ఏ కష్టం కడతేర్చిందో..?!
ఎల్.ఎన్.పేట: రాత్రి వరకు ఇరుగుపొరుగు వారితో సరదాగానే గడిపిన ఆ కుటుంబం తెల్లవారేసరికి ఈ లోకంలోనే లేకుండా పోయింది. నిద్రలోనే నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన ఇటు ఎల్.ఎన్.పేటను.. అటు వసప గ్రామాన్ని విషాదంలో ముంచేసిం ది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన పిచ్చుక తవిటయ్య, లక్ష్మిల ఏకైక కుమారుడు భద్రయ్య(35).
ఆయనకు భార్య నాగమణి(30), కుమారులు హరిప్రసాద్(8), చంద్రమౌళి(6) ఉన్నారు. బతుకు తెరువు కోసం భ ద్రయ్య సుమారు ఏడాదిన్నర క్రితం అత్తవారి ఊరుకు సమీపంలో ఉన్న ఎల్.ఎన్.పేటకు వలస వచ్చి షాపు అద్దెకు తీసుకొని ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, ఆటో ల రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. షాపు ఎదురుగానే ఇల్లు అద్దెకు తీసుకొని భార్యాపిల్లలతో కాపురం పెట్టాడు. పిల్లలి ద్దరు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. చుట్టుపక్కలవారితో సరదాగా ఉండే ఈ కుటుంబీకులు శుక్రవారం రాత్రి కూడా అలాగే గడిపా రు. శనివారం శని త్రయోదశి కావడంతో శనీశ్వరాలయానికి వెళతామని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. అనంతరం భోజనాలు చేసి నిద్రపోయారు.
గుడికి వెళ్లారనుకున్నాం..
శనివారం ఉదయం పది గంటల వరకు ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి చెప్పినట్లు ఆలయానికి వెళ్లి ఉంటారని భావించిన చుట్టుపక్కలవారు మొద ట పెద్దగా పట్టించుకోలేదు. సమయం గడుస్తోంది.. పది గంటలైంది.. అయినా భద్రయ్య ఇంటి వాతావరణంలో ఎలాం టి మార్పులేదు. దాంతో చిన్న అనుమానం మొదలైంది. కొందరు తలుపు, కిటికీల సందుల్లోంచి లోపలికి చూశారు. నలుగురూ మంచాలపై కనిపిం చారు. ఇంకా పడుకొని ఉన్నారనుకుని వెళ్లిపోయారు. అయితే 11 గంటలవుతున్నా ఆ ఇంటి సభ్యులు బయటకు రాకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు బలపడ్డాయి. వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్సై ఎం.శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు తెరిపిం చారు. లోపలికి వెళ్లి పరిశీలిస్తే.. నలుగురూ విగతజీవులుగా కనిపించారు.
విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. మొత్తం విషా దం అలుముకుంది. బంధువులు, స్థాని కులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యు లు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ కుటుంబానికి ఎటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు లేవని బంధువులు, స్థానికు లు చెప్పారు. పిల్లలిద్దరూ బాగానే చదువుతారని సంఘటన స్థలానికి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయుడొకరు చెప్పారు. సమాచారం తెలుసుకొని హిరమండలం మండలం చిన్న కొల్లివలసకు చెందిన నాగమణి కన్నవారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంటిని, మెకానిక్ షెడ్‌ను శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి. మోహనరావు పరిశీలించారు. స్థానికు లు, మృతుల తల్లిదండ్రులు, బంధు వులను విచారించారు. మృతదేహా లను పోస్టుమార్టానికి పంపించి కేసు న మోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చె ప్పా రు. పోస్టుమార్టం నివేదిక అందేవరకు వారి మరణానికి కారణాలు చెప్పలేమని, ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదన్నారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు
వసప(కొత్తూరు): భద్రయ్య కుటుంబ మరణంతో స్వగ్రామం కొత్తూరు మం డలం వసపలోనూ విషాదం అలుముకుంది. కుటుంబ పోషణకు భద్రయ్య ఎల్.ఎన్.పేటకు తరలివెళ్లినా అతని తల్లిదండ్రులు వసపలోనే ఉంటున్నారు. కూలి పనులు చేసుకొని జీవిస్తున్న వీరి ద్దరూ కొడుకు, కోడలు, ఇద్దరు మనవలు మృతి చెందిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా కుంగిపోయారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో ఏ విధంగా బతకాలని ఆవేదనగా ప్రశ్నించడం స్థాని కులను కంట తడిపెట్టించింది. వారితోపాటు ఇతర బంధువులు హూటాహుటిన ఎల్.ఎన్.పేటకు వెళ్లారు.
ఏం జరిగి ఉంటుంది?
భద్రయ్యకు ఆర్థికపరమైన సమస్యలే వీ లేవని తల్లిదండ్రులతో పాటు అత్తమామాలు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరిదీ ఉన్నంతలో సరిపెట్టుకునే తత్వమేనని అన్నారు. పురుగుల మందులాంటి విషపూరిత పదార్థాలు సేవించారనడానికి.. ఇంట్లో అటువంటి ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. నిద్రలోనే మరణించినట్లు ఉందన్నారు. రాత్రి తీసుకున్న ఆహార పదార్థాల్లో బల్లి వంటివి పడి విషపూరితమయ్యాయా?.. లేక చెరువు గట్టున ఇల్లు ఉన్నందున విషపురుగులు ఏమైనా కుట్టాయా?? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషపూరిత ఆహారం తిన్నా.. పురుగూపుట్రా కుట్టినా.. వాంతులు కావడం, అస్వస్థతకు గురవడం జరుగుతుంది. అదే జరిగితే బయటకు వచ్చి ఇరుగుపొరుగువారి సహాయం తీసుకుంటారు. పైగా వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా లేవు. ఎవరితోనూ తగాదాలు, సమస్యలు లేదు. దంపతులిద్దరూ ఎంతో సరదాగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.ఇవేవీ కానప్పుడు.. వీరి మరణానికి కారణమేమిటన్నది మిస్టరీగా మారింది.