జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా
జహీరాబాద్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ తరఫున జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన భీంరావు బస్వంత్‌రావు పాటిల్ సోమవారం జహీరాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కుమార్ హోటల్ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ టాపులేని జీపులో పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు డప్పు, వాయిద్య కళాకారులు నృత్యం చేశారు. పలువురు కళాకారులు కూడా పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు కె.మాణిక్‌రావు, ఎం.శివకుమార్, సి.బాగన్న, డి.లక్ష్మారెడ్డి, గౌని శివకుమార్, పి.నర్సింహారెడ్డి, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, ఎండీ యాకూబ్, అలీ అక్బర్, నామ రవికిరణ్, మురళీకృష్ణాగౌడ్, గౌసొద్దిన్, రాములు నేత, మంజులా కౌలాస్, రమాదేవి, రాములునేత, బండి మోహన్, లక్ష్మణ్ నాయక్, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
అన్నివిధాల అభివృద్ధి చేస్తా
విజయోత్సవ ర్యాలీకి ముందు బీబీ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం తనకు ఆధిక్యతను ఇచ్చిందన్నారు. ప్రజల మద్దతను ఎన్నటికీ మర్చిపోనన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ , ఉపాధి రంగాలపై కూడా దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు మూలంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన హయాంలోనే తెలంగాణ పునర్నినిర్మాణం సాధ్యపడుతుందన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.