'లంచంతో నా శాడిస్టు భర్తకు క్లీన్ చిట్ ఇచ్చారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త పోలీసు బాస్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 'మీ డిపార్ట్ మెంట్ అధికారులు లంఛం తీసుకొని వేధింపులకు పాల్పడుతున్న తన భర్తను వదిలేశారంటూ' ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. సోమవారం ఢిల్లీ కొత్త పోలీసు కమిషనర్ గా బస్సీ స్థానంలో అలోక్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకున్నారో లేదో ఓ మహిళ తన ఒడిలో రెండు నెలల చంటి బిడ్డను తీసుకొని పోలీసు బాస్ కార్యాలయం వద్దకు వచ్చి కూర్చుంది.
అక్కడే కుప్పలుగా మీడియా ప్రతినిధులు ఉన్నారు. తన అత్తమామలు, భర్త కలిసి తన బిడ్డను తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె రోధించడం ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ కు చెందిన అరిఫా అనే మహిళ పోలీసు కమిషనర్ బాధ్యతలు తీసుకునే సమయంలో గేటు వద్దకు వచ్చింది. పోలీసు అధికారులు.. తనను వేధిస్తున్న భర్త వద్ద లంఛం తీసుకొని అతడికి క్లీన్ చిట్ ఇచ్చారని, ఈ విషయం పోలీసు కమిషనర్ కు చెప్తానని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పింది. అయితే, లోపలికి అనుమతించకపోవడంతో మీడియాను ఆశ్రయించి అన్ని వివరాలు తెలిపింది. కమిషనర్ బిజీ కార్యక్రమాల వల్ల ఆమె ఆయనతో సమస్య చెప్పుకోలేకపోయింది.