Ramon Magsaysay Award
-
రవీష్ కుమార్‌కు రామన్ మెగసెసే
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్ (44) ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారని రామన్ మెగసెసే ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. జర్నలిజంలో రవీష్ కుమార్ అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. 2019 రామన్ మెగసెసే అవార్డు విజేతలుగా ప్రకటించిన ఐదుగురిలో కుమార్ ఒకరు. మిగిలిన నలుగురిలో మయన్మార్‌కు చెందిన కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన అంగ్ఖానా నీలపైజిత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్-కి ఉన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 9 న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించబడే రామన్ మెగసెసే అవార్డును సొంతం చేసుకోవడంపై పలువురు రవీష్ కుమార్‌కు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సేవ, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. -
భారతీయులకు మెగసెసె
మనీలా: ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వీధుల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తున్న మానసికవైద్యుడు భరత్ వాత్వానీతో పాటు లడఖ్ యువత జీవితాల్లో వెలుగునింపిన ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లను ఈ అవార్డు వరించింది. ముంబైకి చెందిన వాత్వానీ.. వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారనీ మెగసెసె ఫౌండేషన్ ప్రశంసించింది. 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించి వాత్వానీ దంపతులు ఎనలేని సేవచేస్తున్నారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన ఇంజనీర్ వాంగ్ చుక్.. తన విభిన్నమైన, సృజనాత్మక బోధనా పద్ధతులతో ఈశాన్య భారతం,లడఖ్ యువత జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారని ఫౌండేషన్ కితాబిచ్చింది. వీరిద్దరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్లు అవార్డుకు ఎంపికయ్యారు. విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్, రూ.20.6 లక్షల నగదు బహుమతి ప్రదానంచేయనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
సఫాయి కోసం అవిశ్రాంత పోరాటం
బెజవాడ విల్సన్‌ను వరించిన రామన్ మెగసెసె అవార్డు కోలారు : వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని సఫాయి కర్మచారుల సమస్యల కోసం వినియోగించి అవిశ్రాంత పోరు సాగించిన కర్ణాటకలోని కోలారు జిల్లా, కేజీఎఫ్‌కు చెందిన బెజవాడ విల్సన్‌ను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది. బెజవాడ విల్సన్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ఓంగోల్ జిల్లాకు చెందిన వారు. 1950 - 52 మధ్య కేజీఎఫ్‌కు వలస వచ్చి స్థిర పడ్డారు. విల్సన్ తాత బీజీఎంఎల్ బంగారు గనుల కాలనీలో శౌచాలయాల శుభ్రత కోసం పనిచేసేవాడు. విల్సన్ తండ్రి బెజవాడ యాకబ్, తల్లి రసెల్. విల్సన్ పుట్టింది కేజీఎఫ్‌లోనే. మారికుప్పం పోలీస్ స్టేషన్ వెసుక తెలుగు లైన్లో వీరు నివాసం ఉండేవారు. 4వ తరగతి వరకు కేజీఎఫ్‌లోనే చదివిన విల్సన్ 5 నుంచి, పీయూసీ వరకు చదివారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్నత విద్య పూర్తి చేశారు. బీజీఎంఎల్ ప్రాంతంలో గనులు నిర్వహిస్తున్న కాలంలో 220 సార్వజనిక శౌచాలయాలు ఉండేవి. ఆంధ్రాలైన్లో నివాసం ఉంటున్న చాలా మంది సఫాయి కర్మచారులుగా పని చేసేవారు. తండ్రి, సోదరుడు బెజవాడ ఏసుపాదం శౌచాలయాల పిట్లోకి దిగి ఖాళీ చేతులతో శుభ్రం చేయడాన్ని చూసి విల్సన్ చలించి పోయేవాడు. ఈక్రమంలో మలం మోసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 1986లో సఫాయి కర్మచారుల ఆందోళన్ అనే సంస్థ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించి ఢిల్లీ వరకు తీసుకు వెళ్లారు. ఫలితంగా మలం మోసే పద్ధతిని నిషేధిస్తూ 1992లో లోక్‌సభ చట్టం చేసింది.1994లో సఫాయి కర్మచారుల జాగృతి కార్యక్రమం ద్వారా నాలుగు బృందాలతో రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించారు. 2003లో విల్సన్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం కోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసి ఈ పద్ధతి నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా మలం మోసే పద్ధతిపై ఇన్ని పోరాటాలు చేసినా కేజీఎఫ్‌లోనే 2014లో టాయ్‌లెట్ పిట్ శుభ్రం చేస్తూ ముగ్గరు ఊపిరి ఆడక చనిపోయారు. విల్సన్ కేజీఎఫ్‌కు వచ్చి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందేలా చేశారు. విల్సన్ 2015లో ఢిల్లీ జంతర్ మంతర్‌లో బీమయాత్రను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ మలం మోసే పద్ధతిని పూర్తిగా నిషేధించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ యాత్రను చివరికి డిల్లీ జంతర్మంతర్లోనే ముగించారు. సంతోషంగా ఉంది వివాహం కూడా చేసుకోకుండా 24 ఏళ్ల పాటు మలం మోసే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడిన విల్సన్‌కు ప్రతిష్టిత మెగసెసె అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. -ఏసుపాదం, విల్సన్ సోదరుడు -
నిజాయితీకి పురస్కారం
నిక్కచ్చిగా వ్యవహరించడం, నిర్భీతితో పనిచేయడం కత్తి మీది సాము. అధికారులుగా ఉంటున్నవారు వేధింపులకూ, కష్టాలకూ సిద్ధపడితే తప్ప అది సాధ్యంకాదు. అలాంటివారిని పోల్చుకోవడం, వారికి అండదండలీయడం సమాజం బాధ్యత. ఈ ఏడాది రామన్ మెగసెసె అవార్డు పొందిన ఇద్దరు భారతీయుల్లో ఒకరైన సంజీవ్ చతుర్వేది ఆ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్న అధికారే. పాలకులు మారినా, విధానాలు మారాయని చెబుతున్నా సంజీవ్ చతుర్వేదికి సంబంధించినంత వరకూ మారిందేమీ లేదు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతున్నది. తన కోసం, తన వాళ్ల కోసం కాక సమాజం గురించి ఆలోచిం చడం... జరుగుతున్న అక్రమాలను సరిచేద్దామనుకోవడం, ఖజానాను కాపాడాలను కోవడం పాలకులుగా ఉంటున్నవారికి ఎంత కంటగింపుగా మారిందో తెలుసుకోవా లంటే చతుర్వేది పోరాట చరిత్రను పరామర్శించాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అయిన చతుర్వేదిని గత అయిదేళ్లలో 12 సార్లు బదిలీచేశారు. హర్యానాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేయాలనుకున్నవారి ఆట కట్టించడం, హెర్బల్ పార్క్ పేరుతో ఒక ప్రైవేటు స్థలంలో ప్రజా ధనాన్ని దుర్వి నియోగం చేయకుండా అడ్డుకోవడం వంటి ఉదంతాల తర్వాత అక్కడి ప్రభుత్వం ఆయనను 2007లో సస్పెండ్ చేసింది. ఆయనపై బోలెడు ఆరోపణలతో చార్జిషీటు రూపొందించింది. ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను 2008లో రాష్ట్రపతి జోక్యం చేసుకుని రద్దు చేశారు. కానీ హర్యానా ప్రభుత్వం పదే పదే అదే తంతును కొనసాగించడంవల్ల 2011 జనవరిలో, 2013 అక్టోబర్‌లో, 2014 జనవరిలో రాష్ట్రపతి కలగజేసుకోవాల్సివచ్చింది. మధ్యలో సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా హర్యానా ప్రభుత్వం ప్రయత్నిం చింది. ఇందులో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనదేమంటే... చతుర్వేది బయటపెట్టిన కోట్లాది రూపాయల ప్లాంటేషన్ కుంభకోణంలో ఆయన్నే నిందితుడిగా ఇరికించడం! ఆ వ్యవహారంలో చతుర్వేది సస్పెండ్ చేసిన ఒక అధికారి ఆత్మహత్య చేసుకుంటే అందుకు ప్రధాన కారకుడిగా ఆరోపించి ఆయనను అరెస్టు చేయడానికి హర్యానా పోలీసులు ప్రయత్నించారు. మొత్తంగా నాలుగుసార్లు రాష్ట్రపతిని ఆశ్రయిస్తే తప్ప సంజీవ్ చతుర్వేది ఉద్యోగం నిలబడలేదు. ఇదంతా హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా జరిగింది. నిజాయితీగల అధికారులను వేధించడం అక్కడ కొత్తగాదు. ఒకపక్క చతుర్వేదిపై ఇవి కొనసాగిస్తూనే ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టిన వైనాన్ని ఎవరూ మరిచిపోలేరు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారం కూపీ లాగడానికి ప్రయత్నించినందుకు ఖేమ్కాను బదిలీలతో వేధించారు. హర్యానాయే కాదు...దేశమంతా అలాగే ఉన్నదని తెలుసుకోవడానికీ...పాలకులు మారినా పద్ధతులు మారవని అర్ధంకావడానికీ చతుర్వేదికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆయన డెప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)కు చీఫ్ విజిలెన్స్ అధికారిగా వెళ్తే అక్కడ కూడా ఆయనకు అక్రమాలే తారసపడ్డాయి. వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తే బదిలీయే బహుమతి అయింది. ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తూ చీఫ్ విజిలెన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన 165 అవినీతి కేసుల్ని పెట్టారు. వీటిల్లో పలువురిపై జరిమానాలు విధించి వసూలు చేయడమేకాక కొందరిని సర్వీస్‌నుంచి కూడా తొలగించారు. 87మందిపై చార్జిషీట్లు పెట్టారు. ఈ క్రమంలో చతుర్వేదికి మళ్లీ వేధింపులు తప్పలేదు. కేంద్రంలో ప్రభుత్వం మారినా ఆయన రాత మారలేదు. ఎన్డీయే సర్కారు ఆయనకు పనిలేకుండా చేసింది. చీఫ్ విజిలెన్స్ అధికారి బాధ్యతలనుంచి తప్పించింది. హర్యానా క్యాడర్నుంచి తనను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయమని చతుర్వేది పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని నియామకాల కమిటీ తోసిపుచ్చితే కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) దాన్ని కొట్టివేస్తూ మొన్న మే నెలలో ఆదేశాలు జారీచేసింది. ఆయన పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అక్రమాలు ఎంతగా వ్యవస్థీకృతమైనాయో...అక్రమార్కులకు అండదండలెలా లభిస్తున్నాయో ఈ ఉదంతాలన్నీ తేటతెల్లం చేస్తాయి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక తొలుత ఆరోగ్య మంత్రిగా వ్యవహరించిన హర్షవర్ధన్‌కు నిజాయితీపరుడన్న పేరుంది. కానీ, ఆయన సైతం చతుర్వేది విషయంలో భిన్నంగా స్పందించలేకపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జేపీ నడ్డా కూడా అదే బాటలో వెళ్లారు. చతుర్వేదిని ఎన్నిసార్లు బదిలీలు చేశారో, ఆయనపై ఎన్నిసార్లు సస్పెన్షన్ వేటు పడిందో తెలుసుకోవడం కోసం ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను అడిగితే ‘వ్యక్తిగత’ సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖ జవాబిచ్చింది. అధికారిగా చతుర్వేది వ్యవహరించిన తీరులోగానీ, అందుకు ప్రభుత్వాలు స్పందించిన తీరులోగానీ వ్యక్తిగతం ఏముంటుంది? ఈ విషయాన్నే కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అడిగినప్పుడు ఆ శాఖ అధికారులు నీళ్లు నమిలారు. నిజాయితీగల అధికారులు అవినీతి విషయంలో తీసుకుంటున్న చర్యలెలాంటివో, ఆ క్రమంలో రాజకీయ నాయకత్వంనుంచి వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటో తెలిపే సమాచారం ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉండేదని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు శ్రీధర్ చెప్పాల్సివచ్చింది. ఈ ఏడాది మెగసెసె అవార్డు పొందిన మరో వ్యక్తి అన్షు గుప్తా. గూంజ్ పేరుతో ఆయన నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ నిరుపేదలకూ, అసహాయులకూ కనీసావసర మైన బట్టలు, గృహోపకరణాలు సమకూర్చడం ధ్యేయంగా పెట్టుకుంది. సకల సౌకర్యాలనూ సమకూర్చిపెట్టగల వృత్తినీ, ఉద్యోగాన్నీ వదులుకుని ఎన్నో అవరోధాల మధ్య అట్టడుగు వర్గాల సముద్ధరణకు అన్షు పాటుబడుతున్నారు. తమ కోసం కాక సమాజం కోసం, దాని ఉన్నతి కోసం పోరాడేవారికీ... తపనపడే వారికీ వచ్చే పురస్కారాలు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతాయి. ఆ దిశగా ఆలోచించేందుకూ, ఆచరణలోకి దిగేందుకూ ఎందరినో ప్రోత్సహిస్తాయి. దీంతోపాటు ప్రభుత్వాలు తమ తప్పిదాలను గుర్తించి సరిచేసుకోవడానికి కూడా ఉపయోగపడితే మరింత బాగుంటుంది. -
ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ : ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ఫిలిప్పైన్స్ అత్యున్నత పురస్కారం రామన్ మెగాసెసే అవార్డు- 2015 కు ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తాలను ఈ అవార్డు వరించింది. ఇదిలా ఉండగా కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవిని కోల్పోయి చతుర్వేది గతంలో వార్తల్లోకెక్కారు. ఎయిమ్స్ కుంభకోణాల నేపథ్యంలో ఆయన తన పదవి కోల్పోయారు. ప్రస్తుతం ఇలా అవార్డు దక్కించుకుని మరోమారు వార్తల్లో నిలవడం గమనార్హం. చతుర్వేది దైర్యాన్ని మెచ్చి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి నిర్మూలనకు చేసిన కృషికిగానూ ఈ అవార్డు అందజేయనున్నట్లు అవార్డు యాజమాన్యం ప్రకటించింది. సృజనాత్మక, నాయకత్వ లక్షణాలను చూసి అన్షు గుప్తాకు ఈ గౌరవాన్ని అందించామని తెలిపింది. -
2014- రామన్ మెగసెసె అవార్డులు...
క్రీడలు కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వస్థానం స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23న ప్రారంభమైన 21వ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 3తో ముగిశాయి. కెనడాకు చెందిన రిథమిక్ జిమ్నాస్ట్ ఫ్రాంకీ జోన్స్ ఉత్తమ అథ్లెట్‌గా ఎంపికైంది. 21వ కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో 2018లో జరగనున్నాయి. మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం ఇంగ్లండ్ 58 59 57 174 ఆస్ట్రేలియా 49 42 46 137 కెనడా 32 16 46 82 స్కాట్లాండ్ 19 15 19 53 భారత్ 15 30 19 64 భారత్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్యాలతో మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. కశ్యప్‌కు స్వర్ణం తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించాడు. 1978లో ప్రకాశ్ పదుకొనె, 1982లో సయ్యద్ మోడీ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించారు. స్క్వాష్‌లో మహిళల డబుల్స్‌లో భారత జోడీ దీపికా పల్లికల్, జ్యోష్న చినప్ప టైటిల్ గెలుచుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో స్క్వాష్‌లో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా దీప కర్మాకర్ రికార్డు సృష్టించింది. జూలై 31న వాల్ట్ విభాగంలో జరిగిన పోటీలో త్రిపురకు చెందిన దీప కాంస్య పతకం నెగ్గింది. కర్ణాటకకు చెందిన వికాస్‌గౌడ్ డిస్కస్‌త్రోలో తొలి స్వర్ణం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.. ఈ విజయంతో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కాడు. వికాస్‌గౌడ్‌కు ముందు మిల్కాసింగ్ 1958 కామన్వెల్త్ క్రీడల్లో ట్రాక్ ఈవెంట్ విభాగంలో తొలిసారి బంగారుపతకం సాధించాడు. టెన్నిస్‌లో వేగవంతమైన సర్వ్ రికార్డ్ నమోదు జర్మనీకి చెందిన సబీన్ లిసికి జూలై 30న మహిళల టెన్నిస్ విభాగంలో అత్యంత వేగవంతమైన సర్వ్ రికార్డును నెలకొల్పింది. అమెరికా వేదికగా అన్నా ఇవనోవిచ్‌తో తలపడిన మ్యాచ్‌లో మొదటి రౌండ్లో గంటకు 131 మైళ్ల వేగంతో సర్వ్‌ను చేసింది. కాగా ఆమె ఓటమిపాలైంది. జాతీయం భారత్‌లో పర్యటించిన అమెరికా మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, వాణిజ్యమంత్రి పెన్నీ ప్రిట్జికర్లు భారత్‌లో పర్యటించారు. సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు అధ్యక్షుడు ఒబామా ఆసక్తితో ఉన్నారని మోడీకి తెలిపారు. గ్యాస్ ధరలపై సురేశ్‌ప్రభు కమిటీ గ్యాస్ ధరల నియంత్రణపై సమీక్షించేందుకు సురేశ్‌ప్రభు నేతృత్వంలోని కమిటీని కేంద్రం జూలై 24న నియమించింది. ప్రభు.. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కమిటీలో సురేశ్ప్రభుతోపాటు ప్రతాప్ భాను మెహతా ఉన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వం జూలై 28న రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే జాతీయ స్థాయి పథకాన్ని ప్రారంభించింది. స్వదేశీ పశు వీర్య సేకరణ, పశు సంతతి అభివృద్ధ్ధి ఈ పథకం లక్ష్యం. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ దీన్ని ప్రారంభించారు. 12వ ప్రణాళికలో భాగంగా ఈ పథకం కింద రూ. 500 కోట్లను వెచ్చించనున్నారు. జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన యాత్రను న్యూఢిల్లీలో జూలై 28న ప్రారంభించారు. భారత జీవవైవిధ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రైలు ప్రదర్శనను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ చేపట్టాయి. 2012లో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ రైలు నడుస్తోంది. 194 రోజులపాటు 20 రాష్ట్రాల్లో ప్రయాణించి 2015 ఫిబ్రవరి 4న గాంధీనగర్‌కు చేరుకుంటుంది. 56 చోట్ల ఆగుతుంది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు సందర్శిస్తారని అంచనా. ప్రపంచంలో అత్యధికులు సందర్శించిన రైలు ఇదే. భారత్.. ప్రపంచ భూభాగంలో 2.5 శాతం, ప్రపంచ జనాభాలో 17 శాతం, ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం కలిగి ఉంది. అవార్డులు 2014- రామన్ మెగసెసె అవార్డుల ప్రకటన 2014 సంవత్సరానికి రామన్ మెగసెసె అవార్డులను కమిటీ జూలై 30న ప్రకటించింది. ఆసియా నోబెల్‌గా పిలిచే ఈ పురస్కారాలను ఐదుగురు వ్యక్తులు, ఒక సంస్థను ఎంపిక చేశారు. ఈ అవార్డులను 1957లో విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసె సంస్మరణార్థం ఏర్పాటు చేశారు. సామాజిక మార్పునకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతిని అందజేస్తారు. అవార్డు విజేతలు హూషులి (చైనా): కైజింగ్ అనే బిజినెస్ మ్యాగజైన్ స్థాపకురాలు, ఎడిటర్. వ్యాపారం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, బాధ్యతలను నిర్భయంగా ప్రోత్సహించడంతోపాటు చైనాలో మీడియా కర్తవ్యాలను స్వతంత్ర భావాలతో నిర్వహించినందుకు, ఆమె నాయకత్వ ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సౌర్ మర్లినా మనురంగ్ (ఇండోనేషియా): మానవ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త. ఇండోనేషియా అడవుల్లో నివశించే ప్రజల జీవితాలనూ మెరుగుపరిచేందుకు కృషి చేశారు. వీరితోపాటు పురస్కారాలకు ఎంపికైనవారిలో ఒమర్ ఖాన్ మసౌడీ (అఫ్గానిస్థాన్ నేషనల్ మ్యూజియం డెరైక్టర్), రాండీ హలసాన్ (ఫిలిప్పీన్స్ టీచర్), పాకిస్థాన్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ద సిటిజన్స్ ఫౌండేషన్ ఉన్నాయి. ముజఫర్ అలీకి రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం బాలీవుడ్ చిత్ర దర్శకుడు ముజఫర్ అలీ 22వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారానికి ఎంపికయ్యారు. మత సామరస్యం, శాంతి, సౌహార్థాన్ని పెంపొందించటానికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ. 5లక్షల నగదు ఇస్తారు. అలీ ఉమ్రావ్జాన్తోపాటు గమన్, ఖైజన్తోపాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2005లో ఆయన పద్మశ్రీ అందుకున్నారు. అంతర్జాతీయం మోడీ నేపాల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్‌లో రెండు రోజులు పర్యటించారు. ఇందులో భాగంగా ఆగస్టు 3న నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించారు. 1990 తర్వాత నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి విదేశీ నేత నరేంద్రమోడీ. నేపాల్ ప్రధాని సుశీల్‌కుమార్ కొయిరాలాతో మోడీ సమావేశమయ్యారు. పర్యాటక రంగం అభివృద్ధి, గాయిటర్ నియంత్రణ కార్యక్రమం, దూరదర్శన్-నేపాల్ టెలివిజన్లకు సంబంధించిన మూడు అవగాహన పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. 1950 నాటి శాంతి-మైత్రి ఒప్పందాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమీక్షించి, సవరించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ రంగాల్లో సహకారానికి, నూతన రాజ్యాంగ రచనలో తోడ్పాటుకు, స్కాలర్ షిప్‌ల సంఖ్యను 180 నుంచి 250కు పెంచడానికి మోడీ అంగీకరించారు. ఈ సందర్భంగా 16ఏళ్ల నుంచి తన సంరక్షణలో పెరిగిన జీత్‌బహుదూర్ అనే నేపాలీ యువకుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చైనాలో లోతైన ప్రయోగశాల ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంలో ప్రయోగశాల నిర్మించేందుకు చైనా ఆగస్టు 2న పనులను ప్రారంభించింది. సైన్స్ చరిత్రలో చిక్కుముడిగా ఉన్న కృష్ణ పదార్థాన్ని గుర్తించే ఉద్దేశంతో నైరుతి సిచువాన్ రాష్ట్రంలోని జిన్‌పింగ్ జల విద్యుత్ కేంద్రం అడుగున 2,400 మీటర్ల లోతున దీన్ని నిర్మిస్తోంది. 2015 నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. డబ్ల్యూటీవో చర్చలు విఫలం వ్యవసాయ సబ్సిడీలపై భారత్ అభ్యంతరాలను సంపన్న దేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. భారత్ లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకుండా.. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(ట్రేడ్ ఫెలిసిటేషన్ అగ్రిమెంట్-టీఎఫ్ఏ)ను ఉన్నదున్నట్లుగా భారత్ అంగీకరించాలని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆహారోత్పత్తుల నిల్వ, ఆహార సబ్సిడీల లెక్కింపునకు సంబంధించి డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణలు కావాలని భారత్ కోరుతోంది. మొత్తం ఆహారోత్పత్తుల విలువలో సబ్సిడీలు 10 శాతంగా ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు చెబుతున్నాయి. అయితే, 20 ఏళ్ల కిందటి ధరల ఆధారంగా వాటిని లెక్కిస్తున్నారు. సబ్సీడీల విషయంలో 1986-87ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవద్దని, ప్రస్తుత ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతోంది. అలాగే, 10 శాతం ఆహార సబ్సిడీతో భారత్‌లో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. అది 10 శాతం దాటితే.. భారత్‌పై జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశముంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా ఉద్ధృతం ఎబోలా వైరస్ ధాటికి పశ్చిమ ఆఫ్రికా దేశాలు విలవిల్లాడుతున్నాయి. సియోర్రా లియోన్‌లో ఎబోలా వ్యాధి ప్రబలి జూలై 31 నాటికి మరణించిన వారి సంఖ్య 233కు చేరింది. సియోర్రాలియోన్తో పాటు లైబీరియా, గినియా దేశాల్లో జూలై 31 నాటికి 729 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమావేశం నిర్వహించిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. వ్యాధిని ఎదుర్కొనేందుకు వంద మిలియన్ డాలర్ల ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించాయి. వార్తల్లో వ్యక్తులు ఆర్మీ ఛీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్ సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) జూలై 31న బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 26వ ఆర్మీ ఛీఫ్‌గా నియామకమైన సుహాగ్ 30 నెలలపాటు ఈ హోదాలో కొనసాగుతారు. దల్బీర్‌సింగ్ సుహాగ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులవ్వడంతో ఆర్మీ వైస్ చీఫ్‌గా ఫిలిప్ కంపోజ్ ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కంపోజ్(59) బాధ్యతలు స్వీకరించారు. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా అరూప్ రాహా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు. జనరల్ బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన రాహా 29 నెలలపాటు ఈ హోదాలో ఉంటారు. త్రివిధ దళాల అవసరాలను సమన్వయం చేసే ఈ కమిటీ సైనిక కార్యకలాపాలు, ఆయుధ పరికరాలు సమకూర్చుకోవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రాను కేంద్ర ప్రభుత్వం జూలై 31న నియమించింది. సీబీడీటీ కొత్త చైర్మన్ కేవీ చౌదరి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నూతన చైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారి కె.వి.చౌదరి నియమితులయ్యారు. 1978 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆగస్టు 1న బాధ్యతలు చేపట్టారు. చౌదరి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి. ఆయన పూర్తిపేరు కొసరాజు వీరయ్యచౌదరి. రాష్ట్రీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అల్లూరి జయంతి అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా అల్లూరి జయంతి జూలై 4న ప్రభుత్వం తరపున అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. గోండు లిపి మొదటి వాచకం ఆవిష్కరణ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో జూలై 31న గోండు లిపిలో రాసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్లేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన పలువురు దీనికోసం కృషి చేశారు. మెట్రో పొలిస్-2014 వేదిక హైదరాబాద్ మెట్రో పొలిస్ సదసు ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనుంది. గతంలో సిడ్నీ వేదికగా మెట్రోపొలిస్ సదస్సును నిర్వహించారు. అతిపెద్ద బంగారు డిపాజిట్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు 2న జమ చేసింది. తిరుపతి వచ్చిన ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు 1800 కిలోల బంగారాన్ని తితిదే కార్య నిర్వహణాధికారి ఎం. జి. గోపాల్ అందజేశారు. దీంతో ఇంతపెద్ద మొత్తం బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొదటి సంస్థగా తితిదే రికార్డు సృష్టించింది. దీనికి ఒకశాతం బంగారాన్ని వడ్డీ కింద ఎస్బీఐ చెల్లిస్తుంది. -
రామన్ మెగసెసె అవార్డు నుంచి.. సీఎం పీఠం వరకు
మరొక్క రోజులో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న అరవింద్ కేజ్రీవాల్.. ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి, దానికి రాజీనామా చేశారు. ప్రజా ఉద్యమాల్లోకి దూకి.. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి భారీ పోరాటం చేశారు. నిర్భయ ఘటన జరిగినా.. మరే సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుకు ఉరికారు. ఇతర నాయకుల్లా హంగు, ఆర్భాటాలు లేకుండా.. ప్రతిరోజూ ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే చీపురుకట్టను తమ ఎన్నికల గుర్తుగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో పొలిటికల్ పండితుల అంచనాలను తలదన్ని.. 28 సీట్లు కైవసం చేసుకున్నారు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఎవరో, ఏం చేశారో చూద్దామా.. 1968 ఆగస్టు 16వ తేదీన గోవింద రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతులకు హర్యానాలోని హిస్సార్‌లో అరవింద్ జన్మించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పరిధిలో గల కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎ-119 అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. హిస్సార్ లోని క్యాంపస్ స్కూల్లో ప్రాథమిక విద్య చదివి, ఆ తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్స్‌లో ఉద్యోగంలో చేరారు. తర్వాత సివిల్స్ రాసి ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికై, ఆదాయపన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా 1995 నుంచి 2006 వరకు పనిచేశారు. 2000 సంవత్సరంలో పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. సివిల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2011లో 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' బ్యానర్ కింద జనలోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమం మొదలుపెట్టారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. 2004లో పౌరసేవలకు గాను అశోక ఫెలోషిప్, 2005లో ప్రభుత్వ పారదర్శకత కోసం పోరాడినందుకు ఎస్కే దూబే స్మారక అవార్డు, 2006లో నాయకత్వ ప్రతిభకు గాను రామన్ మెగసెసె అవార్డు అరవింద్ కేజ్రీవాల్‌ను వరించాయి.