Bharat Darshan Tour
-
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘భారత్ దర్శన్’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘భారత్ దర్శన్’ పేరుతో పుణ్యక్షేత్రాలు, ఆహ్లాదకర ప్రాంతాలను కలుపుతూ ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ఐఆర్సీటీసీ టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ జీపీ కిశోర్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు ఆగ్రా, మధుర, అమృత్సర్, హరిద్వార్‌లోని ప్రముఖ ప్రాంతాలను చుట్టి వచ్చేలా రైలు ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ రైలు మార్చి 19న రాజమండ్రి నుంచి బయలుదేరి పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి 27వ తేదీన గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు సామర్లకోట, తుని, విశాఖపట్నంలో రైలు ఎక్కొచ్చన్నారు. 8 రాత్రులు, 9 పగళ్లు మొత్తం 8 రాత్రులు, 9 పగళ్ల ప్రయాణానికి భోజన వసతితో కలిపి స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీటైర్ ఏసీ ధర రూ.10,400గా నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రతి శుక్రవారం విజయ్ గోవిందం పేరుతో విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్యాకేజీ నడుస్తోందన్నారు. 2 రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ టికెట్ ధర రూ.3,410, రూ.3,690గా ఉందన్నారు. సికింద్రాబాద్ నుంచి తెనాలి, గుంటూరు మీదుగా ప్రతి మంగళవారం కేరళకు 5 రాత్రులు, 6 పగళ్ల ప్యాకేజీలో అలప్పి–కొచ్చి–మున్నార్‌కు రూ.10,610, అలప్పి–మున్నార్‌కు రూ.10,280, అలప్పి–గురువాయుర్–కొచ్చికు రూ.8,910, కూనూర్–ఊటీకి రూ.9,730 టికెట్ రేటు నిర్ణయించామన్నారు. ఎయిర్ టూర్ ప్యాకేజీలు ఐఆర్సీటీసీ ద్వారా ప్రాంతీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. మార్చి 1, 11, 21 తేదీల్లో, ఏప్రిల్ 15, 21 తేదీల్లో, మే 10, 17 తేదీల్లో కాశ్మీర్‌కు హౌస్‌బోటు అకామిడేషన్‌తో (శ్రీనగర్, సోమ్‌నగర్, గుల్మార్గ్, ఫహల్గామ్) రూ.27,750, ఏప్రిల్ 10న హిమాచల్–పాపులర్ పంజాబ్ (చంఢీగర్, సిమ్లా, ధర్మశాల, అమృత్సర్) పేరుతో రూ.33,100, మార్చి 3,5,10,12,17,19,24, ఏప్రిల్7,9,14,16,21,23,28 తేదీల్లో తిరుపతి బాలాజీ దర్శన్ (తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం) పేరుతో రూ.10,315 టిక్కెట్ ధరతో హైదరాబాద్ నుంచి విమాన సేవలందిస్తున్నామన్నారు. జూలై నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి లేక్, లద్దాక్, లేహ్, కాశ్మీర్, తిరుపతి, రాజస్థాన్, కేరళ వంటి ప్రాంతాలకు ఎయిర్ టూర్ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు 82879 3232, 97013 60675 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఐఆర్సీటీసీ భారత్ దర్శన్; గంగా రామాయణ్ యాత్ర
గంగా రామాయణ్ యాత్ర (SHA10A). ఇది ఐఆర్సీటీసీ భారత్ దర్శన్‌లో భాగంగా ఏప్రిల్‌లో నిర్వహిస్తున్న టూర్ ప్యాకేజ్. ఈ ఐదు రోజుల (నాలుగు రాత్రులు) పర్యటన... ఏప్రిల్ ఏడవ తేదీన మొదలై పదకొండవ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అయోధ్య, లక్నో, నైమిశారణ్యం, ప్రయాగరాజ్(అలహాబాద్), వారణాసిలను చూడవచ్చు. సింగిల్ ఆక్యుపెన్సీ 30,200 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 24,700 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23, 550 రూపాయలవుతుంది. ► ఏప్రిల్ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఇండిగో విమానం పది గంటల యాభై నిమిషాలకు వారణాసికి చేరుతుంది. వారణాసి ఎయిర్‌పోర్టులో రైల్వే టూర్ సిబ్బంది పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. చెక్ ఇన్ అయిన తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, గంగాతీరం సందర్శనం ఉంటాయి ► ఎనిమిదవ తేదీ తెల్లవారు జామున విశ్వనాథుని దర్శనం తర్వాత గదికి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి గదిని చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం ప్రయాగరాజ్ వైపు సాగుతుంది. త్రివేణి సంగమం, అలోపీ దేవి దర్శనం తర్వాత హోటల్‌కు చేరడం, ఆ రాత్రి బస ప్రయాగ్‌రాజ్‌లోనే ► తొమ్మిదవ తేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి శృంగవర్‌పూర్‌ను చూసుకుంటూ ప్రయాణం అయోధ్య వైపు సాగుతుంది. ఆ రోజు అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలను చూసి రాత్రి బస చేయాలి ► పదవతేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి నైమిశారణ్యం వైపు సాగిపోవాలి. స్థానిక ఆలయాలను చూసుకుంటూ సాయంత్రానికి లక్నో చేరుస్తారు. ఆ రాత్రి లక్నోలో బస ► పదకొండవ తేదీ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి బారా ఇమాంబారా సందర్శనం తర్వాత అంబేద్కర్ మెమోరియల్ పార్క్ చూపించి ఏడు గంటలకు ఎయిర్‌పోర్టులో దించుతారు. ఏడు గంటల పది నిమిషాలకు లక్నోలో బయలుదేరిన ఇండిగో విమానం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ చేరడంతో గంగా రామాయణ యాత్ర పూర్తవుతుంది. ప్యాకేజ్‌లో... విమానం టికెట్లు, హోటళ్లలో నాలుగు రాత్రుల బస, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. సైట్ సీయింగ్‌కి ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సర్వీస్ ఉంటాయి. -
‘భారత్ దర్శన్’ ప్యాకేజీ రైళ్లకు ఐసొలేషన్ కోచ్‌లు
సాక్షి, అమరావతి: దక్షిణ భారత యాత్ర పేరిట రైల్వే శాఖ ‘భారత్ దర్శన్’ రైళ్లను నడపనుంది. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈ రైళ్లను నడిపేందుకు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సన్నద్ధమవుతోంది. మొత్తం నాలుగు రైళ్లను విశాఖపట్నం, సికింద్రాబాద్, భువనేశ్వర్‌ల నుంచి ప్రారంభించనున్నారు. భారత్ దర్శన్ యాత్ర ఏడు నుంచి పది రోజుల వరకు ఉండటంతో కోవిడ్ లక్షణాలతో బాధపడే వారి కోసం ఐసొలేషన్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో క్వారంటైన్ సదుపాయాలను కల్పించారు. భారత్ దర్శన్ రైళ్లకు స్లీపర్‌తో పాటు ఏసీ త్రీ టైర్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. స్లీపర్ కోచ్‌లు ఐసొలేషన్ కోచ్‌లుగా మార్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఐఆర్సీటీసీ ఇప్పటికే రెండు రకాల ప్యాకేజీలను ప్రకటించింది. రూ.7,140 (స్లీపర్ కోచ్‌లు), రూ.8,610 (ఏసీ కోచ్‌లు) చార్జీలుగా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. 5 వేల కోవిడ్ కేర్ కోచ్‌లు తయారీ ► కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో భారత రైల్వే 5 వేల కోవిడ్ కేర్ కోచ్‌లు రూపొందించింది. ► భారత్ దర్శన్ మొదటి రైలు డిసెంబర్ 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లకు చేరుతుంది. ► రెండో రైలు జనవరి 2న భువనేశ్వర్ నుంచి మొదలై బరంపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ స్టేషన్లకు చేరుతుంది. దక్షిణ భారత దేవాలయాల టూర్‌గా ఈ రైలును నడపుతారు. ► ఈ రైళ్లలో దక్షిణ భారత యాత్ర చేయాలనుకుంటే 48–72 గంటల ముందు పరీక్ష చేయించుకుని పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. -
చలో ‘భారత్ దర్శన్’.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: నగర పర్యాటకుల కోసం త్వరలో ‘భారత్ దర్శన్’ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది. ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పర్యటనలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్సీటీసీ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టామని, దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని చెప్పారు. ఏటా 50,000 మందిపైనే.. నగరం నుంచి ఏటా 50 వేల మందికి పైగా పర్యాటకులు ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు రైళ్లలో తరలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలిసి ఎక్కువ లగేజీతో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్ టూరిస్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవి కావడమే కాక కొన్నిసార్లు మోసాలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నగర పర్యాటకుల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. శ్రీరంగం టు కాంచీపురం సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మొదట శ్రీరంగం చేరుతుంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ సందర్శన.. తంజావూర్ బృహదీశ్వరాలయ పర్యటన అక్కడి నుంచి 2,500 ఏళ్ల నాటి పురాతన పట్టణమైన మధుర మీనాక్షి ఆలయ సందర్శన.. ఇంకా, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ దేవాలయం, వివేకానందరాక్ మెమోరియల్ ఆలయ సందర్శనాల అనంతరం మహాబలిపురం చేరుతుంది. అనంతరం కాంచీపురం చేరుకొని అక్కడి నుంచి తిరుగు పయనమై.. జనవరి 10వ తేదీ మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుతుంది. ‘భారత్ దర్శన్’ జర్నీ ఇలా.. జనవరి 3, తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది. 10న మధ్యాహ్నం తిరిగి సికింద్రాబాద్ చేరుతుంది. ప్రయాణం మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు సాగుతుంది. ఈ రైలుకు ఉండే 16 బోగీల్లో 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ త్రీటైర్, ఒక ప్యాంట్రీ కార్ ఉంటాయి. మిగతా రెండూ గార్డ్ బోగీలు. స్లీపర్ క్లాస్ జర్నీకి రోజుకు రూ.945, థర్డ్ ఏసీకి రూ.1,150 చొప్పున చార్జీ (రైలు ప్రయాణంతో పాటు, అల్పాహారం, టీ, కాఫీ, భోజనం, రోడ్డు రవాణా తదితర వసతులన్నీ కలిపి) వసూలు చేస్తారు. మొత్తంగా 8 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం స్లీపర్ క్లాస్‌కు రూ.7,560, థర్డ్ ఏసీకి రూ.9,240 చొప్పున ప్యాకేజీ నిర్ణయించారు. ఫోన్ కొడితే సమాచారం.. ‘భారత్ దర్శన్’ సమాచారం కోసం సికింద్రాబాద్ ఐఆర్సీటీసీ జోనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు: 82879 32227, 82879 32228.