భారత జట్టులో చోటు దక్కించుకోవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : భారత జట్టులో లక్ష్యంగా దూసుకెళ్లాలని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఆర్డీటీ అకాడమీకి చెందిన భవానీ జాతీయ హాకీ అకాడమీకి ఎంపికైన సందర్భంగా అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారుల కృషి, పట్టుదలే ప్రధానమన్నారు. హాకీ క్రీడ కోసం విశాఖపట్టణం నుంచి అనంతపురం ఆర్డీటీ అకాడమీలో శిక్షణ తీసుకుని జాతీయస్థాయి క్యాంప్‌కు ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. భవానీ అనంతపురం ఆర్డీటీ అకాడమీలో 2013లో చేరిందని, ఆనాటి నుంచి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి జూనియర్, సీనియర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ హాకీ కోఆర్డినేటర్ విజయ్‌బాబు, కోచ్ అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ఘనీ, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.