ఎవరో వెంటాడుతున్నారా?
స్వప్నలిపి
ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా వచ్చే కల....మనల్ని ఎవరో వెంటాడడం. ‘‘నాకెవరూ శత్రువులు లేరు...ఎందుకిలాంటి కల వచ్చింది?’’ అని కొందరు, ‘‘గత జన్మలో నా శత్రువులెవరైనా ఇలా వెంటాడుతున్నారా?’’ అని మరికొందరు ఆలోచిస్తుంటారు. నిజానికి ఆ శత్రువులు మనలోనే ఉన్నారు. ‘‘ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. అయ్యో! అసలేమీ ప్రిపేర్ కాలేదు’’ ఒక స్టూడెంట్ భయం ఇది.
ఆ భయానికి పెద్ద మీసాలు వస్తాయి. కండలు వస్తాయి. ఆ భయం ఒక రౌడీలా తయారై కలలోకి వస్తుంది. ‘‘అప్పు అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలా తీర్చాలిరా దేవుడా’’ ఇది ఒక మిడిల్ క్లాస్ సుబ్బారావు ముందస్తు ఆందోళన. ఆ ఆందోళన అనకొండగా మారి మన అంతఃచేతనలోకి వెళ్లిపడుకుంటుంది. సమయం చూసి వెంటాడుతుంది. మనల్ని నిద్రలో పరుగెత్తించే శక్తులు రకరకాలుగా ఉంటాయి.
మనం భయపడే విషయాలు, ఒప్పుకోవడానికి మనస్కరించని వాస్తవాలు, రాజీపడేలా నడిపించే పద్ధతులు, నచ్చని వాటిని నచ్చినట్లు తలకెత్తుకునే బరువులు...ఇవన్నీ రకరకాల రూపాలు ధరించి కలలో మనల్ని వెంటాడుతుంటాయి. అంతేతప్ప పూర్వజన్మకు ఈ కలకు ఎలాంటి సంబంధం లేదు.