భాష్యం విద్యార్థులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందన
సాక్షి, అమరావతి: ఇటీవల విడుదలైన ఐఐటీ, జేఈఈ మెయిన్, తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన భాష్యం విద్యార్థులను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం అభినందించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆతుకూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయనను భాష్యం విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు గాను 345 మార్కులు సాధించి ఆలిండియా 2వ మార్కు, ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకును కైవసం చేసుకున్న డి.భరత్‌ను వెంకయ్య ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన భరత్‌ను, బైపీసీ విభాగంలో 21వ ర్యాంకు సాధించిన హర్షవర్ధన్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి దేశ ప్రతిష్టను నలుదిశలా ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అభినందన కార్యక్రమంలో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ ప్రిన్సిపాల్ విద్యాసాగర్, డీన్ సత్యప్రసాద్, ఐఐటీ ప్రోగ్రామర్లు ఆనంద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.