త కామేశ్ 108కి ఫోన్ చేయగా వాహనం వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోయింది.
సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి గంధవరపు కృష్ణ వెంటనే స్పందించి తన ద్విచక్ర వాహనాన్ని గ్రామానికి పంపించగా గర్భిణి దానిపై కూర్చోలేకపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు శ్రీహర్ష, బాలాజీ డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లుపాలెం గ్రామానికి నడకదారిన మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేవరకూ ఏఎన్‌ఎం మమతావల్లి, ఆశ కార్యకర్త గర్భిణికి వెన్నంటే ఉండి సేవలు అందించారు. వారందరి సేవా భావానికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment