విభజన సరికాదు
రాష్ట్రాల విభజనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజేజు
సాక్షి, బెంగళూరు : ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలుగా తమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ వందలాది మంది రోజూ తనకు వినతి పత్రాలు అందజేస్తుంటారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజేజు తెలిపారు. ఈ ఆలోచనా విధానం ఏమాత్రం సరికాదని, ‘ఈశాన్య’ రాష్ట్రాలు భారత్‌లో ఒక ప్రముఖ భాగమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
బీజేపీ నార్త్-ఈస్ట్ సంపర్క్ సెల్ ఆధ్వర్యంలో శనివారమిక్కడి భారతీయ విద్యాభవన్‌లో ‘నార్త్-ఈస్ట్’ కాన్క్లేవ్ పేరిట నగరంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కిరణ్ రిజేజు మాట్లాడారు. భారతదేశం చాలా పెద్ద దేశమని, అందువల్ల దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలకు ఈశాన్య రాష్ట్రాల గురించి సరైన అవగాహన లేదని అన్నారు. అంతమాత్రాన ఈశాన్య రాష్ట్ర ప్రజలను ఇతర రాష్ట్రాల వారు గుర్తించలేదని అనుకోవడం సరికాదని హితవు పలికారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనన్ని సంఘాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి.
ఎప్పుడూ ఏదో ఒక డిమాండ్లతో బంద్‌లు నిర్వహిస్తూ మన అభివృద్ధిని మనమే అడ్డుకుంటున్నాం’ అని ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతో జరిగే గొడవలకు కుల,మత, ప్రాంతీయ వాదాలను జోడించడం, తద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గాను ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక వాసులు శాంతిప్రియులు....
ఈ సందర్భంగా కర్ణాటక వాసులు ముఖ్యంగా బెంగళూరు ప్రజలు శాంతి ప్రియులని కిరణ్ రిజేజు పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ‘అతిథి దేవోభవ’ అనే వేద వాక్యాన్ని అనుసరిస్తారని శ్లాఘించారు. ఇక ఈ నగరంలో కూడా ఈశాన్య రాష్ట్ర ప్రజలపై దాడులకు సంబంధించి ఒకటి, రెండు ఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే అదంతా పూర్తిగా వ్యక్తిగతమేకానీ ప్రాంతీయతకు సంబంధించి కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.
అనంతరం కేంద్ర మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ వచ్చిందని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను తమ సోదరులుగా భావిస్తోందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఈశాన్య రాష్ట్ర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు గాను తనతో పాటు కన్నడిగులైన ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, పార్లమెంటు సభ్యుడు పి.సి.మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ పాల్గొన్నారు.