నిక్కచ్చిగా వ్యవహరించడం, నిర్భీతితో పనిచేయడం కత్తి మీది సాము. అధికారులుగా ఉంటున్నవారు వేధింపులకూ, కష్టాలకూ సిద్ధపడితే తప్ప అది సాధ్యంకాదు. అలాంటివారిని పోల్చుకోవడం, వారికి అండదండలీయడం సమాజం బాధ్యత. ఈ ఏడాది రామన్ మెగసెసె అవార్డు పొందిన ఇద్దరు భారతీయుల్లో ఒకరైన సంజీవ్ చతుర్వేది ఆ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్న అధికారే. పాలకులు మారినా, విధానాలు మారాయని చెబుతున్నా సంజీవ్ చతుర్వేదికి సంబంధించినంత వరకూ మారిందేమీ లేదు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతున్నది. తన కోసం, తన వాళ్ల కోసం కాక సమాజం గురించి ఆలోచిం చడం... జరుగుతున్న అక్రమాలను సరిచేద్దామనుకోవడం, ఖజానాను కాపాడాలను కోవడం పాలకులుగా ఉంటున్నవారికి ఎంత కంటగింపుగా మారిందో తెలుసుకోవా లంటే చతుర్వేది పోరాట చరిత్రను పరామర్శించాలి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన చతుర్వేదిని గత అయిదేళ్లలో 12 సార్లు బదిలీచేశారు. హర్యానాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేయాలనుకున్నవారి ఆట కట్టించడం, హెర్బల్ పార్క్ పేరుతో ఒక ప్రైవేటు స్థలంలో ప్రజా ధనాన్ని దుర్వి నియోగం చేయకుండా అడ్డుకోవడం వంటి ఉదంతాల తర్వాత అక్కడి ప్రభుత్వం ఆయనను 2007లో సస్పెండ్ చేసింది. ఆయనపై బోలెడు ఆరోపణలతో చార్జిషీటు రూపొందించింది. ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను 2008లో రాష్ట్రపతి జోక్యం చేసుకుని రద్దు చేశారు. కానీ హర్యానా ప్రభుత్వం పదే పదే అదే తంతును కొనసాగించడంవల్ల 2011 జనవరిలో, 2013 అక్టోబర్‌లో, 2014 జనవరిలో రాష్ట్రపతి కలగజేసుకోవాల్సివచ్చింది. మధ్యలో సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా హర్యానా ప్రభుత్వం ప్రయత్నిం చింది. ఇందులో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనదేమంటే... చతుర్వేది బయటపెట్టిన కోట్లాది రూపాయల ప్లాంటేషన్ కుంభకోణంలో ఆయన్నే నిందితుడిగా ఇరికించడం! ఆ వ్యవహారంలో చతుర్వేది సస్పెండ్ చేసిన ఒక అధికారి ఆత్మహత్య చేసుకుంటే అందుకు ప్రధాన కారకుడిగా ఆరోపించి ఆయనను అరెస్టు చేయడానికి హర్యానా పోలీసులు ప్రయత్నించారు. మొత్తంగా నాలుగుసార్లు రాష్ట్రపతిని ఆశ్రయిస్తే తప్ప సంజీవ్ చతుర్వేది ఉద్యోగం నిలబడలేదు. ఇదంతా హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా జరిగింది. నిజాయితీగల అధికారులను వేధించడం అక్కడ కొత్తగాదు. ఒకపక్క చతుర్వేదిపై ఇవి కొనసాగిస్తూనే ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టిన వైనాన్ని ఎవరూ మరిచిపోలేరు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారం కూపీ లాగడానికి ప్రయత్నించినందుకు ఖేమ్కాను బదిలీలతో వేధించారు.
హర్యానాయే కాదు...దేశమంతా అలాగే ఉన్నదని తెలుసుకోవడానికీ...పాలకులు మారినా పద్ధతులు మారవని అర్ధంకావడానికీ చతుర్వేదికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆయన డెప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)కు చీఫ్ విజిలెన్స్ అధికారిగా వెళ్తే అక్కడ కూడా ఆయనకు అక్రమాలే తారసపడ్డాయి. వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తే బదిలీయే బహుమతి అయింది. ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తూ చీఫ్ విజిలెన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన 165 అవినీతి కేసుల్ని పెట్టారు. వీటిల్లో పలువురిపై జరిమానాలు విధించి వసూలు చేయడమేకాక కొందరిని సర్వీస్‌నుంచి కూడా తొలగించారు. 87మందిపై చార్జిషీట్లు పెట్టారు. ఈ క్రమంలో చతుర్వేదికి మళ్లీ వేధింపులు తప్పలేదు. కేంద్రంలో ప్రభుత్వం మారినా ఆయన రాత మారలేదు. ఎన్డీయే సర్కారు ఆయనకు పనిలేకుండా చేసింది. చీఫ్ విజిలెన్స్ అధికారి బాధ్యతలనుంచి తప్పించింది. హర్యానా క్యాడర్‌నుంచి తనను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయమని చతుర్వేది పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని నియామకాల కమిటీ తోసిపుచ్చితే కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) దాన్ని కొట్టివేస్తూ మొన్న మే నెలలో ఆదేశాలు జారీచేసింది. ఆయన పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అక్రమాలు ఎంతగా వ్యవస్థీకృతమైనాయో...అక్రమార్కులకు అండదండలెలా లభిస్తున్నాయో ఈ ఉదంతాలన్నీ తేటతెల్లం చేస్తాయి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక తొలుత ఆరోగ్య మంత్రిగా వ్యవహరించిన హర్షవర్ధన్‌కు నిజాయితీపరుడన్న పేరుంది. కానీ, ఆయన సైతం చతుర్వేది విషయంలో భిన్నంగా స్పందించలేకపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జేపీ నడ్డా కూడా అదే బాటలో వెళ్లారు. చతుర్వేదిని ఎన్నిసార్లు బదిలీలు చేశారో, ఆయనపై ఎన్నిసార్లు సస్పెన్షన్ వేటు పడిందో తెలుసుకోవడం కోసం ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను అడిగితే ‘వ్యక్తిగత’ సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖ జవాబిచ్చింది. అధికారిగా చతుర్వేది వ్యవహరించిన తీరులోగానీ, అందుకు ప్రభుత్వాలు స్పందించిన తీరులోగానీ వ్యక్తిగతం ఏముంటుంది? ఈ విషయాన్నే కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అడిగినప్పుడు ఆ శాఖ అధికారులు నీళ్లు నమిలారు.
నిజాయితీగల అధికారులు అవినీతి విషయంలో తీసుకుంటున్న చర్యలెలాంటివో, ఆ క్రమంలో రాజకీయ నాయకత్వంనుంచి వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటో తెలిపే సమాచారం ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉండేదని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు శ్రీధర్ చెప్పాల్సివచ్చింది.
ఈ ఏడాది మెగసెసె అవార్డు పొందిన మరో వ్యక్తి అన్షు గుప్తా. గూంజ్ పేరుతో ఆయన నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ నిరుపేదలకూ, అసహాయులకూ కనీసావసర మైన బట్టలు, గృహోపకరణాలు సమకూర్చడం ధ్యేయంగా పెట్టుకుంది. సకల సౌకర్యాలనూ సమకూర్చిపెట్టగల వృత్తినీ, ఉద్యోగాన్నీ వదులుకుని ఎన్నో అవరోధాల మధ్య అట్టడుగు వర్గాల సముద్ధరణకు అన్షు పాటుబడుతున్నారు. తమ కోసం కాక సమాజం కోసం, దాని ఉన్నతి కోసం పోరాడేవారికీ... తపనపడే వారికీ వచ్చే పురస్కారాలు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతాయి. ఆ దిశగా ఆలోచించేందుకూ, ఆచరణలోకి దిగేందుకూ ఎందరినో ప్రోత్సహిస్తాయి. దీంతోపాటు ప్రభుత్వాలు తమ తప్పిదాలను గుర్తించి సరిచేసుకోవడానికి కూడా ఉపయోగపడితే మరింత బాగుంటుంది.