సాక్షి, కరీంనగర్ :ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. బూత్‌స్థాయి నుంచి పటిష్టమైన నిర్మాణం అవసరమని, అందుకు కార్యాచరణ ప్రారంభించాలని నరేంద్రమోడీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నవభారత యువభేరి సభలోనే పార్టీ శ్రేణులు దిశానిర్ధే శం చేశారు.
కానీ, వివిధ కారణాలతో జిల్లాలో సంస్థాగత కమిటీల ఏర్పాటు మీద పార్టీ నాయకులు శ్రద్ధ చూపలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున వచ్చే రెండునెలల పాటు పూర్తిగా పార్టీ నిర్మాణంపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రాజు జిల్లా కమిటీ నేతలతో ఆదివారం భేటీ అయ్యారు. చేపట్టాల్సిన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. మిగతా జిల్లాల్లో బూత్ కమిటీల ఏర్పాటు చురుగ్గా సాగుతోందని, జిల్లాలో మాత్రం 20 శాతం కమిటీలు కూడా ఏర్పాటు కాలేదని, ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రవీందర్‌రాజు జిల్లా నేతలకు సూచించారు. ఈ నెల 15లోగా కమిటీలు వేయాలని, 15 నుంచి 20 వరకు కమిటీలు బూత్‌దర్శన్ పేరిట క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. శాసనసభా నియోజకవర్గాల వారీగా పార్టీని పటిష్టపరచాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, నాయకులు దేవిశెట్టి శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, జగన్‌మోహనరావు, అంజయ్య పాల్గొన్నారు.
కమలం ఎన్నికల కసరత్తు
Published Mon, Jan 6 2014 4:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement