‘భక్తరామదాసు’ పనులు వేగవంతం చేయండి
ఇస్లావత్‌తండా(తిరుమలాయపాలెం): పాలేరు నియోజకవర్గంలోని 59వేల ఎకరాలకు సాగునీరు అందించే భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయూలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం పైపులైన్, కాలువ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి సాగునీరు అందించాలనే సంకల్పం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యపడలేదని, తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అవకాశం వచ్చిందని, దీనికి ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలపడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వ్యవసాయపనులు కూడా ముగిసినందున పైపులైన్ నిర్మాణ పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత వరకు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దుమ్ముగూడెం ప్రాజెక్టు ఈఈ నాగేశ్వరరావుని ఆదేశించారు. పాలేరు ప్రాంత ప్రజలకు సాధ్యమైనంత తొందరగా సాగునీరు అందించడమే తన ముందు ఉన్న ప్రత్యేక ధ్యేయం అని, ఆ దిశగా అధికారులు కృషి చేయూలని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బోడ మంగీలాల్, సంజీవులు, ఆలుదాసు ఆంజనేయులు రాములు, కొలిచలం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు వనవాసం సురేష్‌రెడ్డి, భానోతు శ్రీను ఇస్లావత్‌తండా, సర్పంచ్ దాసరోజు సోమేశ్వరచారి ఉన్నారు.