అతిగా మద్యం సేవించి ముగ్గురి మృతి!
టీడీపీ నేత భూమా నాగిరెడ్డి అనుచరుడి వివాహ విందులో ఘటన
పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవ విషయం వెలుగులోకి..
నంద్యాల: టీడీపీ నేత కుమారుని వివాహ విందులో అతిగా మద్యం సేవించి ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని బిల్లలాపురంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నేత భూమా రామకృష్ణారెడ్డి కుమారుడు రవికుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని గోల్కొండ మిలిటరీ హాస్పిటల్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇతని వివాహ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి గ్రామంలో విందు ఏర్పాటుచేశారు. రవికుమార్‌రెడ్డి మిలిటరీ క్యాంటీన్ నుంచి తెచ్చిన దాదాపు 30 విస్కీ, రమ్ మద్యాన్ని బిందెల్లో పోసి నీళ్లు కలిపి పంపిణీ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో మద్యం అతిగా సేవించిన వ్యవసాయ కూలీలు కన్నా పుల్లయ్య(46), చిలకల కృష్ణ(45), దండెబోయిన గురువయ్య(50)లు నోట్లో నురుగు కక్కుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు పుల్లయ్యను ప్రభుత్వాస్పత్రిలో, తక్కిన వారిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు మృతి చెందారు. నంద్యాల ఇన్చార్జి డీఎస్పీ ఈశ్వరరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐలు రమణ, సూర్యమౌళి, గోపాల్‌రెడ్డి బిల్లలాపురం గ్రామాన్ని సందర్శించి ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక అంచనాలో భాగంగా మద్యం అతిగా సేవించడంతోనే వీరు ముగ్గురూ మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా వాస్తవ విషయం వెలుగులోకి వస్తుందన్నారు.