రామన్ మెగసెసె అవార్డు నుంచి.. సీఎం పీఠం వరకు
మరొక్క రోజులో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న అరవింద్ కేజ్రీవాల్.. ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి, దానికి రాజీనామా చేశారు. ప్రజా ఉద్యమాల్లోకి దూకి.. లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి భారీ పోరాటం చేశారు. నిర్భయ ఘటన జరిగినా.. మరే సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుకు ఉరికారు. ఇతర నాయకుల్లా హంగు, ఆర్భాటాలు లేకుండా.. ప్రతిరోజూ ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే చీపురుకట్టను తమ ఎన్నికల గుర్తుగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో పొలిటికల్ పండితుల అంచనాలను తలదన్ని.. 28 సీట్లు కైవసం చేసుకున్నారు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఎవరో, ఏం చేశారో చూద్దామా..
1968 ఆగస్టు 16వ తేదీన గోవింద రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతులకు హర్యానాలోని హిస్సార్లో అరవింద్ జన్మించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పరిధిలో గల కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ గ్రౌండ్ఫ్లోర్లో ఎ-119 అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. హిస్సార్ లోని క్యాంపస్ స్కూల్లో ప్రాథమిక విద్య చదివి, ఆ తర్వాత ఖరగ్పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే జంషెడ్పూర్లోని టాటా స్టీల్స్లో ఉద్యోగంలో చేరారు. తర్వాత సివిల్స్ రాసి ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికై, ఆదాయపన్ను శాఖలో జాయింట్ కమిషనర్గా 1995 నుంచి 2006 వరకు పనిచేశారు. 2000 సంవత్సరంలో పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. సివిల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2011లో 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' బ్యానర్ కింద జనలోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం మొదలుపెట్టారు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు.
2004లో పౌరసేవలకు గాను అశోక ఫెలోషిప్, 2005లో ప్రభుత్వ పారదర్శకత కోసం పోరాడినందుకు ఎస్కే దూబే స్మారక అవార్డు, 2006లో నాయకత్వ ప్రతిభకు గాను రామన్ మెగసెసె అవార్డు అరవింద్ కేజ్రీవాల్ను వరించాయి.