సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. టీచర్లు దరఖాస్తు చేసుకుంటే వారిలో బాగా పని చేసినవారిని ఎంపిక చేసే విధానం ఇప్పటివరకు అమలులో ఉంది. ఇక ఈ విధానానికి విద్యాశాఖ స్వస్తి పలకనుంది. వచ్చే నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
గురుకులాల టీచర్లు, డైట్, బీఎడ్ కాలేజీల లెక్చరర్లు, టీజీటీలు, పీజీటీలు, ప్రాథమిక పాఠశాలల టీచర్లు, ఉన్నత పాఠశాలల టీచర్లలో ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను అందులో వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 29 జారీ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.10 వేల నగదుతోపాటు మెరిట్ సర్టిఫికెట్, సిల్వర్ మెడల్ అందజేయాలని, శాలువాతో సత్కరించాలని వివరించారు.
ఇవీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..
♦ హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు అయితే 15 ఏళ్లు, టీచర్లు, లెక్చరర్లు, టీజీటీ, పీజీటీలు అయితే 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.
♦ రిటైర్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. అయితే, బోధన రంగంలో సేవలందిస్తుంటే వారిని పరిగణనలోకి తీసుకోవచ్చు.
♦ 2016–17, 2017–18లో ఎన్‌రోల్‌మెంట్ పెంపునకు కృషి చేసిన వారిని, జిల్లా సగటు కంటే డ్రాపవుట్స్ బాగా తగ్గించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ 2017, 2018 సంవత్సరాల్లో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించినవారిని, 9 కంటే ఎక్కువ జీపీఏ సాధనకు కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులు రాష్ట్ర లేదా జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌ల్లో పాల్గొనేలా కృషి చేసినవారిని పరిగణనలోకి తీసుకోవాలి.
♦ ఇన్నోవేషన్స్‌కు కృషి చేసినవారిని, 100 శాతం ఆధార్ నమోదుకు కృషి చేసిన వారిని గుర్తించాలి
♦ సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినవారిని, మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలి.
జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటు
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్, జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే మరో అధికారి సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వివిధ కేటగిరీల్లో ముగ్గురి పేర్లను ఖరారు చేసి, వారి గురించి పది లైన్లకు మించకుండా రాసి, రాష్ట్ర కమిటీకి పంపించాలి. ఇక రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, డీఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, గురుకులాల కార్యదర్శి, ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్ సభ్యులుగా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అందులో గెజిటెడ్ హెడ్ మాస్టర్ కేటగిరీలో 10 మందిని, స్కూల్ అసిస్టెంట్/ఎస్‌జీటీ, పీజీటీ, టీజీటీ, తత్సమాన కేడర్‌లో 31 మందిని, ఐఏఎస్‌ఈ/సీటీఈ/డైట్ లెక్చరర్లు ఇద్దరిని మొత్తంగా 43 మందిని అవార్డులకు ఎంపిక చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment