
పీవీ సునీల్ కుమార్, విజయ్‌పాల్ పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గం
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, అమరావతి: దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని నాడు చంద్రబాబు కులదురహంకారంతో మాట్లాడారని, ప్రస్తుతం ఆయన ప్రభుత్వం దళిత పోలీస్ అధికారులను వేధిస్తోందని, దళితులు ఆత్మన్యూనతకు గురి చేయాలనే కుట్రతో వ్యవహరిస్తోందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఏపీలో దళిత పోలీస్ అధికారులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, మరో రిటైర్డ్ నాన్ క్యాడర్ ఎస్పీ విజయ్ పాల్ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో విమర్శించారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తనను కస్టోడియల్ టార్చర్ చేశారనే అభియోగాలను గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని అయినా సరే మూడున్నరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రఘురామ పాత ఆరోపణలనే చేయడం..టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే దళితుల్లో మాల సామాజికవర్గానికి చెందిన పీవీ సునీల్ కుమార్, మాదిగ సామాజికవర్గానికిచెందిన విజయ్‌పాల్‌లపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు.
గుంటూరు జిల్లాలో నమోదు చేసిన ఆ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. పీవీ సునీల్ కుమార్‌కు 9 నెలలుగా పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తుండటం..విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి 2 నెలలపాటు జైల్లో ఉంచడం దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment