best teacher Category
-
ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. టీచర్లు దరఖాస్తు చేసుకుంటే వారిలో బాగా పని చేసినవారిని ఎంపిక చేసే విధానం ఇప్పటివరకు అమలులో ఉంది. ఇక ఈ విధానానికి విద్యాశాఖ స్వస్తి పలకనుంది. వచ్చే నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. గురుకులాల టీచర్లు, డైట్, బీఎడ్ కాలేజీల లెక్చరర్లు, టీజీటీలు, పీజీటీలు, ప్రాథమిక పాఠశాలల టీచర్లు, ఉన్నత పాఠశాలల టీచర్లలో ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను అందులో వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 29 జారీ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.10 వేల నగదుతోపాటు మెరిట్ సర్టిఫికెట్, సిల్వర్ మెడల్ అందజేయాలని, శాలువాతో సత్కరించాలని వివరించారు. ఇవీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.. ♦ హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు అయితే 15 ఏళ్లు, టీచర్లు, లెక్చరర్లు, టీజీటీ, పీజీటీలు అయితే 10 ఏళ్ల సర్వీసు ఉండాలి. ♦ రిటైర్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. అయితే, బోధన రంగంలో సేవలందిస్తుంటే వారిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ♦ 2016–17, 2017–18లో ఎన్రోల్మెంట్ పెంపునకు కృషి చేసిన వారిని, జిల్లా సగటు కంటే డ్రాపవుట్స్ బాగా తగ్గించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ 2017, 2018 సంవత్సరాల్లో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించినవారిని, 9 కంటే ఎక్కువ జీపీఏ సాధనకు కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు రాష్ట్ర లేదా జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌ల్లో పాల్గొనేలా కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ ఇన్నోవేషన్స్‌కు కృషి చేసినవారిని, 100 శాతం ఆధార్ నమోదుకు కృషి చేసిన వారిని గుర్తించాలి ♦ సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినవారిని, మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి. జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్, జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే మరో అధికారి సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వివిధ కేటగిరీల్లో ముగ్గురి పేర్లను ఖరారు చేసి, వారి గురించి పది లైన్లకు మించకుండా రాసి, రాష్ట్ర కమిటీకి పంపించాలి. ఇక రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, డీఎస్ఈ, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, గురుకులాల కార్యదర్శి, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అందులో గెజిటెడ్ హెడ్ మాస్టర్ కేటగిరీలో 10 మందిని, స్కూల్ అసిస్టెంట్/ఎస్జీటీ, పీజీటీ, టీజీటీ, తత్సమాన కేడర్‌లో 31 మందిని, ఐఏఎస్ఈ/సీటీఈ/డైట్ లెక్చరర్లు ఇద్దరిని మొత్తంగా 43 మందిని అవార్డులకు ఎంపిక చేస్తుంది. -
నలు‘గురు’ ఉత్తములు!
చిత్తూరు (గిరింపేట) : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నలుగురిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీకి చెందిన వారు కాగా, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) కింద ఎంపికైన ఉత్తమ టీచరు ఒకరు ఉన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరి కింద ఎంపికైన వారిలో పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లిషు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జైకుమార్, కుప్పం మండలం కంగుంది ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుుడు కుప్పరాజు, శ్రీకాళహస్తిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు జి.గోవిందయ్య ఉన్నారు. అలాగే ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ కింద పూతలపట్టు ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు మునిరెడ్డి అవార్డుకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 5న విశాఖపట్నంలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద మెడల్, సర్టిఫికెట్, రూ.3 వేల నగదు బహుమతి అందిస్తారు. ఉత్తమ అవార్డులకు ఎంపికయిన వారి గురించి క్లుప్తంగా.. ఆంగ్లంపై జయకుమార్ పట్టు పలమనేరు పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జయకుమార్‌కు చిన్నప్పటి నుంచి ఆంగ్లంపై మమకారం ఎక్కువ. ఈయన పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో ఆర్ముగంపిళ్లై రిటైర్టు ఉపాధ్యాయుడు కుటుంబంలో జన్మించాడు. ఇంగ్లిషు అంటే ప్రాణం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. ఇతనికి పిల్లలంటే చాలా ఇష్టం. అదనపు బాధ్యతలుగా ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పుతుంటారు. తన గురువులు ఎల్లంపల్లె భాస్కర్‌నాయుడు, శ్రీనివాసులు, చంద్రారెడ్డి, కందస్వామి, భాగ్యలక్ష్మి, సుబ్రమణ్యం ప్రోత్సాహం వల్లే ఉపాధ్యాయ వృత్తి చేపట్టినట్టు ఆయన తెలిపారు. గతంలో కణ్ణన్ పాఠశాలలో పనిచేస్తూ పలమనేరుకు బదిలీ అయ్యారు. తన కుమారుడు జయదీప్ ప్రస్తుతం వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడని, ఆ నగరంలో అవార్డును స్వీకరించనుండడం ఆనందంగా ఉందన్నారు. తనవంతు సాయంగా.. కుప్పం మండలం కంగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన హెచ్జీడీ ఉపాధ్యాయుడు కుప్పరాజుకు సేవాభావం ఎక్కువ. ఈయన స్వగ్రామం విజయపురం మండలం మంగళం గ్రామం. ముద్దురాజు, పద్మావతి దంపతుల కుమారుడు. ప్రతి నెలా తన జీతంలో ఎంతోకొంత పేదలకు పంచుతుంటారు. తన కుమార్తెలైన కావ్య, కాస్యను బీఈడీ చదివించి ఉపాధ్యాయ పరీక్షలు రాయిస్తున్నారు. నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పూతలపట్టు జిల్లాపరిషత్ పాఠశాలలో లెక్కలు టీచర్‌గా పనిచేస్తున్న మునిరెడ్డికి నేషనల్ ఫౌండేషన్ హానిరోలియం అవార్డు లభించింది. అతను సోమల మండలం కమ్మపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన చిన్నస్వామి, నాగమ్మలకు జన్మించాడు. 2012లో జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు, 2014లో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నెలకొల్పిన సంకల్పం అవార్డు పొందారు. మాతృభాషపై మమకారం శ్రీకాళహస్తిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోవింద య్య దామలచెరువు గ్రామంలో పేద రైతు కుటుంబానికి చెందిన ముత్యాలయ్య, పద్మమ్మ దంపతుల కుమారుడు. సేద్యం చేస్తూ తండ్రి తనను ఉపాధ్యాయుడిని చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలో తెలుగు ఉపాధ్యాయుడు ప్రోత్సహించడం వల్ల తెలుగు టీచర్ అవ్వాలనే ఆలోచన కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.