Bharatiya Janatha Party
-
సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ వేసే ప్రతీ అడుగు, నిర్వహించే కార్యక్రమాలన్నీ బీజేపీ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధినాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పకడ్బందీ ప్రణాళికను అమలుచేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యక్ష పర్యవేక్షణల్లోనే కార్యాచరణ రూపొందుతోంది. తెలంగాణలో ఏడాదిగా విభిన్న అంశాలపై నేరుగా అమిత్ షా, నడ్డాలకు రిపోర్ట్ చేసేలా వివిధ సంస్థలు, బృందాలు పనిచేస్తున్నాయి. గతేడాది ఆగస్టులో బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు నుంచే కొన్ని బృందాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై పరిశీలనను మొదలుపెట్టాయి. బూత్ కమిటీలపై అమిత్‌షా సమీక్ష రాష్ట్రంలో మూడు, నాలుగు నెలలుగా క్షేత్రస్థాయి నుంచి సమాచార సేకరణ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. దీనికోసం పదుల సంఖ్యలో అధ్యయన, సమాచార సేకరణ బృందాలు నిమగ్నమయ్యాయి. సర్వేలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, పార్టీల బలాబలాలు తదితరాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడంతోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 25లోగా పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, ఆ కమిటీ కన్వీనర్లు, సభ్యుల నియామకం పూర్తిచేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. 17న జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కిందిస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, బూత్ కమిటీల నియామకం, టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకత వంటి విషయాలపై ఆరా తీయనున్నట్టు సమాచారం. కేసీఆర్ పాలన తీరు, టీఆర్ఎస్ ముఖ్యనేతలపై అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలపై కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల నుంచి సమాచార సేకరణకు అమిత్ షా ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలు, వాటి బలాబలాలు తదితర అంశాలపై ఇప్పటికే నాయకత్వానికి అధ్యయన బృందాలు నివేదికలు అందజేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పది ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో బలమైన అభ్యర్థులు లేని అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
‘అతి’ విశ్వాసమే.. ముంచిందా?
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థుల ఓటమికి కారణాలను బీజేపీ విశ్లేషించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో వచ్చిన ఊపును (సాను కూల వాతావరణాన్ని) చేజేతులా జారవిడుచుకు న్నామన్న అభిప్రాయం ఈ సమీక్షల్లో వ్యక్తమ వుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన స్థానంలోనూ ఎందుకు ఓడిపోయామని పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎలాగూ గెలుస్తామన్న అతివిశ్వాసమే తమను దెబ్బకొట్టిందని, అదే టీఆర్ఎస్ విజయానికి కారణమైందన్న విశ్లేషణలు పార్టీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంచెం కష్టపడితే సిట్టింగ్ దక్కేది హైదరాబాద్ స్థానంలో తాము ఇంకొంచెం కష్ట పడితే బయటపడేవారమనే అభిప్రాయం పార్టీలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ టీఆర్ఎస్ చేసే విమర్శలను తిప్పికొట్టడం పైనే ప్రధానంగా దృష్టి సారించిన పార్టీ నేతలు... కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను, గెలిపిస్తే తామేం చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చర్చ బహిరంగం గానే జరుగుతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టి సారించినంతగా, హైదరాబాద్ ఓటర్లపై దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగిం చుకునే విషయంలో కొంత వెనుకబడ్డామన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక నల్లగొండ– ఖమ్మం–వరంగల్ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయికి వెళ్లడంలో వెనుకబడటం వల్లే నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకొంచెం కష్టపడితే తమకు సిట్టింగ్ స్థానం దక్కేదన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి, తమకు మధ్య తొలి ప్రాధాన్యత ఓట్లలో 8 శాతమే తేడా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. ఈ స్వల్ప వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా క్షేత్రస్థాయి కేడర్‌ను కదిలించడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ స్థానంలోని వేయి బూత్‌లలో ఒక్కో బూత్ నుంచి అదనంగా 10 చొప్పున ఓట్లను పొందేందుకు ఇంకొంచెం కష్టపడితే గెలుపు దక్కేదని విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించినా ప్రయోజనం చేకూరలేదని, వారు నిరంతరం ఓటర్లతో టచ్‌లో ఉండటంలో విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణగల పార్టీగా పేరున్న బీజేపీలో ఇన్చార్జుల స్థాయిలో విఫలమైతే భవిష్యత్తులో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పునాదే లేకుండా పోతుందనే ఆందోళన బీజేపీ కీలకనేతల భేటీలో వ్యక్తమైనట్లు సమా చారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. -
అనితది సూసైడ్ కాదు.. హత్య!
సాక్షి, చెన్నై: నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది. అధికార పక్షాలే లక్ష్యంగా విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. శనివారం సాయంత్రం అరియాళూరు వెళ్లిన ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్, అనిత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పళని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు. దళిత విద్యార్థిని అనిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చింది తప్పుడు హామీనేనని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వాలు చేసిన హత్యేనని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళని స్వామి, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా ఆయన బీజేపీపై కూడా విమర్శలు చేశారు. అనిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించటమే కాదు.. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్టాలిన్ ప్రకటించారు. ఇక తమ పార్టీపై చేసిన విమర్శలను బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఖండించారు. విద్యార్థి మరణాన్ని రాజకీయం చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. వెల్లూరులో కొన్నాళ్ల క్రితం నీట్ విద్యార్థి తల్లి చనిపోయిన సమయంలో మీరంతా ఎక్కడి వెళ్లారంటూ స్టాలిన్‌కు రాజా చురకలంటించారు. నీట్ అర్హత సాధించలేకపోవటంతో మెరిట్ విద్యార్థిని అనిత సూసైడ్ చేసుకున్న తెలిసిందే.