సర్కారు వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలి
ప్రస్తుతానికి ఔట్సోర్సింగ్
ఉద్యోగ నియామకాలు లేనట్టే
ఏపీవీవీపీ కమిషనర్ కనకదుర్గ
పలమనేరు: సర్కారు వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కనకదుర్గ అన్నారు. పలమనేరులోని వంద పడకల ఆస్పత్రిని శనివారం సాయంత్రం ఆమె డీసీహెచ్ఎస్ సరళమ్మతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఇన్‌పేషెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ఎన్‌బీఎస్‌యూ (న్యూబార్న్ స్టెరిలైజేషన్ యూనిట్)కు ఆనుకొని కాన్పుల గది ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆమె డాక్టర్లనుద్దేశించి మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులకన్నా మెరుగైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్నాయనేందుకు ఇక్కడున్న ఎన్బీఎస్ యూ యూనిట్టే సాక్ష్యమన్నారు. దీని ద్వారా పుట్టిన బిడ్డకు నిమిషాల వ్యవధిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. చాలా మందికి ఈ విషయం తెలియక శిశుమరణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ యూనిట్ ఆవశ్యకతను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది కచ్చితంగా డ్రస్ కోడ్‌ను అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రులకందే నిధులను అభివృద్ధికే కేటాయిస్తున్నామని తెలి పారు. సంబంధిత ప్రత్యేక నిపుణులు తమ వ్యక్తిగత పనితీరు రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలన్నారు. త్వరలోనే ఈ ఆస్పత్రికి ల్యాప్రోస్కోపిక్ పరికరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు డెలివరీల విషయంలో రెఫరల్ కేసులను తగ్గించాలని సూచించారు.
ఈ మూడు నెలలకు సంబంధించి ఆస్పత్రిలో కాన్పులు 270 లక్ష్యం కాగా ఇక్కడ 380 జరగడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయని, దీనిపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు జిల్లాలోని ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలు ఇప్పట్లో లేనట్టేనన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే గానీ ఈ ప్రక్రియ మొదలు కాదన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలువురు పారి శుధ్య కార్మికులు తమకు కాంట్రాక్టర్ నుంచి వేతనాలు అందలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేశామని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరలో అందేలా చొరవ చూపాలని సూపరింటెండెంట్ వీణాకుమారిని ఆదేశించారు. ఆమె వెంట స్థానిక ఆర్ఎంవో రాణిప్రమీల, వైద్యులు హరగోపాల్, మమతారాణి, శారదా, సుబ్రమణ్యం, మల్లికార్జునరెడ్డి ఉన్నారు.