స్విమ్స్ డెరైక్టర్ రాజీనామా?
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డెరైక్టర్, వైస్ చాన్సలర్ పదవులకు డాక్టర్ భూమావెంగమ్మ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 నుంచి స్విమ్స్ డెరైక్టర్‌గా, వైస్‌చాన్సలర్‌గా వెంగమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్విమ్స్‌ను వేగంగా అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ స్విమ్స్ డెరైక్టర్ పదవులకు నెల ముందుగానే రాజీనామా చేస్తున్నానని, దీనిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 20వ తేదీన రాజీనామా పత్రం అందించినట్టు తెలిసింది. అయితే రాజీనామా వెనుక గత నెలలో జరిగిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఆమె రాజీనామా చేశారని శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె రాజీనామా విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.
డెరైక్టర్ రేసులో ఆ ముగ్గురు
స్విమ్స్ డెరైక్టర్ పదవికి వెంగమ్మ రాజీనామా చేశారన్న సమాచారంతో ఆ పదవిని దక్కించుకోవడానికి రాష్ట్ర రాజధాని స్థాయిలో విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి. రేసులు ప్రధానంగా ముగ్గురు రాజకీయ పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందులో పాండిచ్చేరి మెడికల్ డీమ్డ్ యూనివర్శిటీకి చె ందిన ఎన్ఆర్ఐ రవికుమార్, బర్డ్ డెరైక్టర్ జగదీష్‌రెడ్డి, రుయా మాజీ సూపరింటెండెంట్, ఆశాలత టెస్ట్ ట్యూబ్ బేబి ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. డెరైక్టర్ పదవికోసం గతంలో ప్రయత్నించి విఫలం చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఈసారి ఎలాగైనా పొందాలని పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.