తిరుమలలో ముగిసిన వరుణయాగం
తిరుమల: ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకుని సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల పార్వేట మంటపంలో ఆరు రోజులుగా టీటీడీ నిర్వహించిన వరుణయాగం (కారీరేష్ఠి యాగం) బుధవారంతో ముగిసింది. టీటీడీ ఆగమ సలహాదారు సుందరవరద భట్టాచార్యులు, యాగపర్యవేక్షకుడైన సుందర రామశ్రౌతి నేతృత్వంలో సుమారు వంద మంది రుత్వికులు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగక్రతువు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు చతుర్వేదాలను పండితులు పారాయణం చేశారు. ఆరో రోజు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శాస్త్రోక్తంగా యాగక్రతువు నిర్వహిస్తూ చివర్లో పూర్ణాహుతితో యాగాన్ని ముగించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో అవబృదేష్టి కార్యక్రమాన్ని వైదికంగా పూర్తి చేశారు.
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 39,535 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లు నిండాయి. వీరికి 16 గంటలు తర్వాత శ్రీవారి దర్శనం లభించింది.