భాగ్ పాండే భాగ్
విధివంచితుణ్ని అనుకుంటూ బాధపడుతూ కూర్చోలేదు.. మనీష్ పాండే. అంతులేని ఆత్మవిశ్వాసంతో పరుగు పోటీల్లో రాణిస్తున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే...
నా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్. అక్కడే పుట్టి పెరిగాను. చదువుకున్నదీ అక్కడే. వూ నాన్న జేఎస్ పాండే ఆదిత్య బిర్లా ఉద్యోగి. అవ్ము ఊర్మిళ పాండే గృహిణి. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేశా. కళాశాల స్థాయికి వచ్చేసరికి వివిధ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాను. చివరకు నేషనల్ లాంగ్ జంపర్‌గా ఎదిగా. అయితే 2011 ఏప్రిల్ 2న ఊహించని ప్రమాదం ఎదురైంది. తోపులాటలో కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయూను. కుడి కాలు చచ్చుబడింది.
లక్ష్యం వూర్చుకున్నా..
కాస్త కోలుకున్న తర్వాత లక్ష్యాన్ని వూర్చుకున్నా. 2012లో బెంగళూరులో జరిగిన పారా ఒలింపిక్స్ ట్రయల్ రన్లో 100 మీటర్లు, 200 మీటర్లలో పరుగెత్తా. అక్కడ నా ప్రతిభను గుర్తించిన ఓ వ్యక్తి బ్లేడ్ ప్రొటెస్టిక్ వాడితే పారా ఒలింపిక్స్‌లో రాణించొచ్చన్నాడు. రూ. 4 లక్షల విలువచేసే ఆ బ్లేడ్ కొనుగోలు చేసే స్తోవుత లేక నిరాశకు గురయ్యాను.
ఆదుకున్న హైదరాబాద్..
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని దక్షిణ రిహాబిలిటేషన్ సెంటర్ డెరైక్టర్ మోహన్ గాంధీ బ్లేడ్‌తో పాటు ఈవెంట్లో పాల్గొనేందుకు పూర్తి ఖర్చును భరిస్తానని హామీనిచ్చారు. అంతే.. ఇక ఆగలేదు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీసు చేయుడం మొదలెట్టా. సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ పూర్తిగా పారా ఒలింపిక్స్‌పైనే దృష్టి కేంద్రీకరించా. కోచ్ లేకున్నా యూ ట్యూబ్ ద్వారా ప్రముఖ అథ్లెట్లు హుస్సేన్ బోల్ట్, జానీ పికాక్ ప్రాక్టీస్ తీరును చూసేయుడం.. నా శైలిలో సాధన చేయుడడం అలవాటు చేసుకున్నా. గత నెలలో ట్యునీషియాలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ పిక్స్‌లో ఏపీ తరఫున బ్లేడ్ రన్నర్‌గా పాల్గొన్నా. 100 మీటర్ల విభాగంలో 0.2 సెకన్ల తేడాతో బంగారు పతకం చేజారింది. కాంస్యంతో సరిపెట్టుకున్నా. 200 మీటర్ల విభాగంలో రజతం సాధించా. వీటితో పాటు ఆసియా పారా ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాను. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. అయితే ప్రభుత్వం తరఫున సహాయం లభిస్తే మరింత రాణించేందుకు అవకాశముంటుంది.
- వాంకె శ్రీనివాస్