రైతు మృతిపై ఆందోళన
భైంసాలో ఉద్రిక్తత
ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్
భైంసా/భైంసారూరల్/తానూరు: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్ కేంద్రంలో మంగళవారం సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తానూరుకు చెందిన రైతు హున్‌గుందే రమేశ్(36)ది హత్యేనని ఆరోపిస్తూ అతని కుటుంబీకులు, బంధువులు, హిందూ వాహిని శ్రేణులు, బీజేపీ నాయకులు, తానూరు మండలానికి చెందిన పలువురు ఆందోళనకు దిగారు. తానూర్‌కు చెందిన హున్‌గుందే రమేశ్(36) వ్యవసాయం చేసుకునే వాడు. కొద్ది రోజుల క్రితం పక్కనే ఉన్న పంట చేను వారితో గొడవలు జరిగాయి. ఈ గొడవలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసి తానూరు ఎస్సై విచారణ చేపట్టారు.
ఆ తర్వాత రమేశ్ తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పిం చాలని మరోమారు పోలీసుల వద్దకు వెళ్లాడు. అయితే, పోలీసులు స్పందించలేదు. ఈ క్రమం లోనే రైతు రమేశ్ ఆది వారం ఇంటి నుంచి వెళ్లి సోమవారం ఊరవతల చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఎస్సై నిర్లక్ష్యం వల్లే రమేశ్ హత్య జరిగిందని.. చంపి చెట్టుకు వేలాడదీశారని మృతుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతో సోమవారమే ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా మం గళవారం ఉదయం నుంచి 4 గంటలపాటు రాస్తారోకో చేశారు.
ఎస్సైని సస్పెండ్ చేయాలని...
తానూరు ఎస్సైని సస్పెండ్ చేయాలని, డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులు భైంసా బస్టాండ్‌ను దిగ్బంధనం చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు పలు ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలు కొనసాగేలా చూశారు. వారి డిమాం డ్లను ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీ ల్దార్ సుభాష్‌చందర్ తెలిపారు. హత్య కారకులను పట్టుకుంటామని డీఎస్పీ రాములు హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత భైంసా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని స్వస్థలం తానూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. యువ రైతు హత్యకు నిరసనగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.