నచ్చిన అమ్మాయిని పెళ్లాడొచ్చు
భోపాల్ : ప్రేమను వ్యతిరేకించి, అవసరమైతే పిల్లల ప్రాణాలు తీసే వరకూ వెళ్లే పెద్దలనూ, పంచాయితీలను చాలానే చూశాం. విన్నాం. కానీ, ‘నచ్చిన వ్యక్తితో వెళ్లి తిరిగి వస్తే పెళ్లి చేస్తాం’ అనే పెద్ద మనసు గల సంప్రదాయాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అవును. మధ్యప్రదేశ్లోని భిల్ తెగకు చెందిన ఆదివాసీలు ఈ సంప్రదాయాన్ని ఏళ్లుగా పాటిస్తున్నారు.
ప్రతి ఏటా హోలీ పండుగకు వారం రోజుల ముందు ‘భోగారియా గిరిజన జాతర’ను భిల్ తెగ అంగరంగ వైభవంగా జరుపుతుంది. ఏటా జరిగే జాతరలో భాగంగానే యువకులు నచ్చిన యువతిపై రంగును చల్లుతారు. సదరు యువతికి అతను నచ్చితే తిరిగి రంగు చల్లొచ్చు. లేకపోతే తుడిచేసుకుని వెళ్లిపోవచ్చు. ఒకరిపై మరొకరు రంగు చల్లుకున్న జంటలు కొంతకాలం పాటు దూరంగా వెళ్లిపోతాయి. అనంతరం తిరిగి ఇంటికి వస్తాయి.
అప్పటి నుంచి వారిని భార్యభర్తలుగానే తెగ ప్రజలు పరిగణిస్తారు. సాధారణంగా ఈ వేడుకలో ప్రేమికులే ఎక్కువగా పాల్గొంటుంటారు. ప్రేమ జంటలను ఒక్కటి చేసేందుకే భిల్ తెగ పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అందుకే ఈ వేడుకను ‘స్వయంవరం’గా కూడా పిలుచుకుంటారు.
కాగా, వచ్చే నెల 23 నుంచి భోగారియా వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుక నిర్వహణ కోసం ఇప్పటినుంచే భిల్ ఆదివాసులు ఏర్పాట్లు మొదలెట్టేశారు.