ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే ఎలా?
* లోకేష్‌ను నిలదీసిన చిరువ్యాపారి
భీమవరం, న్యూస్‌లైన్: ‘మీ తండ్రి చంద్రబాబు ఆల్‌ఫ్రీ అంటూ అనేక హామీలు ఇస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల నెత్తిన భారం వేస్తారా...’ అంటూ నారా లోకేష్‌ను భీమవరం పట్టణానికి చెందిన చిరు వ్యాపారి కారుమూరి భాస్కర్ నిలదీశారు. సోమవారం స్థానిక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లో వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, విద్యార్థులతో లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాస్కర్ సంధించిన ప్రశ్నకి లోకేష్ జవాబు చెప్పలేక సమాధానాన్ని దాటవేశారు.
అగ్రవర్ణాల్లో పేద విద్యార్థులు రిజర్వేషన్ సమస్యతో సతమతమవుతున్నారని, దీనిని పరిష్కరించాలని విష్ణు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని భవాని కోరారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. ఇటువంటి పెద్ద సమస్యలపై తనను అడగవద్దని, ఇలాంటి విషయూలను ఆయన (చంద్రబాబు) చూసుకుంటారని చెప్పి తప్పించుకున్నారు.
అలాగే, తెల్లకార్డు ద్వారా మీరు పేదలకు ఎటువంటి వైద్యసేవలు అందిస్తారో చెప్పాలని వైద్యుడు పీఆర్కే వర్మ కోరగా, దీనికి కూడా ఆయనే చూసుకుంటారు అని లోకేష్ సమాధానం చెప్పడంతో ‘అయితే మీరెందు కు వచ్చారు’ అంటూ పలువురు గొంతెత్తి అరవడంతో మిగిలిన వారు నవ్వుకున్నారు. లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని గ్రహించి ఒక్కొక్కరుగా జారుకోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి.
విందు రాజకీయం
సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో కంగుతిన్న లోకేష్ విందు రాజకీయాలకు తెరతీశారు. భీమవరంలోని త్రీస్టార్ హోటల్‌కు ప్రముఖులను ఆహ్వానించి ఆయన విందు ఇచ్చారు. భోజనాలు, స్నాక్స్, చల్లని పానీయాలు అందించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన తండ్రి చంద్రబాబు సీమాంధ్రని సింగపూర్, మలేసియా, దక్షిణకొరియా దేశాలుగా తీర్చిదిద్దుతారని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఆత్మీయ సమావేశం అని పిలిచి రాజకీయ ప్రసంగాలు చేయటమేమిటని పలువురు నిలదీయడం కొసమెరుపు.