బెట్టింగ్ భూతం
బొబ్బిలి: క్రికెట్ మ్యాచ్‌లు యు వతకు ఆహ్లాదాన్ని పంచుతున్నా యో..? వారిని అప్పుల పాలు చేస్తున్నాయో? తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయో? అర్థం కాని పరిస్థితి తయారైంది. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో నలుగురు యువకులు కలిస్తే చాలు. ఈ రోజు అవుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో పందెం ఉందా? ఎంతైనా పర్వాలేదు... ఉందంటే ఒక్కఫోన్ చెయ్. అవతల గట్టి పార్టీ ఎదురుచూస్తోంది. ఇలా ఒక్క ఫోన్ కాల్స్‌లోనే లక్షలాది రూపాయలు బెట్టింగ్ అవుతున్నాయి. పట్టణంలోని కొన్ని రహస్య ప్రదేశాల్లో యువత గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు నడుపుతున్నారు. ఇదే బెట్టింగ్ వ్యవహారం కారణంగా పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఓ యువకుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది.
పట్టణంలోని మార్కెట్లో నివాసముంటున్న నారంశెట్టి రమేష్ ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తండ్రి అన్నాజీరావు నడుపుతున్న కిరాణా దుకాణం వద్ద ఉంటూ సాయం చేస్తుంటాడు.. ఆ మార్కెట్లోనే క్రికెట్ బెట్టింగుల జోరు అధికంగా జరుగుతుంది.. ఆఫీవరు రమేష్‌కూ పట్టేసింది. బెట్టింగ్‌లపై ఆసక్తి పెరిగి ఆ మోజులో పడిపోయి అప్పులు చేయడం మొదలు పెట్టాడు.. ఎప్పుడూ లేనంతగా కొడుక్కి స్నేహితులు పెరగడం, ఫోన్లు రావడంతో పాటు వచ్చిన స్నేహితులంతా చెడు మార్గంలో ఉన్నట్టు తండ్రి గుర్తించారు. దాంతో ఓ రోజు ఆరా తీసి కొడుకును మందలించాడు ఈ క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల వేలాది రూపాయల అప్పులు ఉన్నాయని గుర్తించారు. ఇక ముందు ఇలాంటి పందాలు కాయనని దేవుడు మీద ప్రమాణం చేయించుకున్నారు. చివరికి కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించారు.
అనంతరం ఇటీవల గోదావరి పుష్కరాలకు రమేష్ స్నేహితులతో కలిసి వెళ్లి వచ్చాడు. ఇంతలో ఏమయ్యిందో ఏమో గానీ రమేష్ షాపులో ఉండగానే శనివారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు. అతని దగ్గర ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్‌తో పాటు చేతికున్న ఉంగరాలను అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. రాత్రవుతున్నా ఇంటికి కొడుకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆవేదన చెంది పోలీస్ స్టేషనులో పిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఏమయ్యాడో తెలియక తల్లి, చెల్లి బంధువులు రోదిస్తున్నారు.
ఇప్పటివరకూ ఎక్కడ నుంచి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో ఎవరైనా ఏమైనా చేశారా, ఎక్కడైనా దాచారా, ఎక్కడికైనా తీసుకెళ్లారా వంటి అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా రమేష్ స్నేహితులు, నిత్యం బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్న వారిపై దృ ష్టి పెట్టారు. క్రికె ట్ బె ట్టింగ్ కొంపలను కూలుస్తున్న సంగతి పోలీసుల దృష్టిలో ఉన్నా ఎందుకనో దీనిని సీరియస్‌గా తీ సుకోకపోవడం వల్ల ఆస్తులు అమ్ముకునే వారు, రమేష్‌లా అదృశ్యమవుతున్న వారు అధికమవుతున్నారు. ఇకనైనా ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీ సులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.