తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు
* జాబితాలో హైదరాబాద్ , వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం
* ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాలను శరవేగంతో అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం రూపొందించే స్మార్ట్‌సిటీల జాబితాలోకి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలను చేర్చేలా ప్రతిపాదనలు పంపించనున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్ (ఖమ్మం), జలగం వెంకట్‌రావు(కొత్తగూడెం) మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసారు.
ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీంతో రాష్ట్రంలో 5 నగరాలు కీలకం కాబోతున్నాయని, ఆయా నగరాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారిం చినట్లు కేసీఆర్ చెప్పారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిగితేనే స్మార్ట్‌సిటీ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం నివాసాల ముందే చిన్న వర్షం పడినా నీళ్లు నిలిచిపోతాయన్నారు. నాలాలు కబ్జాకు గురయ్యాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే రూ. 10 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు.
ఖమ్మంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ లేదని, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో కూడా అస్తవ్యస్తంగా ఉందని సీఎం పేర్కొన్నారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తానే ఈ నగరాలను సందర్శించి, సమస్యలు పరి ష్కారమయ్యేలా చూస్తానన్నారు. ఖమ్మం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రఘునాథపాలెం, కొణిజెర్ల, వైరా, చింతకాని తదితర మండలాలకు నగరం విస్తరించిన విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండలోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాల్సి ఉందన్నారు. రామగుండం తరహాలో కొత్తగూడెం కూడా అభివృద్ధి చెందుతుందని, అక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ వస్తుందని, 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
కొత్తగూడెంలో టౌన్‌షిప్ అభివృద్ధి కానున్నందున నగరాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దాలన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా అన్ని నగరాలకు మంచి నీటిని అందివ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నగరాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల చొప్పున నీటిని అందించడం, రహదార్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం తదితర అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిని కలవడం వెనుక రాజకీయ ఉద్దేశాల్లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరడానికే కలిసినట్లు చెప్పారు.