నాకీ పెళ్లొద్దు
క్లాసిక్ కామెడీ కథ
‘‘శివశంకరంగారుట సార్! గుంటూర్నుంచి ఎస్.టి.డి.లో మాట్లాడుతున్నారు’’ అంది టెలిఫోన్ ఆపరేటర్.
‘‘హలో - ఆ - నేనే’’ అన్నాను.
‘‘ఓ అర్జంటు పని బావగారూ, మా రెండో అబ్బాయి విశ్వనాథం వైజాగ్‌లోనే ఉన్నాడు.అదే - బ్యాంక్‌లో ఆఫీసర్‌గా రిక్రూటై పదిహేను రోజుల కిందట చేరేడు.
రేపు సాయంకాలం నాలుగింటికి ఒక పెళ్లిచూపుల కార్యక్రమం ఉంది. మీ ఊళ్లోనే రంగనాథంగారని గాంధీనగర్ మూడోవీధిలో ఎర్రమేడలో ఉన్నారుట.’’
‘‘ఒస్తున్నారా, నువ్వూ మీ ఆవిడా? వెల్కమ్!’’ అన్నాను.
‘‘అదే చెబుతూంట, మేం ఈ రాత్రికో రేపు ఉదయానికో వద్దాం అని ప్రోగ్రాం వేసుకున్నాం. సడెన్‌గా నాకు హైద్రాబాదులో పని తగిలింది.
మా ఆవిడ ఒక్కతీ వెళ్లలేనంటోంది.’’
‘‘రంగనాథంగారింటికెళ్లి మరో డేటు ఫిక్స్ చేయించనా?’’
‘‘కాదు కాదు, ఆ అమ్మాయి ఎల్లుండి వాళ్లన్నయ్యతో కలిసి ఢిల్లీ వెళ్లాలిట. అంచేత ఈ తతంగం నువ్వూ మీ ఆవిడా నడిపించెయ్యాలి.’’
‘‘చాలా పెద్ద బాధ్యతే పెడుతున్నావు. ఇలాంటివి స్వయంగానే చేసుకోవాలి శివా.’’
‘‘ఇందులో మన ప్రమేయం అసలేముంది? పిల్లాపిల్లాడూ ఒకర్నొకరు చూసుకుని ఓకే అంటే పెళ్లి చేసేయడమే. ఆ అమ్మాయిని నేనూ మీ సిస్టరూ చూడ్డం అయిపోయింది. అంచేత నువ్వు కాదనకు. మావాడికి ఫోన్ చేసి నిన్ను కాంటాక్ట్ చెయ్యమని చెబుతున్నాను.’’
మర్నాడు సాయంకాలం నాలుగ్గంటలకి నేనూ మా ఆవిడా శివశంకరం కొడుకు విశ్వనాథం ఆ రంగనాథం గారింటికి వెళ్లాం.
ఇరవై నాలుగేళ్లు విశ్వనాథానికి. ఉద్యోగంలో చేరి పదిహేనురోజులే అయింది. ఇంకో ఏడాదైనా ఆగొచ్చు కదా అని నాకూ మా ఆవిడకీ అనిపించింది. ప్రభుత్వం వారు ఇరవై ఒక్కేళ్లు వెళ్లకుండా మొగపిల్లాడికి పెళ్లి చెయ్యొద్దంటున్నారే గాని పాతికేసేళ్లు వెళ్తున్నా మధ్యతరగతి అమ్మాయిలకే పెళ్లిళ్లు ఎక్కడోగాని కుదరడం లేదు కదా! ఆఖరికి ‘కళ్యాణం ఒచ్చినా కక్కొచ్చినా ఆగవు’ అని మా ఆవిడ కాంప్రమైజ్ అయిపోయింది. ‘‘కళ్యాణం సంగతి ఎలా వున్నా కక్కు రాకపోతే అదే పదివేలు’’ అన్నాను.
వెళ్లగానే మంచినీళ్లిచ్చేరు.
మూడు నిమిషాల్లో ‘టీ’ ఇచ్చేరు. మరో రెండు నిమిషాల్లో ‘ముఖ్యపాత్రల’ పరిచయం అయింది.
రంగనాథంగారబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడు. అతనొక ఫొటోల ఆల్బం తెచ్చేడు. అందులో రంగనాథంగారు, వాళ్లావిడ, రంగనాథంగారి అన్నదమ్ముల కుటుంబాలు, ఎంతమంది ఫొటోలు ఎన్నివున్నా అది ప్రత్యేకంగా పెళ్లికూతురు (పద్మలత) ఫొటోల ఆల్బం అని చెప్పొచ్చు. ఆ పిల్ల రంగనాథంగారు మద్రాసులో పనిచేస్తూ వుండినప్పుడు పుట్టిందట.
పొత్తిళ్లలో చిన్నపాపాయి, తల్లీ; కాన్పు చేసిన డాక్టరమ్మ - అదొక ఫొటో ఉంది. ఇహ అక్కడి నుంచీ గొప్ప ‘ఈస్తటిక్ సెన్స్’తో ‘మెటిక్కులస్ ప్లానింగ్’తో స్టూడియోల్లోనూ బయటా తీయించిన ఫొటోలు, సింగిల్సు నుంచీ గ్రూప్స్ దాకా సుమారు నాలుగు డజన్లు ఉన్నాయి. రంగనాథంగారికి రక్షణశాఖలో సివిలియన్ ఉద్యోగం. అంచేత ఆ ఫొటోలన్నిటికీ డిఫెన్సు బ్యాక్గ్రౌండు సమకూరింది. మద్రాసు, బొంబాయి, కొచ్చిన్, గోవా మొదలైన నగరాల దృశ్యాలు బ్యాక్ డ్రాప్‌గా పద్మలత తీయించుకున్న (పద్మలతకి తీసిన) ఫొటోల సహాయంతో నేనూ మా ఆవిడా ఒక అరగంటపాటు కుర్చీలోంచి కదలకుండా విహార యాత్రలు నిర్వహించేం.
అప్పుడు ప్రవేశించింది, రంగం మీదికి అసలు పాత్ర. ‘‘ఎంత అందంగా వుందో! మన రాజుకి చేసుకుంటేనో?’’ అని అదేదో టీవీయాడ్లో లాగా మా ఆవిడ నోరు జారుతుందేమో అని భయం వేసింది. ‘‘హలో ఎవ్విరిబడి’’ అని చిరునవ్వుతో అందర్నీ ఒకేసారి పలకరించి విశ్వనాథానికి ఎదురుగా కూచుంది. ‘‘అయామ్ పద్మలత’’ అని మరోమాటు అని అందరి వేపూ చూసింది. దాంతో తన పేరు, ‘‘పేరు పేరునా వరసగా’’ అందరికీ చెప్పినట్టు భావించుకున్నాం.
‘‘ఏం చదువుతున్నావమ్మా?’’ అని మా ఆవిడ ప్రశ్నించింది.
‘‘బి.కామ్. ‘చేస్తున్నాను’. రాహుల్‌గాంధీ నేనూ కాలేజ్‌మేట్స్’’ ఇంగ్లిష్‌లో చెప్పింది.
‘‘చేస్తున్నాను - అందికదా అని అదేదో డాక్టరేటు అనుకోకు. ఎటొచ్చీ ఆ చదువు ఢిల్లీలో చదువుతోందిట. రాజీవ్‌గాంధీ కొడుకు చదువుతున్న కాలేజీలోనేట’’ అని మా ఆవిడకి బోధపరిచేను.
‘‘మీ పేరెంట్సా? (తల్లిదండ్రులా?)’’ అని పద్మలత డైరక్టుగా విశ్వనాథాన్ని అడిగింది.
‘‘నో. ఆయన గోపాలంగారని, మా నాన్నగారి స్నేహితుడు. వాళ్లు ఈ వూళ్లోనే ఉంటారు.’’
‘‘దట్ డజన్ట్ మేక్ ఎనీ డిఫరెన్స్ (అందువల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు)’’ అంది అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ.
‘‘అబ్బాయి ఈ వూళ్లోనే బ్యాంక్‌లో ఆఫీసర్‌గా ఉంటున్నాడమ్మా’’ అంది రంగనాథంగారి భార్య కూతురితో.
‘‘తెలుసులే మమ్మీ’’ అని విశ్వనాథంతో, ‘‘మీకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఐ లైక్ డెల్హీ. నైస్ సిటీ అండ్ ఎబండెంట్ ఆపర్చునిటీస్. (నాకు ఢిల్లీ అంటే ఇష్టం. అది చాలా సుందరమైన నగరము, మరియు అక్కడ అవకాశములు పుష్కలముగా యుండును)’’ అంది.
‘‘ఆంధ్రా రీజియన్‌కి ఎలాట్ చేసేరు గనక వీలుండదనుకుంటాను. బి.కాం. అయిపోయాక ఏం చేస్తారు?’’ అన్నాడు విశ్వనాథం.
‘‘సి.ఏ. చేస్తాననుకుంటాను; ఇన్కమ్టాక్స్లో స్పెషలైజ్ చేస్తాను’’ అని, టీపాయి మీద ఉన్న వార్తాపత్రిక తీసింది పద్మలత. ‘‘మై గుడ్నెస్! మెరడోనా ఏక్షన్ ఫొటో వచ్చిందే, ఇందులో? హౌ ఛార్మింగ్!’’ అంది; స్పోర్ట్స్ పేజీ చూసి అంత మొహం చేసుకుని.
‘‘ఎవరండీ, ఏక్షన్ బాగా చేసేడంటోంది?’’ అని మా ఆవిడ నాతో గుసగుసలాడింది. పిచ్చిమొహం; మెరడోనా అంటే తెలీదు!
‘‘డర్టీకంట్రీ; మన ఇండియా ఇలాంటి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని ఒక్కణ్ని కూడా ప్రొడ్యూస్ చెయ్యలేకపోయింది.’’
ప్లేట్లలో ‘‘లైటుగా’’ టిఫిను వచ్చింది. కాసేపు సంభాషణ వాయిదా పడింది.
‘‘కాని, క్రికెట్లో మనవాళ్లు కొందరు గొప్పవాళ్లే ఉన్నారు కదా!’’ అని వొదిలేసిన సంభాషణని మళ్లా పునరుద్ధరించేడు విశ్వనాథం.
‘‘ఫ్రాంక్లీ - (నిజానికి) గవాస్కర్, కపిల్‌దేవ్ తప్ప మనకి ఎవరున్నారు? ఈవెన్ అజారుద్దీన్, వెంగ్‌సర్కార్ అండ్ శ్రీకాంత్ ఆర్ సూడో మాస్టర్స్. ఇంక టెన్నిస్ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. లెస్టాక్డ్ ఈజ్ బెటర్ (ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది)’’.
‘‘మనం ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రూపుదిద్దుకుంటున్నాం అనుకుంటాను’’ అని చెప్పేడు విశ్వనాథం; తప్పు తనదేనని ఒప్పేసుకుంటున్న ధోరణిలో.
పద్మలత మాయాశశిరేఖలా నవ్వింది. ‘‘ఆ లెక్కని ఒలింపిక్స్‌లో గాని ఏషియాడ్‌లో గాని మరో వరల్డ్ ఈవెంట్లో గాని ఇండియాకి గుర్తింపు రావడం మనం చూడం. గిన్నిస్‌బుక్‌లో మనకి స్థానమే లేదు.’’
‘‘మీరు క్రీడారంగం వార్తలతో మంచి పరిచయం కలిగి ఉన్నారు. చాలా సంతోషం. సినిమా రంగంలో కూడా ఇంతటి పరిజ్ఞానం కలిగివున్నారా?’’ అన్నాడు విశ్వనాథం.
‘‘వైనాట్? ‘మైనే ప్యార్ కియా’ ఇంకా ఈ ఏరియాకి రాలేదు. మేం నాలుగు నెలల కిందట చూసేశాం. అసలు సినీ మాగజైన్సే ఏవీ దొరకవు ఇక్కడ. అంచేత ఇక్కడికొస్తే ఎప్పుడు ఢిల్లీ వెళ్లిపోతానా అనిపిస్తుంది. బట్ ఫర్ డాడీ అండ్ మమ్మీ ఐ షన్ దిస్ ప్లేస్. (అమ్మా, నాన్న ఇక్కడుండకపోతే ఈ వూరంటే నాకు పరమ అసహ్యం)’’
‘‘అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేస్తుంది చెల్లెమ్మగారూ’’ అంది మా ఆవిడ రంగనాథంగారి భార్యతో. ‘‘ఇంతలేసి జ్ఞానాలున్నవాళ్లు వంట చేసినా, ఆఖరికి కాఫీ పెట్టినా సరే; అనుభవించే కుర్రాడిదే అదృష్టం. ఏమంటారు?’’ మా ఆవిడ అంత తెలివిగా అసలు ప్రశ్న అడగగలదని నేను ఊహించలేదు.
‘‘టు హెల్వితిట్! (వంటా, నా మొహమూనూ!)’’ అని పద్మలత లేచింది. ‘‘బై! ఐ గాట్ ఎ లాట్ టు రీడ్ (నేనింకా ఎంతో చదవాలి)’’ అని వెళ్లింది.
కొంచెంసేపు కూర్చుని మేం కూడా లేచేం. అడ్రసులూ టెలిఫోన్ నెంబర్లూ మరోసారి రూఢీ చేసుకుని బయలుదేరేం. అక్కడితో ‘‘పెళ్లిచూపులు’’ అయిపోయినట్టే.
విశ్వనాథం మాతోబాటుగా ఆటోలో మా ఇంటిదాకా వచ్చేడు. ‘‘మీరైనా చెప్పండి సా, మా నాన్నగారికి; మరీ ఇంత గొప్ప సంబంధం చూడొద్దని! నాకేమిటో భయంగా ఉంది’’ అన్నాడు.
- భమిడిపాటి రామగోపాలం