
సిమాంధ్రకు ప్రత్యేక హోదాలో బీజేపీ పాత్రలేదు
కేంద్రమంత్రి జైరాంరమేష్
వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అడగలేదు
సోనియా చెబితేనే ప్రధాని ప్రకటించారు
పదేళ్ల పాటు అన్ని పన్నులు మినహాయింపు
సాక్షి, తిరుపతి: ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడం వెనుక భారతీయ జనతాపార్టీ పాత్ర ఏమీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాంరమేష్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఈ ప్యాకేజీల గురించి ప్రధానిని అడగలేదన్నారు. తిరుపతిలో రూ.77 కోట్లతో నిర్మించిన 300 పడకల కాన్పుల ఆస్పత్రిని బుధవారం జైరాం రమేష్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోనియాను ఫిబ్రవరి 17న కలిసి అభ్యర్థిస్తే మరుసటి రోజు సోనియాల సూచన మేరకు ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు రాత్రికి రాత్రి రాలేదని, అనేక సుదీర్ఘ సంప్రదింపులు, సమాలోచనలు, రాజకీయ పార్టీల డిమాండ్ల తరువాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు. 1973లో ఇందిరాగాంధీ చేసిన ఆరు సూత్రాల ప్రాతిపదికనే ప్రధాని పార్లమెంట్‌లో సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. స్వయం ప్రతిపత్తి కింద సీమాంధ్రకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. తిరుపతిని రాజధానిగా చేయాలనే డిమాండ్‌ను కూడా తాను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలలలోపు పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మొత్తం 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో తాను కీలకంగా వ్యవహరించలేదని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఒక భాగంగా తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాన ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించడం వల్ల సీమాంధ్రా యువత ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హైదరాబాద్‌లో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో పదేళ్ల వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ కోటాలే వర్తిస్తాయని, దీనిని బిల్‌లోనే పొందుపరిచినందున ఎవరూ మార్చలేరన్నారు. అలాగే సీమాంధ్రలో పదేళ్లపాటు అన్ని రకాల కేంద్ర పన్నులను మినహాయిస్తామన్నారు.