ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, గద్వాల: జ్ఞానసమాజ నిర్మాణమే స్వేరోస్ అంతిమలక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్వేరోస్ అధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన జ్ఞానయుద్ధం మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వివక్షకు తావులేకుండా జ్ఞానసమాజాన్ని సృష్టించడం కోసం స్వేరోస్ నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లిగర్భం నుంచి భూమి మీదకు అడుగుపెట్టిన ప్రతి జీవికి తనశక్తిని తాను తెలుసుకునే వాతావరణం కల్పించడమే స్వేరోయిజం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రెండు చేతులతో అందుకోని ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, ఆనంద్, దర్శానాల సుష్మా, సుందర్‌రాజు, తేజాబాయి, అంచిపాక సునిల్, సైదులు ఇలా అనేక విజయాలు సాధించిన గురుకుల విద్యార్ధులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్షనిస్టుల గురించి కాదు.. అనేక విజయాలు సాధించిన మహనీయుల గురించి చెప్పాలన్నారు.
అంబేద్కర్ కలలు నిజం చేయాలి
రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలు భవిష్యత్‌లో నిజం అవుతాయనడానికి ఈ సభ నిదర్శనమన్నారు. దేశంలో అందరు సమానమేనని చెబుతున్న రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ఉందన్నారు. అంటరాని కులాలను సమాజం అణిచివేసిందన్నారు. అణిచివేతను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగిన భారతరత్న అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అవకాశం ఇస్తే దేనినైనా సాధించగలరని ఇక్కడ స్వేరోస్‌ను చూస్తే అర్ధమవుతుందన్నారు. గురుకులాల విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూనే సమాజ శ్రేయస్సుకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
పూర్ణ, ఆనంద్ స్ఫూర్తికావాలి
మాజీ డీజీపీ డాక్టర్ ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించి డీజీపీ స్థాయికి ఎదగడానికి అంబేద్కర్ చూపిన స్ఫూర్తియే కారణమన్నారు. కష్టపడి చదివి అత్యున్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం పది నెలల శిక్షణతోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు.
పిల్లలను ఎంతైనా చదివించాలి
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా గతాన్ని, తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు. తమ పిల్లలను చదివించాలని, స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితుల పిల్లలు చదువుకోవడమే నేరమనే సమాజం నుంచి నేడు జ్ఞాన సమాజం వైపు ముందుకు సాగడం శుభశూచకమన్నారు. మన పిల్లలు చదువుకోవద్దనేది ధనికుడి నైజమని...ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ..గురుకులాల్లో చదువుకుని అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకోని దేశవిదేశాల్లో వ్యాపారరంగాల్లో రాణించినట్లు తెలిపారు.
దేశంలో ఉన్న పేద విద్యార్ధులకు విద్య, వైద్య, ఉపాధిరంగాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో నాదం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. కింది కులాల బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. పూర్ణ, ఆనంద్ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహించేందుకు ఖర్చును తాము భరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అందించిన ప్రోత్సాహం, స్ఫూర్తితోనే అతి పేద కుంటుబాలకు చెందిన తాము ఎవరెస్ట్ శిక్షరాన్ని అధిరోహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఊషన్న, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.స్వాములు, రాష్ట్ర కార్యదర్శి తోకల కృష్ణయ్య, ముకురాల శ్రీహరి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment