సాక్షి ప్రతినిధి, విజయనగరం : పై చిత్రాన్ని చూశారా!. గ్రామ మేలు కోసం పెద్దలంతా కలిసి చర్చిస్తున్నట్టుగా ఉంది కదూ. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మద్యం బెల్ట్‌షాపు వేలం వేసేందుకు నిర్వహించిన సమావేశమిది. ఇటీవల బొండపల్లి మండలం ఒంపిల్లి గ్రామంలో బహిరంగంగా బెల్ట్‌షాపు కోసం వేలం వేస్తున్న దృశ్యమది. ఆ గ్రామంలో బెల్ట్‌షాపు ఏర్పాటు చేసేందుకు ఓ అసామి రూ.2లక్షలకు పాడుకున్నారు. టీడీపీ నేత, సర్పంచ్ ఇల్లాపు కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేలం పాట జరిగింది. గతంలో మద్యం బెల్ట్‌షాపులు ఎవరికి వారు నిర్వహించేవారు. ఇప్పుడు టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి వేలం పాట కూడా వేయిస్తున్నారు. ఎవరొచ్చినా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. మాకింత- మీకింత అన్న దోరణితో వ్యవహారాన్ని నడుపుతున్నారు. అధికార వర్గాలు సైతం వంతపాడుతున్నాయి. లెసైన్సు షాపు దారుడికి గిట్టుబాటు కావాలంటే బెల్ట్‌షాపులుండాలనే దోరణితో అధికారులు మిన్నకుండిపోతున్నారు. పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో 180 లెసైన్సు మద్యం షాపులుండగా, 20 ప్రభుత్వ షాపులున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులు నామమాత్రంగా నడుస్తుండగా, లెసైన్సు షాపుల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటర్‌పాకెట్ తదితర వంకలతో రేట్లు పెంచి పలు చోట్ల విక్రయిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడేకంగా బెల్ట్‌షాపులు గేట్లు తెరిచారు. టీడీపీ నేతలే సూత్రధారులగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం మండలంలో ఇప్పటికే దాదాపు గ్రామంలో ఏర్పాటయ్యాయి. గజపతినగరం నియోజకవర్గంలోనైతే అడ్డూ అదుపు లేకుండా వెలుస్తున్నాయి. నియోజకవర్గ కీలక నేత అండతోనే యథేచ్ఛగా బెల్ట్‌షాపుల్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య రెండు వేలు దాటినట్టు సమాచారం. ఎక్కువ గ్రామాల్లో వేలం పాట ద్వారానే బెల్ట్‌షాపుల్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బొండపల్లి మండలం ఒంపిల్లినే తీసుకోవచ్చు.
వ్యతిరేకించినా..
టీడీపీ నేత, గ్రామ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ, ఆయన అనుయాయులు బాలి సోమునాయుడు, లండ సత్యనారాయణ, గొర్లె రామునాయుడు, బాలి రమణ తదితరుల నేతృత్వంలో ఒంపిల్లి పాత పంచాయతీ కార్యాలయం ఎదురగా, ఏకంగా రామాలయం అరుగుపై వేలం పాట నిర్వహించారు. తొలుత వేలం పాటను కొందరు వ్యతిరేకించారు. కానీ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మానాపురం గౌరీశంకర్ తీవ్ర స్థాయిలో విభేదించారు. సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. కానీ సర్పంచ్ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్వహించి తీరుతామని, ఏం చేయలేవని తిరిగి గౌరీశంకర్‌పై ధ్వజమెత్తారు. చివరికీ ఏం చేయలేక గౌరీశంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేలం పాట కానిచ్చేశారు. వేలం పాల్గొనేందుకు రూ.500ప్రవేశ రుసుం నిర్ణయించారు. ఆ మొత్తాన్ని చెల్లించిన వారే పాటలో పాల్గొన్నారు. తొలుత రూ.500...రూ.5000వేలు...50వేలు...లక్ష...లక్షా 50వేలు...లక్షా 70వేలు...లక్షా 90వేలు...చివరికీ రూ.2లక్షలకు పాడిన వ్యక్తికి పాట ఖరారు చేశారు. అంతేకాకుండా బెల్ట్‌షాపు నిర్వహించేం దుకు పాట ద్వారా అనుమతిచ్చినట్టు కాగితాలు కూడా రాసుకున్నారు. ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే తంతు నడుస్తోంది.
బార్లా... బెల్ట్‌షాపులు
Published Thu, Aug 13 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement