సహకారానికి ప్రై‘వేటు’..!
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72 ప్రైవేటు పంచదార కంపెనీలు ఉండగా, అందులో 15 షోలాపూర్‌లోనే ఉన్నాయి. ఇక్కడ సహకార కంపెనీల కంటే కంటే ప్రైవేటు కంపెనీల సంఖ్య పెరుగుతోంది. షోలాపూర్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 30 కంపెనీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ క్రషింగ్ సమయంలో జిల్లాలో మరిన్ని ప్రైవేట్ కంపెనీలు వెలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంగళవేడా తాలూకాలోని కచరెవాడేలో యుటోపియన్, లవంగిలో భైరవనాథ్ షుగర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో మూడు ప్రారంభ దిశలో ఉన్నాయి. దీంతో జిల్లాలో ప్రైవేటు కంపెనీల సంఖ్య 20కి పెరగనుంది. రాష్ట్రంలో తక్కువగా వర్షపాతం నమోదైన షోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్ ప్రాంతాల్లోనే ప్రైవేట్ కార్ఖాణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో ఏర్పాటైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు విజయవంతమవ్వడమే కాకుండా కొన్నివేల మందికి ఉపాధిని కలిగించాయి. అయితే ప్రస్తుతం సహకార ఫ్యాక్టరీల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో వాటిలో చాలావరకు మూతదశకు చేరుకున్నాయి. 36 సహకార చక్కెర కర్మాగారాలు లిక్విడేటర్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. అలాగే మరో 28 కంపెనీలు సహకారం నుంచి ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదిలాఉండగా, వర్షపాతం తక్కువగా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో 5 ప్రైవేటు ఫ్యాక్టరీలున్నాయి. అలాగే పుణేలో 5, సతారా 3, సంగ్లీ 3, అహ్మద్‌నగర్ ప్రాంతంలో 5 చొప్పున ప్రైవేటు పంచదార కంపెనీలు వెలిశాయి. మరాట్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లాలో 6, లాతూర్‌లో 4 ప్రైవేట్ కంపెనీలు ప్రారంభమయ్యాయి.