Bharthiya janatha party
-
పగ్గాలెవరికో?
నిన్నటివరకు నిస్తేజంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీ కేంద్రంలో అధికారపగ్గాలు చేపట్టడం, రాష్ట్రంలోనూ అధికారం పంచుకున్న నేపధ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే త్వరలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమలం పీఠానికి పోటీ నెలకొంది. అధిష్ఠానం ఆశీస్సులు తమకే ఉన్నాయని పలువురు నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. కడప రూరల్: భారతీయ జనతా పార్టీ జిల్లాలో మొన్నటి వరకు నిస్తేజంగా ఉండేది. బలమైన, ప్రజాధరణ కలిగిన నాయకులను, కార్యకర్తలను ఆకర్షించలేక ఓటింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయేది. ఇలాంటి తరుణంలో నరేంద్రమోదీ హవాతో కేంద్రంలో పగ్గాలను చేపట్టడంతో జిల్లాలో కూడా ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ తరుణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శశిభూషణ్‌రెడ్డి పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష స్థానానికి నేనున్నానంటూ పలువురు పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో అంతర్గత చర్చ మొదలైంది. తాము మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, సీనియర్లం తామేనని ఒకరు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది తామేనని మరొకరు, గతంలో జిల్లా అధ్యక్ష పీఠానికి తనకు రెండుసార్లు అవకాశం వచ్చినా వద్దని చెప్పాను... ఇప్పుడు రెడీగా ఉన్నానని మరొకరు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. అధ్యక్ష స్థానానికి పలువురు పోటీ బీజేపీలో ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. అనంతరం మండలాలకు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తర్వాత జిల్లా అధ్యక్షుని ఎన్నిక, అనుబంధ శాఖల నియామకం జరగాలి. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వారిలో రాజంపేట ప్రాంతానికి చెందిన బీసీ వర్గం నేత ఒకరు, ప్రొద్దుటూరులో ఒకరు, మైదుకూరులో ఒకరు, కడపలో ఓసీ వర్గానికి చెందిన ఇద్దరు, ఓ విద్యాసంస్థ అధినేత తనయుడు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇతనికి పార్టీ సభ్యత్వమే లేదని, అతనికి అంతటి కీలకపదవి ఎలా ఇస్తారనే వాదన ఉంది. కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా... ఇన్నాళ్లు బీజేపీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కేంద్రంలో ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో పలువురు పార్టీలో చేరారు. కొత్తవారి రాకతో సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. ఎన్నో సవత్సరాలుగా కమలం జెండాను మోసిన కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోని అధిష్ఠానం కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తుండడంపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీలో కొత్తగా చేరిన వారు కూడా జిల్లా అధ్యక్ష పీఠాన్నిదక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండడంపై విమర్శలు ఉన్నాయి. కీలకంగా కేంద్ర నాయకుడు నిన్నటివరకు ఆ పార్టీ జాతీయ నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి సమ్మతితోనే జిల్లాలో అధ్యక్షుని నియమాకం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం తెరపైకి ఆ పార్టీ జాతీయ నాయకుడు ఒకరు, మరో ప్రముఖ నాయకుడు వచ్చినా ప్రస్తుత కేంద్రమంత్రి సూచనల మేరకే జిల్లా అధ్యక్ష నియామకం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర కోర్ కమిటీలో నిర్ణయం ఉంటుందని, దానికి జిల్లా నుంచి 11 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కోర్ కమిటీలో నిర్ణయం ఎలాగున్నా అధిష్ఠానం సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడి నియామకం ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. -
‘కండువాలు’... కలవవట!
రాష్ట్రస్థాయిలో ఒక్కటై నడవాలని బాసలు చేసుకున్న తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు జిల్లా స్థాయిలో ‘పొత్తు’ కుదరడం లేదు. ఆశావహులు అలకపాన్పు దిగక పోవడంతో ప్రచార పర్వంలో ఇంకా ఇరుపక్షాలు కలిసి పనిచేయడం లేదు. నేతల స్థాయిలో అంటీముట్టనట్టుగా ఉన్నా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మూతిబిగింపు సడలించడం లేదు. వీరిని సమన్వయ పరిచే ‘పెద్ద’ దిక్కూ లేకపోవడమూ ఓ ఇరకాటంగా మారింది.దీనితో అభ్యర్థులది ఒంటరి ప్రయాణమే అవుతోంది. సాక్షి, మహబూబ్‌నగర్: బలవంతపు బం ధంతో ఒక్కటైన తెలుగుదేశం, బీజేపీ పొ త్తుల పీటముడిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. సీట్ల పంపకాలు, టికెట్ల పంపిణీలో తేడాలు రావడంతో రెండు పార్టీల నేతలు అసమ్మతి కుంపటిని మరింత రాజేస్తున్నారు. దీంతో ప్రచార పర్వం మొదలై రోజులు గడుస్తున్నా ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిత్రపక్షాలను రెంటినీ సమన్వయం చేసే నాథుడు లేకపోవడంతో బీజేపీ, టీడీ పీ ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో టికెట్ దక్కిన చోట అధికారిక అభ్యర్థులు మిత్ర పక్షాన్ని బుజ్జగించే పనికి స్వస్తి చెప్పి సొంత ప్రచార ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు గాను మహబూబ్‌నగర్‌ను బీజేపీకి, నాగర్‌కర్నూలును టీడీపీకి కేటాయించారు. 14 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, బీజేపీ ఆరు చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే సొంత పార్టీ అభ్యర్థులకు టికెట్ దక్కని చోట నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల ముఖ్య నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పొత్తుల కోసం ఒత్తిళ్లు చేసిన నేతలు ప్రస్తుతం పరిస్థితిని చక్క దిద్దే అంశంపై దృష్టి సారించడం లేదు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం వైఖరిని నిరసిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరుకున్నారు. పొత్తుల మూలంగా తిరిగి టీడీపీ కండువాను మెడలో వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొడంగల్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో వున్నా బీజేపీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. నారాయణపేటలో టికెట్ దక్కక పోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో వున్నారు. బీజేపీ ముఖ్య నేతలు నాగూరావు నామాజి, కొండయ్య తదితరులను బుజ్జగించినా టీడీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో కనిపించడం లేదు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడటంతో టీడీపీ బలం నామమాత్రంగా వుంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి సయోధ్య కోసం ప్రయత్నించినా టీడీపీ కేడర్ కలిసి రావడం లేదు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిం హులు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ప్రచా రం ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, కొల్లాపూర్ అసెం బ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. కొల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పగిడాల శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. వనపర్తి, ఆలంపూర్, గద్వాల, అచ్చం పేటలో బీజేపీ బలం నామమాత్రంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ, బీజేపీ స్థానికంగా అవగాహనకు వచ్చి పోటీ చేశాయి. కొన్ని చోట్ల రెండు పార్టీల అభ్యర్థులు ముఖాముఖి తలపడ్డారు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లో వుంటూ ఎన్నికల బరిలో నిలిచిన కేడర్ ఇప్పుడు పొత్తుల పేరిట కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నెల 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జిల్లా పర్యటనకు వస్తుండటంతో ఏవైనా అద్భుతాలు జరుగుతాయని రెండు పార్టీల అభ్యర్థులు ఆశిస్తున్నారు. -
సిమాంధ్రకు ప్రత్యేక హోదాలో బీజేపీ పాత్రలేదు
కేంద్రమంత్రి జైరాంరమేష్ వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అడగలేదు సోనియా చెబితేనే ప్రధాని ప్రకటించారు పదేళ్ల పాటు అన్ని పన్నులు మినహాయింపు సాక్షి, తిరుపతి: ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడం వెనుక భారతీయ జనతాపార్టీ పాత్ర ఏమీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాంరమేష్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఈ ప్యాకేజీల గురించి ప్రధానిని అడగలేదన్నారు. తిరుపతిలో రూ.77 కోట్లతో నిర్మించిన 300 పడకల కాన్పుల ఆస్పత్రిని బుధవారం జైరాం రమేష్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోనియాను ఫిబ్రవరి 17న కలిసి అభ్యర్థిస్తే మరుసటి రోజు సోనియాల సూచన మేరకు ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాత్రికి రాత్రి రాలేదని, అనేక సుదీర్ఘ సంప్రదింపులు, సమాలోచనలు, రాజకీయ పార్టీల డిమాండ్ల తరువాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు. 1973లో ఇందిరాగాంధీ చేసిన ఆరు సూత్రాల ప్రాతిపదికనే ప్రధాని పార్లమెంట్లో సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. స్వయం ప్రతిపత్తి కింద సీమాంధ్రకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. తిరుపతిని రాజధానిగా చేయాలనే డిమాండ్‌ను కూడా తాను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలలలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మొత్తం 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తాను కీలకంగా వ్యవహరించలేదని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక భాగంగా తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాన ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల సీమాంధ్రా యువత ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హైదరాబాద్‌లో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో పదేళ్ల వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ కోటాలే వర్తిస్తాయని, దీనిని బిల్‌లోనే పొందుపరిచినందున ఎవరూ మార్చలేరన్నారు. అలాగే సీమాంధ్రలో పదేళ్లపాటు అన్ని రకాల కేంద్ర పన్నులను మినహాయిస్తామన్నారు. -
కమలం ఎన్నికల కసరత్తు
సాక్షి, కరీంనగర్ :ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. బూత్‌స్థాయి నుంచి పటిష్టమైన నిర్మాణం అవసరమని, అందుకు కార్యాచరణ ప్రారంభించాలని నరేంద్రమోడీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నవభారత యువభేరి సభలోనే పార్టీ శ్రేణులు దిశానిర్ధే శం చేశారు. కానీ, వివిధ కారణాలతో జిల్లాలో సంస్థాగత కమిటీల ఏర్పాటు మీద పార్టీ నాయకులు శ్రద్ధ చూపలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున వచ్చే రెండునెలల పాటు పూర్తిగా పార్టీ నిర్మాణంపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రాజు జిల్లా కమిటీ నేతలతో ఆదివారం భేటీ అయ్యారు. చేపట్టాల్సిన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. మిగతా జిల్లాల్లో బూత్ కమిటీల ఏర్పాటు చురుగ్గా సాగుతోందని, జిల్లాలో మాత్రం 20 శాతం కమిటీలు కూడా ఏర్పాటు కాలేదని, ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రవీందర్‌రాజు జిల్లా నేతలకు సూచించారు. ఈ నెల 15లోగా కమిటీలు వేయాలని, 15 నుంచి 20 వరకు కమిటీలు బూత్‌దర్శన్ పేరిట క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. శాసనసభా నియోజకవర్గాల వారీగా పార్టీని పటిష్టపరచాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, నాయకులు దేవిశెట్టి శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, జగన్మోహనరావు, అంజయ్య పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ పోరు జాతర
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోం ది. ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ క్రెడిట్ అంశాల ప్రాతిపదికన జిల్లాలో తమ ప్రాభవాన్ని చాటేం దుకు సన్నద్ధమవుతోంది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లుపెట్టాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ పోరు జాతర’ నిర్వహించేందుకు సర్వం సిద ్ధమైంది. పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతిస్తుందనే స్పష్టమైన వైఖరితోనే యూపీఏ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంద నే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయం నరేంద్రమోడీయేననే ప్రచారాన్ని విస్తృతం చేసింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు ఆమోదమయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనుంది. ఏర్పాట్లు పూర్తి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోరుజాతర సభను విజయవంతం చేసేందు కు జిల్లా శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సర్కస్‌గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జంగారెడ్డితోపాటు పలువురు హాజరు కానున్నారు. 20 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లుచేశారు. సభ విజయవంతానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావుతోపాటు ఇతర నాయకులు కృషి చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎడవెల్లి జగ్గారెడ్డి కుమారుడు డాక్టర్ విజయేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కమలదళంలో చేరేందుకు నిర్ణయించుకున్నా రు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ వైద్యవిధాన పరిషత్ గవర్నింగ్ బాడీ సభ్యులుగా పనిచేశారు. ఆయనతోపాటు టీడీపీ, టీఆర్ఎస్ నుంచి పలువురు నాయకు లు బీజేపీలో చేరనున్నారు. సభ ఏర్పాట్లను గుజ్జుల, అర్జున్‌రావు, విజయేందర్‌రెడ్డి పరిశీ లించారు. ఫ్లెక్సీలతో నగరం కాషాయమయం గా మారింది. అసమ్మతి సెగ బీజేపీలో రోజురోజుకూ వర్గపోరు ఎక్కువవుతుండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాలపై ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పునర్నిర్మాణం కోసం యత్నిస్తుంటే.. జిల్లాలో మా త్రం పరిస్థితి దిగజారుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సభకు జిల్లాకు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావుతోపాటు పలువురు హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు సభ ఏర్పాట్లు, జనసమీకరణకు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సభ అనంతరం జిల్లా పార్టీ శ్రేణులకు వ ర్గాల పోరుపై కిషన్‌రెడ్డి హితబోధ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.