bheemunipatnam
-
భీమిలిలో పచ్చపార్టీ మరో శవ రాజకీయం.. టీడీపీ జెండా కప్పి..
భీమునిపట్నం: తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ రాజకీయం చేస్తోంది. గతంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు సహజ మరణాలను సైతం రాజకీయం చేస్తోంది. విశాఖ జిల్లా భీమిలిలో ఇదే విధమైన నాటకానికి తెరతీసి అభాసుపాలైంది. భీమిలికి చెందిన వైఎస్సార్సీపీ స్థానిక నేత అప్పికొండ అప్పలనాయుడు చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా మాట లేదు. సోమవారం మరణించాడు. మంగళవారం అంతిమ యాత్ర సమయంలో టీడీపీ పార్టీ నాయకులు వచ్చి, వైఎస్సార్సీపీలో తగిన గౌరవం లేనందున తన అంతిమ యాత్రలో దేహంపై టీడీపీ జెండా కప్పాలని అప్పలనాయుడు కోరాడని చెప్పారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా జెండా కప్పి ఊరేగించారు. టీడీపీ శవ రాజకీయాన్ని అప్పలనాయుడు కుమారులు అప్పికొండ కృష్ణ, అప్పికొండ కుమార్ ఖండించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకుడైన తమ తండ్రి మృతిని టీడీపీవారు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. తమ తండ్రికి, తమకు వైఎస్సార్సీపీ అన్నా, సీఎం జగన్ అన్నా ఎంతో అభిమానం ఉందని చెప్పారు. ఏమాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్న తమ తండ్రి టీడీపీ వారితో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తమ తండ్రి చెప్పాడంటూ జెండా కప్పడం ఘోరమని అన్నారు. తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ టీడీపీ నీచ రాజకీయాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ మూడో వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అల్లిపిల్లి నర్శింగరావు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అప్పలనాయుడు మృతదేహంపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోరాడ రాజబాబు టీడీపీ జెండా కప్పారని చెప్పారు. ఇది ఎంతో హాస్యాస్పదమైందని అన్నారు. అప్పలనాయుడు చాలా రోజులుగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, అటువంటి వ్యక్తి టీడీపీ నేతలతో ఎలా ఈ విషయాన్ని చెప్పాడని ప్రశ్నించారు. అప్పలనాయుడు వైఎస్పార్సీపీకి విధేయుడని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి ఆయన్ని ఎంతగానో అభిమానించేవారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ బోని బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి సన్నాహాలు
భీమునిపట్నం: భీమిలి బీచ్ సమీపంలో కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్న సమయంలో సముద్రంలో పోర్టును ఏర్పాటు చేసుకోవడం ద్వారా వస్తువులు, సామాగ్రిని ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవారు. ఇందుకోసం ఇక్కడకు వచ్చి వెళ్లే ఓడలకు దిక్సూచిగా ఉండడం కోసం 1854లో బీచ్ వద్ద లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద పోర్టు షిప్పింగ్ కార్యాలయం, బీచ్‌కు సమీపంలో లైట్‌హౌస్ నిర్వహణ చూసుకునే సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వీటి నిర్వహణ బాధ్యత కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లింది. కాగా పోర్టు కార్యాలయంలో ఒక కన్సర్వేటర్, ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారు లైట్‌హౌస్ నిర్వహణ చేసేవారు. అయితే సిబ్బంది క్వార్టర్స్‌లో ఎవరూ ఉండకపోవడంతో అవి శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా సుమారు పది సంవత్సరాల క్రితం కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్‌హౌస్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన షిప్స్ అండ్ లైట్‌హౌసెస్ విభాగం ఆధీనంలోకి వెళ్లగా వారి పర్యవేక్షణలో ఉంది. అలాగే పోర్టు కార్యాలయం మూతపడిపోవడంతో సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసేశారు. మత్స్యకారులకు ఉపయోగం ఇక్కడ ఉన్న లైట్‌హౌస్ బ్రిటిష్ వారి పోర్టు మూతపడిపోయి కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లినప్పటికీ పని చేస్తూనే ఉంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత సిబ్బంది దీన్ని వెలిగిస్తారు. ఉదయం ఆర్పేస్తారు. ఇలా రోజూ జరుగుతుంది. కాగా భీమిలితోపాటు చుట్టుపక్కల చిప్పాడ, అన్నవరం బీచ్‌రోడ్డులోని చేపలుప్పాడ, మంగమారిపేట మరికొన్ని గ్రామాల్లోని మత్స్యకారులు రోజూ రాత్రి, తెల్లవారుజామున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుంటారు. వారికి ఇది దిక్సూచిగా ఉండి ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇది బాగా పాతపడిపోవడం వల్ల కాంతి విహీనంగా మారడంతో అంతంత మాత్రంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల క్రితం మరో ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో పెద్ద లైట్‌హౌస్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇటీవల కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి స్థల పరిశీలన కోసం అధికారుల బృందం వచ్చింది. పాత లైట్‌హౌస్ సమీపంలో శిథిలమైన సిబ్బంది క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ లైట్‌హౌస్ నిర్మించడమే కాకుండా పర్యాటకులు వచ్చి సందర్శించడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ స్థలంలో లైట్‌హౌస్ నిర్మాణం పూర్తయితే సముద్రంలో తిరిగే ఓడలకు, తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో సదుపాయంగా ఉండడంతోపాటు, పర్యాటకులు సందర్శించడానికి బాగుంటుంది. -
దారి తప్పి.. చోరీల బాటపట్టి
భీమునిపట్నం ,విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలయ్యారు... అందుకు అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఈక్రమంలో అపహరించిన బైక్‌లు విక్రయించేందుకు యత్నించగా... అనుమానించిన పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు. భీమిలి పోలీస్ స్టేషన్లో క్రైం డీసీపీ దామోదర్ వెల్లడించిన వివరాల ప్రకారం... భీమిలి సమీపంలోని బ్యాంక్ కాలనీకి చెందిన కొల్లేటి శ్రావణకుమార్(19) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ప్రధాన సూత్రధారిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన కారు మెకానిక్ కర్రిశెట్టి పైడిరాజు(21), విజయగరానికి చెందిన పల్లి రవీంద్రకుమార్(27) జట్టుకట్టారు. వీరు ముగ్గురూ కలిసి భీమిలి, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఆరు బుల్లెట్లు, ఆరు స్కూటీలు, రెండు బైక్‌లు అపహరించారు. వరుస చోరీలపై అందిన ఫిర్యాదులపై స్థానిక ఎస్ఐ కె.మధుసూదనరావు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వెల్డర్ శావణ్‌కుమార్ రోజుకో ద్విచక్ర వాహనంపై తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతనిపై కదలికలను పరిశీలించారు. ఈ క్రమంలో శ్రావణ్ ఓ మెకానిక్ షాప్ వద్దకు వెళ్లి... తన వద్ద కొత్త ద్విచక్ర వాహనం ఉందని, దాన్ని విక్రయించేస్తానని చెప్పాడు. అనుమానించిన సదరు మెకానిక్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగుచూసింది. దీంతో పైడిరాజు, రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం 14 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలతో సంబంధం ఉందని భావిస్తున్న కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ, ఇతర సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీలు గోవిందరావు, నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ బాలసూర్యారావు పాల్గొన్నారు. -
మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం
విశాఖపట్నం జిల్లా భీమిలి ఎగువపేటలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఏడు ఏళ్ల బాలికపై 15 ఏళ్ల అమ్మోరు అనే బాలుడు అత్యాచారం చేశాడు. కిరాణా షాపుకు తీసుకువెళ్తానని ఆ బాలికను అమ్మోరు చెప్పాడు. అనంతరం ఊరి చివరి పోదల్లో ఆ బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. బాలిక ఇంటికి చేరుకుని తల్లి తండ్రులకు జరిగిన సంగతిని వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారిలో ఉన్న నిందితుడు అమ్మోరును పట్టుకునేందుకు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అమ్మోరు తల్లితండ్రులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అయితే అమ్మోరు సంగతి తమకు తెలియదని పోలీసులకు వారు వెల్లడించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.