bhuvanagiri parliament constituency
-
లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే సీపీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉన్న సీపీఎం.. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాని నిర్ణయించుకుంది. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించిన సీపీఎం మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. -
భువనగిరి ఎంపీ సీటు నాదే: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ: భువనగిరి ఎంపీ సీటు తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సీట్లు ఎక్కువ ఇవ్వాలని సూచించారు. అలా అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాజగోపాల్‌రెడ్డికి సీటు ఇవ్వొద్దని సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలవరకు అభ్యర్థుల పేర్లు ఖరాయినట్టు సమాచారం. -
భువనగిరి నుంచి పోటీ చేస్తాననలేదు: పొన్నాల
న్యూఢిల్లీ: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తాను చెప్పలేదని, అది కేవలం డీసీసీ ప్రతిపాదన అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. సీపీఐతో పొత్తుపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. రేపు, ఎల్లుండి అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని చెప్పారు. ఈ నెల 28న అభ్యర్ధుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పొన్నాల తెలిపారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పొన్నాల లక్ష్మయ్య లేదా ఆయన కోడలు పోటీ చేసే అవకాశముందని మీడియాలో ప్రచారం జరిగింది. -
‘పాదయాత్ర’ లొల్లి!
యాచారం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోమారు బయటపడ్డాయి. శుక్రవారం యాచారం మండలం గునుగల్లో చేపట్టిన యువజన కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సిద్దంకి కృష్ణారెడ్డి గురువారమే పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు. అయితే శుక్రవారం ఉదయం కృష్ణారెడ్డి తదితరులు గునుకుల్కు రాకముందే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల దాసు, హయత్‌నగర్ మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డిలు పాదయాత్రను ప్రారంభించేశారు. పాదయాత్ర గునుగల్ గేట్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకోగానే క్యామ మల్లేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి తదితరులు వారికి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్‌లో క్యామ మల్లేష్ వర్గానికి చెందిన కొందరు మరోమారు పాదయాత్రను ప్రారంభించాలని కోరడంతో మళ్లీ ప్రారంభించారు. దీంతో రెండు వర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు అర కిలోమీటర్ తేడాతో పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు ఏ గ్రూపులో ఉండి నడవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. మల్రెడ్డి రాంరెడ్డి ప్రారంభించిన పాదయాత్రలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వెంకట్‌రెడ్డి, మంకాల దాసు, గునుగల్ సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్ తదితరులు పాల్గొనగా, క్యామ మల్లేష్ ప్రారంభించిన పాదయాత్రలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దెంది రాంరెడ్డి, గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్, గునుగల్, యాచారం, నక్కర్తమేడిపల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్నా: రజితారెడ్డి మహిళల కోటాలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సిద్దంకి రజితారెడ్డి వెల్లడించారు. రాహుల్ గాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి సూచనల మేరకే పాదయాత్ర చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనువాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, యాలల యాదయ్య, కుంటి నర్సింహ, కన్నరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భువన‘గురి’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ కొత్తకొత్త వార్తలు ఆసక్తి పుట్టిస్తున్నాయి. రాజకీయంగా ఏ సమీకరణాలతో ఓ నిర్ణయానికి వస్తున్నారో కానీ, పలువురు నేతలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణవాదం బలంగా ఉందని భావిస్తున్న ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడం విశేషం. భువనగిరికి కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నా, అదే పార్టీకి చెందిన పలువురు ఇదే స్థానాన్ని ఆశిస్తుం డడం గమనార్హం. జనగామ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈసారి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జనగామ నుంచి తన కోడలు పొన్నాల వైశాలిని బరిలోకి దింపితే తాను భువనగిరికి వస్తానని ఈ ప్రాంత నేతలతో ఇప్పటికే ఆయన మంతనాలు కూడా జరిపారని సమాచారం. అలా కుదరని పక్షంలో తన కోడలినైనా ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే మాదిరిగా, గతంలో వరంగల్ జిల్లా చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సైతం అవసరమైతే బీజేపీ అభ్యర్థిగా భువనగిరి లోక్‌సభస్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంటు నుంచి వరంగల్ జిల్లాకే చెందిన టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే, జిల్లా టీఆర్ఎస్ వర్గాలు, నాయకులు మాత్రం అలాంటిదేమీ లేదన్న జవాబిస్తున్నారు. జిల్లా టీడీపీకి... కొంత ఊరట ఇపుడు తాజాగా, టీ టీడీపీ ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తా..’ అని ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లా టీడీపీ వర్గాలకు కొంత ఊరట ఇచ్చే అంశమే. గత ఎన్నికల్లో జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి పరిస్థితి జిల్లాలో దయనీయంగా తయారైంది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడం, గ్రూపు తగాదాలను పరిష్కరించి, పార్టీని గాడిలో పెట్టడంలో అధినేత విఫలం కావడంతో టీడీపీ శ్రేణులను నిస్తేజం ఆవరించింది. వాస్తవానికి ఆ పార్టీకి పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులే కనిపించడం లేదు. నల్లగొండ లోక్సభాస్థానానికి నాగార్జునసాగర్ ఇన్చార్జ్ తేరా చిన్నపురెడ్డి పేరు ఓసారి వినిపించింది. అయినా, ఆయన సాగర్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీకి సుముఖంగా ఉండి, ఆ మేరకు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. ఇక, భువనగిరి లోక్‌సభా స్థానానికి పోటీ చేసేందుకు ఇటీవల కాలంలో ముందుకు వచ్చిన నాయకుడు ఒక్కరూ లేరు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు భువనగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. కారణం... ఏంటబ్బా..! అయితే, ఎర్రబెల్లి ఈ ప్రకటన చేయడం వెనుక ఉన్న కారణాలపై జిల్లా టీడీపీ నేతలు సైతం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే... భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉన్నాయి. గతంలో ఆలేరు నుంచి రికార్డు సంఖ్యలో టీడీపీ గెలిచిన చరిత్ర ఉంది. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంటులో బలమైన ఓటు బ్యాంకు ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణవాదం బలంగా ఉన్న ఈప్రాంతం నుంచి బరిలోకి దిగితే, టీడీపీలో తెలంగాణవాణిని బలంగా వినిపించిన నేతగా ముద్ర ఉన్నం దున తనకు కలిసి వస్తుందని భావించడం. ఇలా... ఎవరి విశ్లేషణ వారు ఇస్తున్నారు. అయితే, పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన ఈ పరిస్థితుల్లో చేసిన ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి భువనగిరి పార్లమెంటు స్థానం ‘హాట్ సీటు’గా మారడం విశేషం. -
అభిప్రాయ సేక‘రణం’
భువనగిరి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై సోమవారం ఏఐసీసీ ప్రతినిధి సేవక్ వాఘే పార్టీ నాయకులు, కార్యకర్తలనుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భువనగిరి రహదారిబంగ్లాలో సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఇన్చార్జ్ కుమార్‌రావు, సత్యనారాయణలు వేదికపై ఉన్నారు. వారి సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు ఇరువర్గాలుగా మారి దాడికి దిగారు. ఈ దాడిలో కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికన్నా సిట్టింగ్‌లో ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వద్దని ఫిర్యాదులు చేసుకున్నారు. ఒక దశలో పరిశీలకుడు ఫిర్యాదులు కాకుండా పోటీ చేయాలనుకునే వారు తమ పేర్లను ఇవ్వాలని సున్నితంగా ఫిర్యాదులను తిరస్కరించారు. అయినా ఇరువర్గాల కార్యకర్తలు ఎవరూ ఆగలేదు. ఇంతకాలం ఘాటైన విమర్శలు చేసుకుంటూ వచ్చిన ఇరువర్గాలు తిట్ల పురాణం అందుకుని చెప్పులు, కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసురుకోవడంతో పరిశీలకుడు ఉన్న రహదారి బంగ్లా ఆవరణ రణరంగంగా మారింది. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంకు చెందిన పలువురు నేతలు తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కాగా పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారిగా ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు బ్లాక్, మండల, యువజన కాంగ్రెస్ అధ్యక్షులనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎవరి అనుచరులు వారికే... ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పేరును అన్ని నియోజకవర్గాల నుంచి ఆయన అనుచరులు సూచించారు. అలాగే మంత్రి పొన్నాల లక్ష్యయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, గర్దాసు బాలయ్య, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమరెడ్డి, దూదిమెట్ల సత్తయ్యయాదవ్ల పేర్లను వారి అనుచరులు సూచించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్పేరును అన్ని మండలాల బ్లాక్, మండల కాంగ్రెస్ ప్రతినిధులు సర్పంచ్‌లు సూచించారు. అలాగే మచ్చ చంద్రమౌళి గౌడ్, వంచవీరారెడ్డి, పల్లె శ్రీనివాస్, పర్వతాలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంనుంచి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతోపాటు కొండేటి మల్లయ్య, సాయిలు టికెట్ ఇవ్వాలని కోరారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మామిడి నర్సయ్య, శ్యాంసుందర్‌లకు టికెట్ ఇవ్వాలని వారి అనుచరులు ఏఐసీసీ దూతకు సూచనలు చేశారు. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, ముంగి చంద్రకళ, సుంకరి మల్లేష్‌గౌడ్‌లకు అనుకూలంగా సూచనలు వచ్చాయి. ఇబ్రహీంపట్నం నుంచి క్యామ మల్లేష్, రంగారెడ్డి శేఖర్‌రెడ్డిల పేర్లను వారి అనుచరులు సూచించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామాంజ నేయులుగౌడ్, గర్దాసు బాలయ్య, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంక టేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పింగల్రెడ్డిలకు అనుకూలంగా సూచనలు చేశారు. జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్యయ్య, వైశాలి, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు అనుకూలంగా వారి అనుచరులు సూచనలు చేశారు. పలుమార్లు ఉద్రిక్తతం అభిప్రాయ సేకరణ సందర్భంగా కార్యకర్తలు బయట పరస్పరం దూషించుకునే విధంగా నినాదాలు చేసుకోవడంతో సమావేశ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ ఇరువర్గాలను సముదాయించారు. పోటా పోటీగా నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో రహదారి బంగ్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. పరిశీలకుని ముందు అభిప్రాయాలు చెప్పే విషయంలో నాయకులు ఇబ్బందులు పడ్డారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని దామోదర్‌రెడ్డి పరిశీలకునికి ఫిర్యాదు చేశారు. పరిశీలకుని వద్ద ఎవరూ లేకుండా చూడాలని పలుమార్లు పరిశీలకుడిని కోరారు. ఒక దశలో పరిశీలకుని ముందే ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరువర్గాల కార్యకర్తల నినాదాలతో రహదారి బంగ్లా ప్రాంతం నిండిపోయింది. బయట కార్యకర్తలు ఘర్షణ జరుగుతున్న సమయంలోనే సాయంత్రం వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని పరిశీలకుడు బయపడ్డారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.