Bezawada Wilson
-
జ్ఞాన సమాజమే లక్ష్యం
సాక్షి, గద్వాల: జ్ఞానసమాజ నిర్మాణమే స్వేరోస్ అంతిమలక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్వేరోస్ అధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జ్ఞానయుద్ధం మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వివక్షకు తావులేకుండా జ్ఞానసమాజాన్ని సృష్టించడం కోసం స్వేరోస్ నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లిగర్భం నుంచి భూమి మీదకు అడుగుపెట్టిన ప్రతి జీవికి తనశక్తిని తాను తెలుసుకునే వాతావరణం కల్పించడమే స్వేరోయిజం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రెండు చేతులతో అందుకోని ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్, దర్శానాల సుష్మా, సుందర్రాజు, తేజాబాయి, అంచిపాక సునిల్, సైదులు ఇలా అనేక విజయాలు సాధించిన గురుకుల విద్యార్ధులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్షనిస్టుల గురించి కాదు.. అనేక విజయాలు సాధించిన మహనీయుల గురించి చెప్పాలన్నారు. అంబేద్కర్ కలలు నిజం చేయాలి రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలు భవిష్యత్‌లో నిజం అవుతాయనడానికి ఈ సభ నిదర్శనమన్నారు. దేశంలో అందరు సమానమేనని చెబుతున్న రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ఉందన్నారు. అంటరాని కులాలను సమాజం అణిచివేసిందన్నారు. అణిచివేతను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగిన భారతరత్న అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అవకాశం ఇస్తే దేనినైనా సాధించగలరని ఇక్కడ స్వేరోస్‌ను చూస్తే అర్ధమవుతుందన్నారు. గురుకులాల విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూనే సమాజ శ్రేయస్సుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పూర్ణ, ఆనంద్ స్ఫూర్తికావాలి మాజీ డీజీపీ డాక్టర్ ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించి డీజీపీ స్థాయికి ఎదగడానికి అంబేద్కర్ చూపిన స్ఫూర్తియే కారణమన్నారు. కష్టపడి చదివి అత్యున్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం పది నెలల శిక్షణతోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఎంతైనా చదివించాలి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా గతాన్ని, తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు. తమ పిల్లలను చదివించాలని, స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితుల పిల్లలు చదువుకోవడమే నేరమనే సమాజం నుంచి నేడు జ్ఞాన సమాజం వైపు ముందుకు సాగడం శుభశూచకమన్నారు. మన పిల్లలు చదువుకోవద్దనేది ధనికుడి నైజమని...ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ..గురుకులాల్లో చదువుకుని అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకోని దేశవిదేశాల్లో వ్యాపారరంగాల్లో రాణించినట్లు తెలిపారు. దేశంలో ఉన్న పేద విద్యార్ధులకు విద్య, వైద్య, ఉపాధిరంగాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో నాదం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. కింది కులాల బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. పూర్ణ, ఆనంద్ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు ఖర్చును తాము భరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అందించిన ప్రోత్సాహం, స్ఫూర్తితోనే అతి పేద కుంటుబాలకు చెందిన తాము ఎవరెస్ట్ శిక్షరాన్ని అధిరోహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఊషన్న, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.స్వాములు, రాష్ట్ర కార్యదర్శి తోకల కృష్ణయ్య, ముకురాల శ్రీహరి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కులు హరిస్తూనే స్వేచ్ఛా పలుకులా?
దళిత స్త్రీ శక్తి సభలో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్షి, హైదరాబాద్: హక్కులు హరించి వేస్తున్నవారే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గురించి మాట్లాడుతున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకెళ్లను తెంచుకుందాం’ అనే నినాదంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘అంబేడ్కర్ ఎవరికోసం పోరాడారో, ఎవరికోసం పరితపించారో, ఆ దళితుల బిడ్డలే ఈ దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకుల్లో శవాలై తేలుతున్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో పడి మరణించిన వారి దుఃఖాన్ని దిగమింగుకొనేందుకు వారి శవాల ముందు నా జాతి బిడ్డలు చిందులేస్తున్నారని’ విల్సన్ గద్గద స్వరంతో అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ నినాదం ప్రజల్ని మభ్య పెట్టే ఒక ఎజెండానే తప్ప మానసిక పరివర్తనతో వచ్చింది కాదన్నారు. దేశంలో కేవలం దళితులపైనే దాడులు జరుగుతున్నాయని, ఆ తరువాత వరుసలో ముస్లింలు ఉన్నారన్నారు. బహుజనులు కూడా దళితులను అణచివేసేవారేననడంలో సందేహం అక్కర్లేదన్నారు. రెయిన్ బో హోం నిర్వాహకురాలు అనురాధ మాట్లాడుతూ మానవ మలమూత్రాలను ఎత్తివేసే పనిని దళితులే చేస్తున్నారని, దీనిని ఉపాధి అనడం ఈ సమాజానికే అవమానకరం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ , దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ, నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సఫాయి కోసం అవిశ్రాంత పోరాటం
బెజవాడ విల్సన్‌ను వరించిన రామన్ మెగసెసె అవార్డు కోలారు : వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని సఫాయి కర్మచారుల సమస్యల కోసం వినియోగించి అవిశ్రాంత పోరు సాగించిన కర్ణాటకలోని కోలారు జిల్లా, కేజీఎఫ్‌కు చెందిన బెజవాడ విల్సన్‌ను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది. బెజవాడ విల్సన్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ఓంగోల్ జిల్లాకు చెందిన వారు. 1950 - 52 మధ్య కేజీఎఫ్‌కు వలస వచ్చి స్థిర పడ్డారు. విల్సన్ తాత బీజీఎంఎల్ బంగారు గనుల కాలనీలో శౌచాలయాల శుభ్రత కోసం పనిచేసేవాడు. విల్సన్ తండ్రి బెజవాడ యాకబ్, తల్లి రసెల్. విల్సన్ పుట్టింది కేజీఎఫ్‌లోనే. మారికుప్పం పోలీస్ స్టేషన్ వెసుక తెలుగు లైన్లో వీరు నివాసం ఉండేవారు. 4వ తరగతి వరకు కేజీఎఫ్‌లోనే చదివిన విల్సన్ 5 నుంచి, పీయూసీ వరకు చదివారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్నత విద్య పూర్తి చేశారు. బీజీఎంఎల్ ప్రాంతంలో గనులు నిర్వహిస్తున్న కాలంలో 220 సార్వజనిక శౌచాలయాలు ఉండేవి. ఆంధ్రాలైన్లో నివాసం ఉంటున్న చాలా మంది సఫాయి కర్మచారులుగా పని చేసేవారు. తండ్రి, సోదరుడు బెజవాడ ఏసుపాదం శౌచాలయాల పిట్లోకి దిగి ఖాళీ చేతులతో శుభ్రం చేయడాన్ని చూసి విల్సన్ చలించి పోయేవాడు. ఈక్రమంలో మలం మోసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 1986లో సఫాయి కర్మచారుల ఆందోళన్ అనే సంస్థ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించి ఢిల్లీ వరకు తీసుకు వెళ్లారు. ఫలితంగా మలం మోసే పద్ధతిని నిషేధిస్తూ 1992లో లోక్‌సభ చట్టం చేసింది.1994లో సఫాయి కర్మచారుల జాగృతి కార్యక్రమం ద్వారా నాలుగు బృందాలతో రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించారు. 2003లో విల్సన్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం కోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసి ఈ పద్ధతి నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా మలం మోసే పద్ధతిపై ఇన్ని పోరాటాలు చేసినా కేజీఎఫ్‌లోనే 2014లో టాయ్‌లెట్ పిట్ శుభ్రం చేస్తూ ముగ్గరు ఊపిరి ఆడక చనిపోయారు. విల్సన్ కేజీఎఫ్‌కు వచ్చి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందేలా చేశారు. విల్సన్ 2015లో ఢిల్లీ జంతర్ మంతర్‌లో బీమయాత్రను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ మలం మోసే పద్ధతిని పూర్తిగా నిషేధించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ యాత్రను చివరికి డిల్లీ జంతర్మంతర్లోనే ముగించారు. సంతోషంగా ఉంది వివాహం కూడా చేసుకోకుండా 24 ఏళ్ల పాటు మలం మోసే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడిన విల్సన్‌కు ప్రతిష్టిత మెగసెసె అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. -ఏసుపాదం, విల్సన్ సోదరుడు