మర్యాద విలనన్న!
నెరిసిపోయిన రామినీడు బుర్ర మీసాలను చూశారా?
మరోసారి చూస్తే... మీసంలా కాదు... పగ ప్రతీకారంతో బుసలు కొడుతున్న సర్పాల్లా ఉంటాయి. ఆ కళ్లు... పొద చాటు పొంచి ఉన్న పులి కళ్లలా ఉంటాయి.
రామినీడు అంటే మాటలా?!
దేనికదే సెపరేట్... మర్యాదకు మర్యాద... పగకు పగ! ఎక్కడా లోటు ఉండదు!!
‘కబుర్లు తరువాతమ్మా... ముందు భోజనాల ఏర్పాట్లు చూడండి’ అంటూ ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు చేయగలడు.
ఒకవేళ ఆ అతిథి పగోడైనా సరే...
‘అలా చూస్తావేంది నాయనా... నా కొడుకును నరికెయ్యి’ అని కన్నకొడుకు రెచ్చగొట్టినా సరే... పొరపాటున కూడా కత్తి తీయడు ఈ రామినీడు.
అంతమాత్రాన అతను చేతులు ముడ్చుకునేం కూర్చోడు. మాటలతోనే పంజా విసురుతాడు ఇలా...
‘వాడ్ని ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా యింట చంపను. వాడు బయట గడప దాటి అడుగుపెట్టిన క్షణమే తల, మొండెం వేరవ్వాల’
రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాతో నాగినీడు రూపంలో తెలుగు వెండితెరకు సరికొత్త విలనీయుడు పరిచయం అయ్యాడు. ‘రామినీడు’గా ప్రతినాయకుని పాత్రలో వందకు వంద శాతం మార్కులు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్’గా ప్రశంసలు అందుకున్నారు నాగినీడు.
చిన్నప్పుడు... సినిమాకు వెళ్లొచ్చిన బాలనాగినీడు... ఇంటికొచ్చి సరికొత్త సినిమా చూపించేవాడు. విషయం ఏమిటంటే... సినిమాలో రకరకాల క్యారెక్టర్లను అనుకరిస్తూ ఉండేవాడు.
అప్పుడు ఆయన అమ్మగారు అంటుండేవారట...
‘సినిమాల్లోకి పోక
మమ్మల్ని ఎందుకురా చంపుతున్నావు’ అని.
తథాస్తు దేవతలు ఏమన్నారో మనకు తెలియదుగానీ... ఆయన సినిమాల్లోకి పోలేదు.... ఆ తరువాత కాలంలో కెమికల్ టెక్నాలజీ చదవడం కోసం మద్రాస్ వెళ్లారు. ఆ తరువాత ప్రసాద్‌ల్యాబ్‌లో జనరల్ మేనేజర్ అయ్యారు. వృత్తి అతడిని రకరకాల నగరాలు తిప్పుతుందిగానీ... ‘నటన’ మాత్రం ఎక్కడో ఉండిపోయింది.
మరి దాన్ని నిద్రలేపింది ఎవరు?
ఒకసారి నిర్మాత బెల్లంకొండ సురేష్ నాగినీడుతో ఏదో విషయం మాట్లాడుతూ...
‘‘అవునూ... మీరు సినిమాల్లో నటించవచ్చు కదా!’’ అన్నారు.
‘‘మీరు చేయించుకుంటే చేస్తాను’’ అన్నారు నాగినీడు.
అలా నిద్రించిన కోరిక నిద్ర లేచింది.
‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఆ సినిమాలో మినిస్టర్ పాత్ర పోషించారు నాగినీడు. పెదాలు, కళ్లతో మాత్రమే నటనను పండించాలి. ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకున్నారు నాగినీడు.
‘పల్లికుడమ్’ అనే తమిళ సినిమాలో నాగినీడు నటించిన క్లిప్స్‌ను చూశారు రాజమౌళి. ఆయనకు నాగినీడు నటన నచ్చింది. అలా డైరెక్టర్ రాజమౌళి నుంచి నాగినీడుకు పిలుపొచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అది అల్లాటప్పా అవకాశం కాదు... ఆ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర!
‘రాజమౌళి రిస్క్ చేస్తున్నాడేమో’ అనుకున్నారు చాలామంది.
సినిమాలో ఒక బలమైన పాత్రను... అప్పటికి పెద్దగా పేరు లేని నాగినీడును వరించడం...
రకరకాల లెక్కల రీత్యా అది సాహసమేమో కూడా!
అయితే రాజమౌళి నాగినీడును నమ్మారు.
నాగినీడు... తనలోని నటనను నమ్మారు.
అందుకే... ‘మర్యాద రామన్న’లో రామినీడు పాత్ర అంత పెద్ద హిట్ అయింది. ‘ఉత్తమ విలన్’గా నంది అవార్డ్ గెలుచుకునేలా చేసింది.
‘నటన అనేది కళ్ల ద్వారా రావాలి’ అంటూ సావిత్రిని గుర్తు చేస్తారు నాగినీడు.
‘ఒక పేజీ డైలాగు ఇచ్చే భావాన్ని కంటి చూపుతో సావిత్రి ఇచ్చేవారు’ అంటారు ఆయన.
కళ్లలో నుంచే భావాన్ని క్యారీ చేసే ప్రతిభ నాగినీడుకు పట్టుబడింది. అందుకే అతని నటనలో సహజత్వం కనిపిస్తుంది.