2014- రామన్ మెగసెసె అవార్డులు... | Ramon Magsaysay Award 2014 announced | Sakshi
Sakshi News home page

2014- రామన్ మెగసెసె అవార్డులు...

Published Thu, Aug 7 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

2014- రామన్ మెగసెసె అవార్డులు...

2014- రామన్ మెగసెసె అవార్డులు...

క్రీడలు
 కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వస్థానం

 స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జూలై 23న ప్రారంభమైన 21వ  కామన్‌వెల్త్ క్రీడలు ఆగస్టు 3తో ముగిశాయి. కెనడాకు చెందిన రిథమిక్ జిమ్నాస్ట్ ఫ్రాంకీ జోన్స్ ఉత్తమ అథ్లెట్‌గా ఎంపికైంది. 21వ కామన్‌వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో 2018లో జరగనున్నాయి.


 మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు
 దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
 ఇంగ్లండ్    58    59    57    174
 ఆస్ట్రేలియా    49    42    46    137
 కెనడా    32    16    46    82
 స్కాట్లాండ్    19    15    19    53
 భారత్    15    30    19    64
  భారత్ 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్యాలతో మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
 
 కశ్యప్‌కు స్వర్ణం
 తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించాడు. 1978లో ప్రకాశ్ పదుకొనె, 1982లో సయ్యద్ మోడీ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించారు. స్క్వాష్‌లో మహిళల డబుల్స్‌లో భారత  జోడీ దీపికా పల్లికల్, జ్యోష్న చినప్ప టైటిల్ గెలుచుకున్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో స్క్వాష్‌లో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. అలాగే కామన్‌వెల్త్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా దీప కర్మాకర్ రికార్డు సృష్టించింది. జూలై 31న వాల్ట్ విభాగంలో జరిగిన పోటీలో త్రిపురకు చెందిన దీప కాంస్య పతకం నెగ్గింది.  కర్ణాటకకు చెందిన వికాస్‌గౌడ్ డిస్కస్‌త్రోలో తొలి స్వర్ణం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.. ఈ విజయంతో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కాడు. వికాస్‌గౌడ్‌కు ముందు మిల్కాసింగ్ 1958 కామన్‌వెల్త్ క్రీడల్లో ట్రాక్ ఈవెంట్ విభాగంలో తొలిసారి బంగారుపతకం సాధించాడు.
 
 టెన్నిస్‌లో వేగవంతమైన సర్వ్ రికార్డ్ నమోదు
 జర్మనీకి చెందిన సబీన్ లిసికి జూలై 30న మహిళల టెన్నిస్ విభాగంలో అత్యంత వేగవంతమైన సర్వ్ రికార్డును నెలకొల్పింది. అమెరికా వేదికగా అన్నా ఇవనోవిచ్‌తో తలపడిన మ్యాచ్‌లో మొదటి రౌండ్‌లో గంటకు 131 మైళ్ల వేగంతో సర్వ్‌ను చేసింది. కాగా ఆమె ఓటమిపాలైంది.
 
 జాతీయం
 భారత్‌లో పర్యటించిన అమెరికా మంత్రులు
 అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, వాణిజ్యమంత్రి పెన్నీ ప్రిట్జికర్‌లు భారత్‌లో పర్యటించారు. సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు అధ్యక్షుడు ఒబామా ఆసక్తితో ఉన్నారని మోడీకి తెలిపారు.
 
 గ్యాస్ ధరలపై సురేశ్‌ప్రభు కమిటీ
 గ్యాస్ ధరల నియంత్రణపై సమీక్షించేందుకు సురేశ్‌ప్రభు నేతృత్వంలోని కమిటీని కేంద్రం జూలై 24న నియమించింది. ప్రభు.. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కమిటీలో సురేశ్‌ప్రభుతోపాటు ప్రతాప్ భాను మెహతా ఉన్నారు.
 
 రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రారంభం
 కేంద్ర ప్రభుత్వం జూలై 28న రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే జాతీయ స్థాయి పథకాన్ని ప్రారంభించింది. స్వదేశీ పశు వీర్య సేకరణ, పశు సంతతి అభివృద్ధ్ధి ఈ పథకం లక్ష్యం. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ దీన్ని ప్రారంభించారు. 12వ ప్రణాళికలో భాగంగా ఈ పథకం కింద రూ. 500 కోట్లను వెచ్చించనున్నారు.
 
 జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన
 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన యాత్రను న్యూఢిల్లీలో జూలై 28న ప్రారంభించారు. భారత జీవవైవిధ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రైలు ప్రదర్శనను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ చేపట్టాయి. 2012లో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ రైలు నడుస్తోంది. 194 రోజులపాటు 20 రాష్ట్రాల్లో ప్రయాణించి 2015 ఫిబ్రవరి 4న గాంధీనగర్‌కు చేరుకుంటుంది. 56 చోట్ల ఆగుతుంది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు సందర్శిస్తారని అంచనా. ప్రపంచంలో అత్యధికులు సందర్శించిన రైలు ఇదే. భారత్.. ప్రపంచ భూభాగంలో 2.5 శాతం, ప్రపంచ జనాభాలో 17 శాతం, ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం కలిగి ఉంది.
 
 అవార్డులు
 2014- రామన్ మెగసెసె అవార్డుల ప్రకటన
 2014 సంవత్సరానికి రామన్ మెగసెసె అవార్డులను కమిటీ జూలై 30న ప్రకటించింది. ఆసియా నోబెల్‌గా పిలిచే ఈ పురస్కారాలను ఐదుగురు వ్యక్తులు, ఒక సంస్థను ఎంపిక చేశారు. ఈ అవార్డులను 1957లో విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసె సంస్మరణార్థం ఏర్పాటు చేశారు. సామాజిక మార్పునకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతిని అందజేస్తారు.
 
 అవార్డు విజేతలు
 హూషులి (చైనా): కైజింగ్ అనే బిజినెస్ మ్యాగజైన్ స్థాపకురాలు, ఎడిటర్. వ్యాపారం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, బాధ్యతలను నిర్భయంగా ప్రోత్సహించడంతోపాటు చైనాలో మీడియా కర్తవ్యాలను స్వతంత్ర భావాలతో నిర్వహించినందుకు, ఆమె నాయకత్వ ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సౌర్ మర్లినా మనురంగ్ (ఇండోనేషియా): మానవ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త. ఇండోనేషియా అడవుల్లో నివశించే ప్రజల జీవితాలనూ మెరుగుపరిచేందుకు కృషి చేశారు. వీరితోపాటు పురస్కారాలకు ఎంపికైనవారిలో ఒమర్ ఖాన్ మసౌడీ (అఫ్గానిస్థాన్ నేషనల్ మ్యూజియం డెరైక్టర్), రాండీ హలసాన్ (ఫిలిప్పీన్స్ టీచర్), పాకిస్థాన్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ద సిటిజన్స్ ఫౌండేషన్ ఉన్నాయి.
 
 ముజఫర్ అలీకి
 రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
 బాలీవుడ్ చిత్ర దర్శకుడు ముజఫర్ అలీ 22వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారానికి ఎంపికయ్యారు. మత సామరస్యం, శాంతి, సౌహార్థాన్ని పెంపొందించటానికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ. 5లక్షల నగదు ఇస్తారు.  అలీ ఉమ్రావ్‌జాన్‌తోపాటు గమన్, ఖైజన్‌తోపాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2005లో ఆయన పద్మశ్రీ అందుకున్నారు.
 
 అంతర్జాతీయం
  మోడీ నేపాల్ పర్యటన
 ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్‌లో రెండు రోజులు పర్యటించారు. ఇందులో భాగంగా ఆగస్టు 3న నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. 1990 తర్వాత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి విదేశీ నేత నరేంద్రమోడీ. నేపాల్ ప్రధాని సుశీల్‌కుమార్ కొయిరాలాతో మోడీ సమావేశమయ్యారు. పర్యాటక రంగం అభివృద్ధి, గాయిటర్ నియంత్రణ కార్యక్రమం, దూరదర్శన్-నేపాల్ టెలివిజన్‌లకు సంబంధించిన మూడు అవగాహన పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. 1950 నాటి శాంతి-మైత్రి ఒప్పందాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమీక్షించి, సవరించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ రంగాల్లో సహకారానికి, నూతన రాజ్యాంగ రచనలో తోడ్పాటుకు, స్కాలర్ షిప్‌ల సంఖ్యను 180 నుంచి 250కు పెంచడానికి మోడీ అంగీకరించారు. ఈ సందర్భంగా 16ఏళ్ల నుంచి తన సంరక్షణలో పెరిగిన జీత్‌బహుదూర్ అనే నేపాలీ యువకుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
 
 చైనాలో లోతైన ప్రయోగశాల
 ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంలో ప్రయోగశాల నిర్మించేందుకు చైనా ఆగస్టు 2న పనులను ప్రారంభించింది. సైన్స్ చరిత్రలో చిక్కుముడిగా ఉన్న కృష్ణ పదార్థాన్ని గుర్తించే ఉద్దేశంతో నైరుతి సిచువాన్ రాష్ట్రంలోని జిన్‌పింగ్ జల విద్యుత్ కేంద్రం అడుగున 2,400 మీటర్ల లోతున దీన్ని నిర్మిస్తోంది.  2015 నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది.
 
 డబ్ల్యూటీవో చర్చలు విఫలం
 వ్యవసాయ సబ్సిడీలపై భారత్ అభ్యంతరాలను సంపన్న దేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో  జెనీవాలో జరిగిన డబ్ల్యూటీవో చర్చలు విఫలమయ్యాయి. భారత్ లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకుండా.. వాణిజ్య సౌలభ్య ఒప్పందం(ట్రేడ్ ఫెలిసిటేషన్ అగ్రిమెంట్-టీఎఫ్‌ఏ)ను ఉన్నదున్నట్లుగా భారత్ అంగీకరించాలని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆహారోత్పత్తుల నిల్వ, ఆహార సబ్సిడీల లెక్కింపునకు సంబంధించి డబ్ల్యూటీవో నిబంధనల్లో సవరణలు కావాలని భారత్ కోరుతోంది. మొత్తం ఆహారోత్పత్తుల విలువలో సబ్సిడీలు 10 శాతంగా ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు చెబుతున్నాయి. అయితే, 20 ఏళ్ల కిందటి ధరల ఆధారంగా వాటిని లెక్కిస్తున్నారు. సబ్సీడీల విషయంలో 1986-87ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవద్దని, ప్రస్తుత ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని భారత్ కోరుతోంది. అలాగే, 10 శాతం ఆహార సబ్సిడీతో భారత్‌లో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. అది 10 శాతం దాటితే.. భారత్‌పై జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశముంది.
 
 పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా ఉద్ధృతం
 ఎబోలా వైరస్ ధాటికి పశ్చిమ ఆఫ్రికా దేశాలు విలవిల్లాడుతున్నాయి. సియోర్రా లియోన్‌లో ఎబోలా వ్యాధి ప్రబలి జూలై 31 నాటికి మరణించిన వారి సంఖ్య 233కు చేరింది.  సియోర్రాలియోన్‌తో పాటు లైబీరియా, గినియా దేశాల్లో జూలై 31 నాటికి 729 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సమావేశం నిర్వహించిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. వ్యాధిని ఎదుర్కొనేందుకు వంద మిలియన్ డాలర్ల ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించాయి.
 
 వార్తల్లో వ్యక్తులు
 ఆర్మీ ఛీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్
 సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) జూలై 31న బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 26వ ఆర్మీ ఛీఫ్‌గా నియామకమైన సుహాగ్ 30 నెలలపాటు ఈ హోదాలో కొనసాగుతారు. దల్బీర్‌సింగ్ సుహాగ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులవ్వడంతో ఆర్మీ వైస్ చీఫ్‌గా ఫిలిప్ కంపోజ్ ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కంపోజ్(59) బాధ్యతలు స్వీకరించారు.  
 
 చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా అరూప్ రాహా
 చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు. జనరల్ బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన రాహా 29 నెలలపాటు ఈ హోదాలో ఉంటారు. త్రివిధ దళాల అవసరాలను సమన్వయం చేసే ఈ కమిటీ సైనిక కార్యకలాపాలు, ఆయుధ పరికరాలు సమకూర్చుకోవడం  వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
 
 ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రా
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రాను కేంద్ర ప్రభుత్వం జూలై 31న నియమించింది.  
 
 సీబీడీటీ కొత్త చైర్మన్ కేవీ చౌదరి
 కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నూతన చైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారి కె.వి.చౌదరి నియమితులయ్యారు. 1978 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆగస్టు 1న బాధ్యతలు చేపట్టారు. చౌదరి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి. ఆయన పూర్తిపేరు కొసరాజు వీరయ్యచౌదరి.
 
 రాష్ట్రీయం
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అల్లూరి జయంతి
 అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా అల్లూరి జయంతి జూలై 4న ప్రభుత్వం తరపున అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
 
 గోండు లిపి మొదటి వాచకం ఆవిష్కరణ
 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో జూలై 31న గోండు లిపిలో రాసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన పలువురు దీనికోసం కృషి చేశారు.
 
 మెట్రో పొలిస్-2014 వేదిక హైదరాబాద్
 మెట్రో పొలిస్ సదసు ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనుంది. గతంలో సిడ్నీ వేదికగా మెట్రోపొలిస్ సదస్సును నిర్వహించారు.
 
 అతిపెద్ద బంగారు డిపాజిట్
 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు 2న జమ చేసింది. తిరుపతి వచ్చిన ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు 1800 కిలోల బంగారాన్ని తితిదే కార్య నిర్వహణాధికారి ఎం. జి. గోపాల్ అందజేశారు. దీంతో ఇంతపెద్ద మొత్తం బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొదటి సంస్థగా తితిదే రికార్డు సృష్టించింది. దీనికి ఒకశాతం బంగారాన్ని వడ్డీ కింద ఎస్‌బీఐ చెల్లిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement