రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలోని హుడా ఎన్‌క్లేవ్‌లో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని కె.దేవి(21) మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగేకంటే ముందు కారు నడుపుతున్న భరతసింహారెడ్డి, పక్కనే కూర్చున్న దేవి పెద్ద పెద్ద అరుపులతో కొద్దిసేపు గొడవ పడ్డారని స్థానికంగా ఓ సెక్యూరిటీగార్డు పోలీసులకు సమాచారం అందించాడు. అంతే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు మృతురాలు దేవి కూర్చున్న ప్రాంతంలో చెట్టుకు ఢీకొంది. అయితే అక్కడ మాత్రం బెలూన్లు తెరుచుకోలేదు. డ్రై వింగ్ చేస్తున్న భరతసింహారెడ్డి వద్ద మాత్రం బెలూన్లు ఓపెన్ అయ్యాయి. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు.
పోస్టుమార్టం నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎంత వేగంతో కారు వెళ్తున్నదో కనుగొనే యత్నంలో పోలీసులు పురోగతి సాధించారు. ఆ సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంగా కారు దూసుకెళ్తున్నట్లు తేలింది. అంత వేగంతో చెట్టును ఢీకొంటే తప్పనిసరిగా రెండు వైపులా బెలూన్లు ఓపెన్ కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయని పోలీసులు కూడా అంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రమాదానికి కారకుడైన భరతసింహారెడ్డి ఆరు నెలల క్రితం హీరో బాలకష్ణ నివాసం సమీపంలోఉన్న సబ్ వే వద్ద తన స్నేహితులతో బీరుబాటిళ్లతో గొడవపడ్డాడు. ఆ గొడవలో ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ కేసులోనూ భరతసింహారెడ్డిని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు. ఇటీవల పలు పబ్‌లలో గొడవలు జరుగుతున్ననేపథ్యంలో ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దృష్టిసారించారు.