చిత్తూరు (గిరింపేట) : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నలుగురిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీకి చెందిన వారు కాగా, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) కింద ఎంపికైన ఉత్తమ టీచరు ఒకరు ఉన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరి కింద ఎంపికైన వారిలో పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఇంగ్లిషు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జైకుమార్, కుప్పం మండలం కంగుంది ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుుడు కుప్పరాజు, శ్రీకాళహస్తిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు జి.గోవిందయ్య ఉన్నారు. అలాగే ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ కింద పూతలపట్టు ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు మునిరెడ్డి అవార్డుకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 5న విశాఖపట్నంలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద మెడల్, సర్టిఫికెట్, రూ.3 వేల నగదు బహుమతి అందిస్తారు.
ఉత్తమ అవార్డులకు ఎంపికయిన వారి గురించి క్లుప్తంగా.. ఆంగ్లంపై జయకుమార్ పట్టు
పలమనేరు పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జయకుమార్‌కు చిన్నప్పటి నుంచి ఆంగ్లంపై మమకారం ఎక్కువ. ఈయన పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో ఆర్ముగంపిళ్లై రిటైర్టు ఉపాధ్యాయుడు కుటుంబంలో జన్మించాడు. ఇంగ్లిషు అంటే ప్రాణం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. ఇతనికి పిల్లలంటే చాలా ఇష్టం. అదనపు బాధ్యతలుగా ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పుతుంటారు. తన గురువులు ఎల్లంపల్లె భాస్కర్‌నాయుడు, శ్రీనివాసులు, చంద్రారెడ్డి, కందస్వామి, భాగ్యలక్ష్మి, సుబ్రమణ్యం ప్రోత్సాహం వల్లే ఉపాధ్యాయ వృత్తి చేపట్టినట్టు ఆయన తెలిపారు. గతంలో కణ్ణన్ పాఠశాలలో పనిచేస్తూ పలమనేరుకు బదిలీ అయ్యారు. తన కుమారుడు జయదీప్ ప్రస్తుతం వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడని, ఆ నగరంలో అవార్డును స్వీకరించనుండడం ఆనందంగా ఉందన్నారు.
తనవంతు సాయంగా..
కుప్పం మండలం కంగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన హెచ్‌జీడీ ఉపాధ్యాయుడు కుప్పరాజుకు సేవాభావం ఎక్కువ. ఈయన స్వగ్రామం విజయపురం మండలం మంగళం గ్రామం. ముద్దురాజు, పద్మావతి దంపతుల కుమారుడు. ప్రతి నెలా తన జీతంలో ఎంతోకొంత పేదలకు పంచుతుంటారు. తన కుమార్తెలైన కావ్య, కాస్యను బీఈడీ చదివించి ఉపాధ్యాయ పరీక్షలు రాయిస్తున్నారు.
నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
పూతలపట్టు జిల్లాపరిషత్ పాఠశాలలో లెక్కలు టీచర్‌గా పనిచేస్తున్న మునిరెడ్డికి నేషనల్ ఫౌండేషన్ హానిరోలియం అవార్డు లభించింది. అతను సోమల మండలం కమ్మపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన చిన్నస్వామి, నాగమ్మలకు జన్మించాడు. 2012లో జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు, 2014లో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నెలకొల్పిన సంకల్పం అవార్డు పొందారు.
మాతృభాషపై మమకారం
శ్రీకాళహస్తిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోవింద య్య దామలచెరువు గ్రామంలో పేద రైతు కుటుంబానికి చెందిన ముత్యాలయ్య, పద్మమ్మ దంపతుల కుమారుడు. సేద్యం చేస్తూ తండ్రి తనను ఉపాధ్యాయుడిని చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హైస్కూల్‌లో చదువుతున్న సమయంలో తెలుగు ఉపాధ్యాయుడు ప్రోత్సహించడం వల్ల తెలుగు టీచర్ అవ్వాలనే ఆలోచన కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
నలు‘గురు’ ఉత్తములు!
Published Fri, Sep 4 2015 4:57 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement