Bhutpur
-
‘పాలమూరు’కు 800 ఏళ్ల చరిత్ర
భూత్పూర్ (దేవరకద్ర): పాలమూరుకు 800 ఏళ్ల చరిత్ర ఉందని, నిజాం నవాబు మహబూబ్ అలీ పేరు మీదుగా జిల్లాగా ఏర్పడిన మహబూబ్‌నగర్ అసలు పేరు పాలమూరు అన్న సంగతి తెలిసిందేనని పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. శనివారం భూత్పూర్ మండలం తాటికొండలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పురాతన కాలం నాటి శిల్పాలు గుర్తించామని ఆయన తెలిపారు. జడ్చర్ల సమీపంలోని గంగాపురం - నెక్కొండ దారిలో రాచమల్ల వారి దొడ్డి పక్కన పొలంలో ఉన్న క్రీ.శ.1,141 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి రెండో జగదేక మల్లుని శాసనంలో పేర్కొన పాల్మురు, పాలమూరేనని పేర్కొన్నారు. కీ.శ.1128 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుని శాసనంలో పేర్కొన్న పిల్లలమర్రి, మహబూబ్‌నగర్ శివారులోని పిల్లలమర్రిగా గుర్తించవచ్చన్నారు. క్రీ.శ.12వ శతాబ్దికే పాలమూరు పట్టణం, పక్కనే పిల్లలమర్రి ఉనికిలో ఉన్నాయన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన.. మృతులు కడప జిల్లావాసులు మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మర ణం చెందారు. మృతులు ఏపీలోని కడప జిల్లావాసులు. కడప జిల్లా చిన్నమండెం మండల కేంద్రానికి చెందిన హరి కిరణ్, స్వప్న, బంధువులు చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన శ్రీధర్, జ్యోతి దంపతులు, వీరి కుమారుడు సాయితో కలసి కడప జిల్లా మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి తిరిగి హరి కిరణ్‌కు చెందిన కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని భూత్పూర్ సమీపంలోని ఫ్లైఓవర్ దిగిన వెంటనే ముని రంగస్వామి దేవాలయం ఎదుట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పింది. పక్క నుంచి వెళ్తున్న లారీ కిందకు కారు వెళ్తుం దేమోనని భావించి హరికిరణ్ స్టీరింగ్‌ను డివైడర్ వైపు తిప్పాడు. దీంతో కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలి వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్(30) జ్యోతి(27), సాయి(8) అక్కడికక్కడే మృతి చెందా రు. తీవ్రంగా గాయపడిన హరి కిరణ్(27), స్వప్నలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా హరికిరణ్ మృతి చెందాడు. నిద్రమత్తులో హరికిరణ్ డ్రైవింగ్ చేస్తుండడంతో మార్గమధ్యంలో పలుసార్లు కారు అదుపు తప్పబోయింది. ఈ క్రమంలో భార్య స్వప్న అతడిని హెచ్చరించి అప్రమత్తం చేసింది. హరికిరణ్ హైదరాబాద్ బోడుప్పల్లో భార్యతో కలసి నివాసముంటున్నాడు. అతడు మెగాటెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. శ్రీధర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పీఈటీ. హరికిరణ్, స్వప్నలకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి పిల్లలు లేరు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
భూత్పూర్ : మండలంలోని అమిస్తాపూర్‌కు చెందిన బక్కా జగదీశ్ (60) కు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. పదేళ్లుగా అందులో వివిధ రకాల పంటలు సాగుచేయడమేగాక ఓ కోళ్లఫారం ఏర్పాటుచేసుకున్నా ఆశించిన ఫలితం దక్కలేదు. వీటికోసం గతంలో చేసిన సుమారు మూడు లక్షలు తీర్చలేకపోయాడు. దీంతో వాటిని వదులుకుని ఏడాది కాలంగా స్థానికంగా ఉన్ని సంఘంలో చేనేత కార్మికుడిగా పనిచేసినా కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఈయనకు భార్య మణెమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలోనే ఇద్దరు కుమారులు హైదరాబాద్‌కు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. భర్త వదిలిపెట్టడంతో రెండేళ్లుగా చిన్న కుమార్తె పుట్టింట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అందరినీ పోషించలేక పోయాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి తమ పొలంలో ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.