బెజవాడ విల్సన్‌ను వరించిన రామన్ మెగసెసె అవార్డు
కోలారు : వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని సఫాయి కర్మచారుల సమస్యల కోసం వినియోగించి అవిశ్రాంత పోరు సాగించిన కర్ణాటకలోని కోలారు జిల్లా, కేజీఎఫ్‌కు చెందిన బెజవాడ విల్సన్‌ను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది. బెజవాడ విల్సన్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ఓంగోల్ జిల్లాకు చెందిన వారు. 1950 - 52 మధ్య కేజీఎఫ్‌కు వలస వచ్చి స్థిర పడ్డారు. విల్సన్ తాత బీజీఎంఎల్ బంగారు గనుల కాలనీలో శౌచాలయాల శుభ్రత కోసం పనిచేసేవాడు. విల్సన్ తండ్రి బెజవాడ యాకబ్, తల్లి రసెల్. విల్సన్ పుట్టింది కేజీఎఫ్‌లోనే. మారికుప్పం పోలీస్ స్టేషన్ వెసుక తెలుగు లైన్‌లో వీరు నివాసం ఉండేవారు. 4వ తరగతి వరకు కేజీఎఫ్‌లోనే చదివిన విల్సన్ 5 నుంచి, పీయూసీ వరకు చదివారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్నత విద్య పూర్తి చేశారు. బీజీఎంఎల్ ప్రాంతంలో గనులు నిర్వహిస్తున్న కాలంలో 220 సార్వజనిక శౌచాలయాలు ఉండేవి. ఆంధ్రాలైన్‌లో నివాసం ఉంటున్న చాలా మంది సఫాయి కర్మచారులుగా పని చేసేవారు. తండ్రి, సోదరుడు బెజవాడ ఏసుపాదం శౌచాలయాల పిట్‌లోకి దిగి ఖాళీ చేతులతో శుభ్రం చేయడాన్ని చూసి విల్సన్ చలించి పోయేవాడు. ఈక్రమంలో మలం మోసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 1986లో సఫాయి కర్మచారుల ఆందోళన్ అనే సంస్థ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించి ఢిల్లీ వరకు తీసుకు వెళ్లారు.
ఫలితంగా మలం మోసే పద్ధతిని నిషేధిస్తూ 1992లో లోక్‌సభ చట్టం చేసింది.1994లో సఫాయి కర్మచారుల జాగృతి కార్యక్రమం ద్వారా నాలుగు బృందాలతో రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించారు. 2003లో విల్సన్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం కోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసి ఈ పద్ధతి నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా మలం మోసే పద్ధతిపై ఇన్ని పోరాటాలు చేసినా కేజీఎఫ్‌లోనే 2014లో టాయ్‌లెట్ పిట్ శుభ్రం చేస్తూ ముగ్గరు ఊపిరి ఆడక చనిపోయారు. విల్సన్ కేజీఎఫ్‌కు వచ్చి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందేలా చేశారు. విల్సన్ 2015లో ఢిల్లీ జంతర్ మంతర్‌లో బీమయాత్రను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ మలం మోసే పద్ధతిని పూర్తిగా నిషేధించాలని ఆయా జిల్లాల కలెక్టర్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ యాత్రను చివరికి డిల్లీ జంతర్‌మంతర్‌లోనే ముగించారు. సంతోషంగా ఉంది వివాహం కూడా చేసుకోకుండా 24 ఏళ్ల పాటు మలం మోసే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడిన విల్సన్‌కు ప్రతిష్టిత మెగసెసె అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
-ఏసుపాదం, విల్సన్ సోదరుడు
సఫాయి కోసం అవిశ్రాంత పోరాటం
Published Thu, Jul 28 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement
Advertisement