Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నీల వెళిచ్చమ్’(Neelavelicham) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా ప్రేమ కథలు చూస్తాం లేదంటే హారర్ కథలు చూస్తాం. కానీ ‘భార్గవి నిలయం’ (1964) హారర్ ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. ఎ. విన్సెంట్ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ మలయాళ సినిమాని రీమేక్ చేసి ‘నీల వెళిచ్చమ్’గా మన ముందు నిలిపారు దర్శకుడు ఆషిక్ అబు. ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ కథా రచయిత మారుమూల గ్రామంలోని ఓ భవంతిలోకి రావడంతో సినిమా మొదలవుతుంది. అదే భార్గవి నిలయం. ఆ ఊళ్లోని వారందరూ ఆ భవంతిలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి ఆత్మ ఆ భవంతిలో తిరుగుతుందని భయపడుతూ ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఈ రచయిత ధైర్యంగా ఆ భవంతిలోకి అడుగుపెట్టి ఆ దెయ్యం కథ రాయాలనుకుంటాడు. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)భార్గవి నిలయంలో అడుగుపెట్టిన రచయితకు దెయ్యం కనబడిందా? కనబడిన దెయ్యం తన కథ చెప్పిందా? అలాగే ఆ ఆత్మ తన కథలోని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వింటేజ్ కథ. సినిమా స్క్రీన్ప్లే కొంత ల్యాగ్లో నడిచినా చూసే ప్రేక్షకుడిని మాత్రం రీ రికార్డింగ్, అద్భుతమైన సంగీతంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. కొంత ‘చంద్రముఖి’ సినిమా ఛాయలు కనబడినా చివరకు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. టొవినో థామస్ హీరోగా నటించారు. ఈ చిత్ర కథానాయకుడు సినిమాలో భార్గవి బంగారం అని దెయ్యాన్ని ప్రేమగా పిలుస్తున్నప్పుడల్లా ప్రేక్షకుడికి ప్రేమానుభూతి కలుగుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ‘భార్గవి నిలయం’గా అనువాదం అయి, ‘ఆహా ఓటీటీ’లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.– ఇంటూరు హరికృష్ణ